17, జూన్ 2019, సోమవారం

ఎండావానలకు నెరవని
పాలబుగ్గల పసితనం
కాలేకడుపుల ఆకలి
కేకలకు ఆహారమవుతుంది
బండలు మోసే
బడుగు బ్రతుకు
తెలియరాని భవిష్యత్తు
పటంలో చిత్రమే అవుతుంది ..!
దాలు లక్ష్మి నారాయణ గారు ..
శీర్షిక ; "సీతాకోకచిలుకై .".
స్వాతి చినుకులు
కురిసే వేళా ..
సంబ్రంతో మది నాట్యమాడి ..
రంగు రంగుల భ్రమరమై
లోకాలన్నీ చుట్టేస్తున్నది...
తరలిపోతున్న మేఘాల పైనుండి
పచ్చని పచ్చిక తివాచిని తాకుతూ
వంగింది ఇంద్రధనుసు ...
ఇటునుంచటు ...
అటునుంచిటు...
ఉరకలు వేస్తున్నది..
పరుగులు తీస్తున్నది ..
అల్లరిగా మనసు ..
సీతాకోక చిలుకై..
పూవు పూవున వాలి
మధువునంతా గ్రోలి ..
దాచుకుంటుంది ఎదగదిలో ..
పచ్చని చెట్టువలె హృదయం
ఆ మధువుకు ఆసరా తానవుతుంది..
ఎంత ఆనందం..
సీతాకోకచిలుక బ్రతుకు ధన్యం..
ఉరుములు , మెరుపులు జడి వానలు
పెను తుఫాను ..ఉప్పెనలు ..
ఆషాడం దాటిన శ్రావణంలో
ఊహకందని దారుణం
చెట్టు కూలిపోయెను..
దాచుకున్నది జారిపోయెను ..
రెక్కలు చిరిగి ..తనువు విరిగి ..
అందని ఊపిరితో ఆ క్రిమి
అల్లాడుతూ అసువులు బాసెను ...
మనిషి జీవితం ...
ఓ రంగు రంగుల
ఆర్బాటం..
అందుకోవాలన్నది దొరకదు..
దొరికినది అక్కరకు రాదు..
సమన్వయపు తూకంలో
జీవించటం తప్ప ..
గత్యంతరం లేదు..
భ్రమరమై తిరిగితే ..
బడుగు నీటి పాలుగాక తప్పదు మరి..!!
- సుజాత తిమ్మన..
హైదరాబాదు..18/7/2018
************************************
 'వి'లేని అజ్ఞానం
కొన్న చదువులకలంకారమైన జ్ఞానం
లోన మనిషిని చంపేసి
స్వార్ధం గంధం పూసేసి
అవకాశాల అసత్యపు రాజ్యమేలుతుంది
ఏసీ రూముల్లో తిరుగాడుతూ
నకిలీబాబాల మందహాసపు పెదవులపై నర్తిస్తూ
పదాల ప్లాష్టిక్ పూలను వెదజల్లుతూ
'వి'లేని అజ్ఞానానికి బాధితులుగా చేస్తుంది ..!
*****************
సుజాత తిమ్మన .
అధ్యాయం *********
నిరాకార తత్వానికి సాకారాన్ని
నింపుకున్న సత్యమే జీవితం
తల్లిగర్భంలో పిండాకృతిని దాల్చిన
జీవానికి రక్షణ కవచంగా నిలిచిన గర్భాశయం
కాళీ అధ్యాయాల బ్రతుకు పుస్తకాన్ని
ముందు ఉంచుతుంది ఊపిరి తీసుకున్న క్షణంలోనే ..
జనన కాల పరిమితులకు
నక్షత్ర స్థితిగతులననుసరిస్తూ
అధ్యాయం మొదలవుతుంది
తల్లిపొత్తిళ్లలో వెతుక్కునే చనుబాల పోరాటంతో ..
మనిషి కనిపెట్టిన విజ్ఞానం
మృత్యువుని శాసించలేని బేలయింది
పుట్టుకతోనే లిఖించుకొచ్చుకున్న ఆయువుతో
మరణాన్ని కౌగలించుకొని పరిసమాప్తమవుతుంది అధ్యాయం ..!!
మధుర భావాలు
మనోహరమైన వేళ
నాట్యమాడుతుంది మనసు
పురివిప్పిన నెమిలై
జ్ఞాపకాల చిట్టా విప్పి
అరచేత చేర్చుకుంటుంది
ఆ స్పర్శల ఆలింగనాల
వొదిగుటుంది మైమరపై !!
 "పసిడాభిషేకాలే "
వయసుతో వచ్చిన మార్పుల్లో
దాగివుంటుంది పెద్దరికం శరీరపు ముడుతల్లో
ఎన్నెన్ని ఆలోచనల అనుభవాలో
శూన్యపు చూపుల సారాలో గాజుకన్నుల్లో
మారిన విలువలను మారని కాలాలలో
వెతుక్కుంటున్నవి శుష్కిస్తున్న బ్రతుకుల్లో
ఏమార్చి చూసుకోండి పసినవ్వులలో
పెద్దరికానికి పసిడాభిషేకాలే ఆ లేతపలుకుల్లో ! !
 "నరకకూపమైంది నగరం ."
నాగరికతని పరదాగా వేసుకుని
వివస్త్రగా మారి విచిత్ర నాట్యం
చేస్తోంది వింతపోకడల నగరం ...
పగలు రాత్రి తేడాలను మరచి
స్త్రీ పురుష భేదాలను విడిచే
వికృత ప్రకృతికి ఆవాసమైంది నగరం
శిక్షలకు నెరవని నేరాల వికటాట్టహాసాలు
ఆడపడచుల ఆర్తనాధాలతో నరకకూపమైంది నగరం ..!
లేత మనసు
మూడేళ్లు నిండని పసివాడు ..
ఆకలి తెలియదు కానీ అల్లరివాడు
నేల తల్లి ఒడిలో జోగాడుతూ ..
మట్టి పులుముకున్నా
యవ్వారం తెలియని వాడు
ఆటల్లో ఆకతాయి తనం అయినా
ఇదంతా తనదే రాజ్యం అన్న ధీమా
తరగని పౌరుషం తో కూడిన రాజసం
.'సింహాసనం ఇటుకలదయితే ఏంటి ..
నేనే బాహుబలిని ..
ఈ రాజ్యం అంతా నాదే '
అనుకునే లేత మనసుగల పసివాడు ..
మనిషి ఎదగ కుండా అలా
పసివాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు
నీది నాది అన్న తేడాలు .
పేద గొప్ప అన్న బేధాలు ..
ఇవేమి లేని కల్మష రహిత జీవితం
అందరి సొత్తు అయేది కదూ ..!
నా అన్నదానికి
నిర్వచనమైన నాన్న
నలుగురిలో అత్మ బలాన్ని
అందించు నాన్న
ఆకలి కడుపుకు
గింజలేరుకోవడం నేర్పు నాన్న
పసితనాన్ని భుజాలపై మోసినా
వయసుడిగిన రోజు భుజంకోరు నాన్న! !

అమృతకలశం "
పూవులలోని మధువునంతా
ఎంతగా తాగినాయో ఈ పెదవుల తుమ్మెదలు
తేనె బరువుకు వాలిపోతున్న రెక్కలవోలె
ఒంపులు తిరుగుతూ మైమరస్తున్నవి చెలి
చిలిపి చేష్టల తుళ్ళింతలతో
కొలనులో పరిగెట్టే చేపలను పోలిన కనులు
ఎదలోని అనురాగాల ఆలాపనలను
మౌనంగా వినిపిస్తూ అరమోడ్పులవుతున్నవి చెలి
గులాబీల సోయగాలను చేమంతుల చెమరింపులతో
రంగరించి పోతపోసినారేమో ఈ చెక్కిళ్ళను
నన్ను నీలో చూపిస్తూ ఉంటే
నేనే నీవన్న ..నీలో నేనున్న నిజం
యమునలో విరిసిన ఈ పద్మం
నీటికై నీతో వచ్చిన ఈ కడవ సాక్ష్యం కదూ చెలి
ఈ రాధాకృష్ణుల ప్రేమ తత్వం
అజరామరమైన సుందర సుధా మధుర కావ్యం
అనురాగాల ఆరాధనల అద్వైత్యమైన భక్తి విశ్వాసాలకు
ఆదర్శమై నిలచిన అపురూపమైన అమృత కలశం
అచంచలమైన నిత్యయవ్వన చరితం రాధామాధవీయం !
తెలుగు పూలతోట సమూహంలో నందనవనం చిత్రకవితా పోటీలో ..
అక్షరాలను అరగదీసి ఎదపలకపై దాచేసి
చదువులమ్మ వొడిచేరి జ్ఞానసంపదను దోచేసి
పల్లెపల్లెకు పోయి అక్షరసేద్యం చేస్తూ
అఖండమైన విజ్ఞానదీపాలను వెలిగిద్దాము ..!!
-సుజాత తిమ్మన
"మెట్టినిల్లు "
మొగ్గగామురుస్తూ పూవైవిరిసి కులికే ముగ్ధ
మూలమైన అమ్మానాన్నల మురిపాల ముదిత
మూడుముళ్లు వేసి వేలందించిన మగనితో
ఆశలపల్లకీఎక్కి సాగిపోతుంది ఆకాశమంత ఆనందంతో
అమ్మ పాలు పంచుకున్న అనుబంధం ఆత్మబలమై
ఆత్మీయతల ఆహారాన్ని అందించేది పుట్టిల్లయితే
అత్తమామల ఆదరణతో మైనపువత్తై కరిగే ..
అమ్మాయికి భర్తవక్ష స్థలమే తన మెట్టినిల్లవాలి !!
"రెప్పలు "
ఆకృతి దాల్చే అంకురాన్ని తన
గర్భంలో దాచుకునే అమ్మతనమే
కదూ! కంటి రెప్పలది ..
అమ్మ పేగుబంధంనుండి విడివడి
జన్మతీసుకున్న క్షణం నుండి
కనుపాపలను కాపాడుతూనే ఉంటాయి రెప్పలు
అలసిన తనువును సేదతీర్చ
కళ్ళని కప్పేసి మరోలోకపు
నిద్రమ్మ ఒడిలో కలలజోలలు పాడుతాయి రెప్పలు
మండుటెండలకు ఛత్రమైనట్టే
జడి వానల్లోనూ గొడుగులవుతూ
హోరుగాలుల దాడి జరగనీయవు రెప్పలు ..
బహిర్గతంగా తమ కృషికి భంగం
రానీయకుండా కంటి
పాపలను రక్షణ నిస్తాయి రెప్పలు ..
కానీ ...
చెదురుతున్న చూపులను
అదుపుజేయ రెపరెపలాడుతాయి రెప్పలు
ఆనందాతిశయాలతో పరవళ్లు ద్రొక్కే గోదారిలానో
లేక
వేదనాభరిత హృదయసంద్రంలో
కల్లోలమవు సంఘర్షణల ఉప్పెనలతో కన్నీళ్లు
చెంపల చేలను ముంచేస్తూ ఉంటే
అదుపుచేయలేక అసహాయమవుతాయి రెప్పలు ..
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం ' అన్న
సూక్తిని నిక్షిప్తం చేసే నిదర్శనమే రెప్పలు ..!
ఎదురు చూపుల దారిలో..
ఎదురు చూస్తుంది
చకోర పక్షి
స్వాతి వాన చినుకుకై
జల జలా రాలాయి
వర్షపు చినుకులు
మండుటెండలను
కప్పేస్తున్న మేఘాలను
చీల్చుకుంటూ
ఎంత సంబరమెంత
సంబరమో ...
రెక్కలల్లారుస్తూ
చకోరానికి
ఒంటికాలి విన్యాసాలే ...
అలల పై తేలుతున్న
ఆల్ చిప్పలు
అలవోకగా ఆ
చినుకులను పట్టేసి
కడుపులో దాచుకుని
పోయాయి సంద్రమడుగుకు
ఆనందంలో ఒళ్ళుమరచిన
పక్షి నిజం తెలుసుకునేంతలో
ముత్యాలయిన స్వాతి చినుకుల
చూస్తూ మురిసిపోతున్నాయి
ముత్యపు చిప్పలు ...
చకోరం కంటివెంట
కన్నీటి చుక్కలు
ఎదురు చుపుల దారిలో
తిరిగి చిక్కుకున్నాయి ....!..
*****

ఆకలంటే తెలియని ఆకతాయి
అడుగున్నర బుజ్జాయి
అమ్మానాన్నల ప్రేమను
దోచిన గడుగ్గాయి
తనదనుకున్నది ఇతరులకి
ఇవ్వాలనుకునే ప్రేమమయి
పావురాలతో చెలిమి చేస్తూ
పరవశించే స్నేహమయి ...!!
భారత స్త్రీ "
బ్రహ్మ చేతిలో బొమ్మగా రూపుదిద్దుకుని
పుడుతుంది అమ్మాయిగా ..
మొదటి శ్వాసలో కేరుమన్న క్షణం నుండి
ఆహా ఆడపిల్లా ..ఓహో ఆడపిల్లా .అనే
చురుకు మనిపించే చూపులలో చిక్కుకుంటూ
ఉన్నత విద్యలెన్ని అభ్యసించినా
ప్రకృతి పరంగా అసహాయ అయినా అతివ
రాబందుల వంటి కామాంధులకు
బలి అవుతూనే ఉంది ..
కుటుంబ వ్యవస్థలోను మగువ ఓ
మైనపు వత్తి వలె తానూ కాలుతున్నా
వెలుగులు పంచుతూనే ఉంది
అమ్మగా ఆత్మీయతను పంచుతుంది
ఆలిగా అనురాగాన్ని అందిస్తుంది
తనవారనుకుంటూ ప్రతివాళ్ళకి సేవలు చేస్తుంది
అయినా ఈసడింపు మాటల కోతలకు
రక్తధారల కన్నీటిని రెప్పల వెనుక దాచేస్తుంది ..
ఆమె ..సగటు భారత స్త్రీ ..!!
"అక్షతలు "
పాలు గారు చెక్కిళ్ళు
పెదవంచున ముచ్చట్లు
మొలక నవ్వుల అచ్చట్లు
బొజ్జ నిండిన అగచాట్లు
నెమలీకల వింజామరలు
జోల పాటల ఆలాపనలు
మూసిన రెప్పల విరితామరలు
యశోద వొడి చేరిన ఆమనులు .
కన్నయ్యకొసగిన ఆశీస్సుల అక్షతలు ..!!

శ్రీవేంకటేశా...
సప్త వర్ణాలతో శోభిల్లు
సప్తగిరులపై వెలసిన
శ్రీవేంకటేశా...
సిరులనొసగు తల్లి
శ్రీ లక్ష్మినే ఎదపై
నిలిపిన శ్రీనివాసా ...
శేష పాన్పుపై సుఖముగా
శయనించు హరివి నీవు
ధూర్తుల సంహరించుటకు
బాధితుల రక్షించుటకు
యుగపురుషుడవై ..
అవతరిస్తూ ..
దశావతారాల ప్రజల
ఆపదల గాచినావు ..
అలసిసొలసి శేషాద్రి చేరి
పుట్టలో సేద తీరినావు .
గోమాత నీ ఆకలి తీర్చ ..
వకుళా మాట నిన్ను
ఆదరించి తనయుని చేసుకుని
.తరించినదిగాదా ..
వనములో పద్మావతిని చూసి
మనసుపడినావే ...
ముగ్ధ మనోహరి ముదిత
పద్మావతి ఆరాధనల నిను
బంధించెనే ...
ఆనందముతో ఆకాశరాజు
కన్యాదానము చేసి
అప్పగించెను ఆత్మ సమాన
తన అనుంగు పుత్రికను ..
వేడుక చేయ వివాహములో
ధనమునకై కుభేరునితో
భేరము కుదుర్చుకుని
వడ్డీకి అప్పు తీసుకుంటివే స్వామి ..
నీ బాకీ తీర్చుకొనుటకు మాచే
ముడుపులు కట్టించుకుంటూ
ఆపదల ఆదు కుంటున్నావే స్వామీ .
అందుకే నీవు వడ్డీకాసుల వాడివయినావు
అందుకే నీవు ఆపద్భాంధవుడవాయినావు
అందుకే నీవు ఏడుకొండలవాడివయినావు
అందుకే నీవు శ్రీ నివాసుడవాయినావు
అందుకే నీవు శేషాద్రి వాసుడవయినావు
అందుకే నీవు కలియుగదైవమయినావు
అందుకే నీవు అన్నీ నీవయినావు ..స్వామీ !
అందుకే నీవు శ్రీ వెంకటేశుడవయినావు స్వామీ !!
గోవిందార్పణం ...__/\__...

ఆకలి రాజ్యం .
శీర్షిక : కేకలు లేని ఆకలి .
కడుపులో జఠరాగ్ని కాలుస్తున్నా
ఆర్పుకోలేనితనం
అసహాయులను చేస్తుంది
భూమిని చీల్చుకొని
మొలకలేసిన పంట
పదింతలు ధాన్యం ఇచ్చినా
దళారిబాబుల
దౌర్జన్యాలలో చిక్కి
ధనంగా రూపాంతరం చెంది
వారి ఇనప్పెట్టెల్లో దూరిపోతోంది ...
కేకలులేని ఆకలి
రైతన్నకు ఉరైబిగుసుకుంటూ !
***********

లోకం తెలియని
పసిమనసు నీది
పంజరమే ప్రపంచంగా
జీవించినావే
ఆశల ఆకాశం పైకి
ఎగరాలనే
ఆరాటాలేలనే చిలుకా
రాబందు రక్కసికోరలకు
చిక్కి నీవు ఏమీ
మిగలవని తెలుసుకోవే ..!!
ట్టి చిట్టి చేతులంట
అంత లోకాన్నే మూసేనంట
అమ్మయినా నాన్నయినా నాతో ఆటలే ఆడాలంట
రోజూ పిలిచేది బంగారు తల్లంట
గోరుముద్దల ముద్దులిస్తే ముంజేత పూసేను గోరింట !
ఒకరిలో ఒకరు ..
ఈ మురళి మూగబోయినది ..
రాధా ...
నీ తలపులు నాలో చేసే అలజడులలో
ఏవి ఏవీ ...
యమునా నది పరవళ్లలోని
.ఆ గలగలలు ..
ఏవి ఏవీ ..
పొదపొదకు చిక్కుకున్న
నీ చూపులదారాలు ..
ఏవి ఏవీ ..
ప్రణయ కలహాలను విడిచి
ఒకరిలో ఒకరమైన దృశ్యాలు ..!
నీ మూసిన కనురెప్పల రక్షణలో
దాగుంటినీ కృష్ణా .
మౌనించినది వేణువైనా ..
కృష్ణా ..
నీ మదిపొరల ఆరాధనలలో
ప్రాణమైన రాగమైతినిగా
కృష్ణా ...
నీవున్న చోటే ఈ రాధకు బృందావనము
నీ చిత్రానికి ఛాయగా మిగులుటకే
ఈ రాధ జీవనము ..కృష్ణా ..!!

ఆత్మసంతృప్తి
అక్షరీకరించుకున్న సత్యాలను
ఆనవాయితీగా మలచుకుని
శ్వాసించగలిగే జీవితం ఎప్పుడు
ఆత్మసంతృప్తిని అందిస్తుంది ..
ఆటుపోట్లకి జడుస్తూ కష్టాలు
కొలుములని వెఱపు చెంది..
నిబద్ధతలేని ధర్మధూషణలో జీవితాన్ని
ఇరికించినవాడు మృతంతో సమానమే కదూ !!
భువినేలిన పాదాలు
నింగినంటిన పాదాలు
శరణము అన్న
వడి వడి గా
ఆదిగులు వేస్తూ
అభయము నిచ్చే పాదాలు
ప్రతి పదము పరమైనపుడు
ప్రతి పలుకు పరవశమే
అని తలచే మనసు
తపనలు తీర్చ
హృదయ పీఠముపైన
స్థిరమైన పాదాలు !
******