17, జూన్ 2019, సోమవారం

అమ్మ కాబట్టి
ఆలోచనల చెట్టు కొమ్మలు
ఆకాశాన్ని అందుకోబోతుంటే
ఆకులు రాల్చిన కొమ్మల అంచులు
వేదనల ఊయలలను మోయలేని మోడులయినాయి
పసితనపు కేరింతలతో మురిసిన మనసు
మూసిన రెప్పల క్రింద ఆరని తడిగా మారింది
ఖాళీగా మారిన ఒడిలో అమ్మతనం వెతుక్కుంటూ
జోల లేని పాటలోని జాలిగా మిగిలింది
చిత్రకారుని కుంచెలో చిత్రంగా నిలిచిన పసివాడు
హృదయ ఫలకంపైన చెరిగిపోని గీతల్లో
బోసినవ్వుల బొమ్మ అయినాడు
లోలోన పారే రక్తపు ధమనులతో ఆడుకుంటూ
మార్చలేని తలరాతను మౌనసాగరంలో ముంచేసి
మృతమైన బ్రతుకును జీవిస్తున్నట్టుగా నటింపజేస్తూ
పెదవంచున ఆవేదనను అధిమిపెట్టి
తనని తాను సమర్పించుకుంటుంది స్త్రీ ఎప్పటికీ ..
తాను "అమ్మ కాబట్టి " !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి