31, డిసెంబర్ 2022, శనివారం

 



*క్యాలెండర్!*

నిన్నని గుర్తు చేస్తూ..
రేపటికి ఆశని రేపుతూ..
గోడ మిద స్థిరమై..
రెపరెపలాడుతూ...
కనిపించే క్యాలెండర్..!
క్షణాల పాకుడు మెట్ల పై
నుండి పాదరసంలా
జారిపోతున్న కాలాన్ని
అంకెల్లో బందించ లేక
చిత్తరువై నిలిచే క్యాలెండర్..!
నెల చివరి రోజున కాళి అయిన పర్స్ ని..
తీరని అవసరాల ఆకళ్ళతో బేరీజు వేసుకుంటూ..
మొదటి తారిఖున వచ్చే జీతంకోసం
వేచిచూసే మద్యతరగతి మందహాసాన్ని..
నిస్సహాయంగా చూసే..క్యాలెండర్..!
సెలవు రోజులను ప్రత్యేకంగా చూపెడుతూ...
శ్రమ జీవులకు హమ్మయ్య..అనిపిస్తుంది..
పండగలను...జాతీయ పర్వదినాలను..
తనలో ఇముడ్చుకొని..మరీ..వెతుక్కోమంటుంది ..
మనలో ఒక భాగమైన నిత్య యవ్వని క్యాలెండర్!

కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
గడిచిన నిన్నలను గుప్తంగా దాస్తూ
పన్నెండు నెలలను తన నిధిలో నింపుకుని
తప్పుకుంటుంది మరో కొత్తదనానికి చోటిచ్చి,
తాను మిగిలుతుంది ఓ వ్యర్ధంగా క్యాలెండర్!!

******
సుజాత తిమ్మన
హైదరాబాదు.