27, ఏప్రిల్ 2016, బుధవారం



రెడ్ లైట్...
అలలతో అల్లరి చేసే..
చెలికాని కౌగిలిలో
కరిగిపోవాలనే తపనలకు..
తలపుల గొళ్ళెం వేస్తూ...
రాక్షసి అలల కోరలలో చిక్కి..
జీవితం చిద్రమవుతుందని..
ప్రాయం పోకడలలో
మునిగితే...చిరరికి మిగిలేది..
మనసు కాలిన చితాభస్మమే ననీ..
గుఱ్ఱాలయి ఎగిరే..కోర్కేలకు
కళ్ళాలు వేస్తూ...
యవ్వనం అంతరాత్మ ఎప్పడు..
ఆగిపోమ్మని అడ్డుపడుతుంది...
సిగ్నల్స్ లో రెడ్ లైట్ లా...


శ్రీ రామ కృపాకటాక్షము.....

రామ..రామ..రామా...
రామ...రామ...రామా...
రెండక్షరాల రామనామము 
కంచు కోట అయి...
కాపాడును జీవితాంతము ...
అడవుల నయినా...
కాలి నడక నయినా..
నెలవంకల చిరునవ్వులు
చెదరనియనీయనిదారాముని
దివ్య మంగళ రూపము.....//రామ//
పాదుకలేలేని పాదాలను తాకిన
రాయి మారెను...అహల్యగా...
శాపవిమోచనమే చెంది ...
పరమ పావనము..
పాపహరణము...రామపాదము..//రామ//
ఎదురు చూపుల ఎండమావిలో...
ఏళ్ళు గడిపిన శబరి ..
తడి కన్నులతో తడిముతూ....
రుచిచూసి మరీ తినిపించే..
దోరగా మాగిన పండ్లను..
మధురోహల సందర్శనము ...
శ్రీ రామ కృపాకటాక్షము... //రామ//


శిల్పి..
పశు బలాన్ని చేజిక్కించుకొని
మగ అహంకారం నరనరంలో ఎక్కించుకొని...
అమ్మ కుడా ఆడదే అని మరచి...
కామ క్రోదాలకు బానిసలవుతూ..
పసి మొగ్గలని...ముదుసలి అని కుడా
తేడా తెలియని విచక్షణ కోల్పోయి ...
అత్యాచారాలకు పాల్పడుతున్నాడు...
మానంతో పాటు..జీవితాన్ని సమాధి చేసుకొని..
సమిధ గా మిగులుతుంది..
ఆక్రందనలతో...ఆడది...
మనసులోని వేదనను చెప్పలేక...
ఇసుకతో..శిల్పాన్ని మలచి..
అమ్మాయిని కాపాడమని
ఎలుగెత్తి చాటు తున్నాడు...శిల్పి..!!

23, ఏప్రిల్ 2016, శనివారం



చెల్లి ..
దూరమయిన అమ్మా నాన్నల
తలపుల్ని మదిలో దాచుకొని...
ఎదలో నిన్ను పొదువు కుంటాను చెల్లి..!
అన్ననై నీ అడుగు తడబడ నీయక
నా అరచేతుల నీ పాదాల ఉంచి
ఎప్పుడూ వాడనిపచ్చికనై అమరుతాను తల్లీ..!
మాటల గాలం వేసే మాయా లోకంలో
మనం ఒకరికొకరం...తోడయినాము
అనాధలం కాము మనం..ఆవేదన వద్దు చెల్లీ..!
ఆకలయినా..ఆరాటమయినా..
కలిసి పంచుకునే...పేగు భందం మనది..
పెద్దలిచ్చిన ఆస్తి ..ప్రేమానురాగాల ఈ పొదరిల్లె తల్లీ..!
చందమామ నడిగితే..ఇవ్వలేను గానీ
అమావాస్య ఎరుగని వెన్నెల నుంచుతా
నిన్నే ఓ జాబిల్లిగా మలచి చల్లగా చూస్తా చెల్లీ..!!

19, ఏప్రిల్ 2016, మంగళవారం



కంటి చెమ్మ ...
ఎప్పుడూ అది కావాలి...ఇది కావాలి.....
అని అడుగుతూ ఉండేదానివే....కదా తల్లీ...
అడిగినదే తడవు గా...సాధ్యమయినంత వరకు...
నీకు అన్నీ ఇచ్చాను రా...బంగారు..
ఇప్పుడు నన్నే అడుగు తుంటే...
నన్ను ...నేనెలా ఇవ్వను రా...పిచ్చి తల్లి...
అప్పగింతల వేళ ...ఆవేదనే అయినా...
ఇది ఆనంద సమయమే ప్రతీ తల్లితండ్రులకు..
దూరమయినా.... దగ్గరితనంలోని మమకారం ..
కూతురి కాపురం కోసమే...కలవరం.రా..అమ్మడు
గుండెల మీద పారాడిన నీ పసితనం ..
గూడుకట్టుకుందమ్మా ఎద లోగిలిలో..
నేను గుఱ్ఱం అయి..నిన్ను స్వారి చేయిస్తాను..
గుజ్జన గుళ్ళు ..అష్టా చెమ్మలు ఆడుకుంటూ..
ఆగూటిలో...నేను నీతోనే ఉంటానురా..నాన్నా..!
యుగ యుగాలకు తండ్రి కూతుళ్ళ అనుభందం
నిత్య నూతనమే...ఆ అనురాగానికి అవధులు లేవు..
అరమరికలు ఎన్నడూ కానరావు..
అదే..నాన్నప్రేమ..కూతురిలో దాగిన కంటి చెమ్మ !!

17, ఏప్రిల్ 2016, ఆదివారం

ముఖారవిందం....
ఎడారిలో చిన్న..
నీటిచెలమకై...
వెతుకులాడే జీవితం..
యాత్రికమైన పనులకు
ఆలవాలమైన శరీరం...
వేదన...రోదనల
మద్య ...నలుగుతూ
ఆశలను ఆవిరి చేసి ....
అక్కరకు రాని
ఆలోచనలచుట్టాలను
అక్కున చేర్చుకుని...
నెలవంకనవ్వులను చెరిపేసి...
స్మైలీ పోష్టర్ ను అతికుంచుకొన్న
అందమైన అబద్దపు
ముఖారవిందం..!!
ఆవాసం..
ఆకాశమే వంగి హాయ్ ...అన్నది...
ప్రతి చినుకు పలకరింపుల
ప్రేమ కురిపిస్తున్నది...
పరువాలు తడిచి పాడమన్నవి..
ప్రణయ రాగాల మరులు
విరబూస్తూ....తేలమన్నవి...
ఏకమైన హృదయాలలో
వీణా... నాధాలేవో..మ్రోగుతున్నవి...
ఫలించిన అనురాగాలలో
విరహాలన్నీ...
విరంచిలయి చెలరేగుతున్నవి..
కావ్యమైన మనకధ
కౌగిలిలొ.... కరిగి..
నిజమైన కలలకు ఆవాసమైనది..!!

13, ఏప్రిల్ 2016, బుధవారం

శ్రీ రామ నవమి ....
పుత్రకామేష్టి యాగ ఫలం వలన..
రఘుకుల తిలకుడు పునర్వసు నక్షత్రాన జన్మించి ..
ముగ్గురు తల్లుల ముద్దుల తనయుడే కాక 
ముగ్గురు తమ్ముల అన్నగా
దశరధుని ప్రియ పుత్రునిగా ..
దినదిన ప్రవర్ధ మానమవుతూ...
సూర్య తేజంతో..ఆజానుబాహుడైనాడు ..
నీల మేఘ శ్యాముడు ...ఆ రఘరాముడు...

సురాసురులు ..యక్షకిన్నెర 
మహోరగులకు కదలని శివ ధనుసును
విశ్వామిత్రుని అజ్ఞానుసారం 
ఆ ధనుస్సును ఒక్కచేతితో పట్టుకొని
ఎక్కుపెట్టినంతనే..పిడుగులాటి శబ్దంతో ...
విరిగిపడిపోయింది....
ప్రమోదమైన మనసుతో...
నునుసిగ్గుల సీత తన 
అనురాగాల మాలనలంకరించింది . .

ఆరిఆరని తాటాకుల పందిళ్ళు ..
చిగురులు తొడిగిన లేతాకుపచ్చని మామిడి తోరణాలతో
వసంతానికి గుర్తుగా విచ్చుకున్న 
మల్లెపూల మకరద్వజాలు ...
సువాసనల విందు చేస్తూ
కస్తూరి తిలకం పెట్టి ..
మణిబాసికం నుదుటను గట్టిన 
రామయ్య పెళ్లి కొడుకైతే...
సౌందర్యాలన్నీపోగై 
పుత్తడి బొమ్మైనట్లున్న జానకి 
పారాణిపాదాల పెళ్లి కూతురైంది..
పుష్పవర్షం కురుస్తుండగా 
దేవదుందుబుల మ్రోతతో 
ప్రాంగణమంతా ప్రతిద్వనించగా ..
మాంగళ్యధారణ ..ముత్యాల తలంబ్రాలతో..
వధూవరులు ..కన్నుల పండుగే నాడు .
.
తండ్రిఆనతికై పదునాలుగు సంవత్సరాలు 
కారడవులకేగి...దుష్ట రాక్షసుల సంహరిస్తూ
సీతాపహరణం చేసిన రావణుని వధించి..
తిరిగి నవమి నాడు పట్టాబిశక్తుడైనాడు రాముడు!!

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఒక్కటిగా....

ఆలోచనల ఆలింగనంలో
ఎప్పుడు అల్లరిపెడుతూనే ఉన్నా...
కనుచూపుల దారిలో కనిపించని నీవు ..
కన్నీటికి కారణమవుతున్నావు...
ఎద సంద్రంలో ఎగసిపడే
అలల ఘోష ఎప్పుడు విన్పించుకోవెం..!!
చల్లని వెన్నెల పంచే జాబిల్లి సైతం
వేదనలు కలిగించే వేడిలో
కరిగి.... తానో కథవుతుందే..!!
భవిష్యత్తుని మింగేసే గతం...
మన జీవిత ప్రాకరాలను తాకనివ్వకుండా..
నువ్వు..నేను ...అనే ఈ నిజాన్ని
వాస్తవం చేసుకుంటూ..
ఒక్కటిగా..ఒకరిలో ఒకరమై
సాకారమైన బ్రతుకును పండించుకుందాం ప్రియా..!!

10, ఏప్రిల్ 2016, ఆదివారం

మద్య తరగతి మహిళ ...

అమ్మ నాన్నల అపరంజి అయినా....
తలవంచి తాళి కట్టించుకుని ..
తనదంటూ లేని జీవితమే కోరుకుంటుంది......
చిటికెడు పసుపుతో పాటు...
పిడికెడు ప్రేమని కోరుకుంటూ..


భాద్యతల బరువు...
ఆలోచనల ముసురు ..
సంసారం జలధిలో..
ఎదురీదే చాపలవలె..
అనుక్షణం ఆందోళనల లోకమే..
మధ్యతరగతి మహిళమనసు..!!
See More

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

*************ఎన్నటికి కరగని కల*****************
రతీదేవిని తలపించే ఆమెను చూసిన వేళ మదిలో మన్మధ హేల..
రమణి వయ్యారాల సిరులను దోచుకోవాలనుకునే...మరుల గోల..
రమ్యమయిన తలపులలో విహరింపజేయు విరహాగ్ని లీల..
రక్షణ కోల్పోతుందని యవ్వనం.. అలజడులపడు టేల...
రత్నాలు..మణిపూసల హారాల సింగారాలు దాగినవి ఆమె చిరునవ్వుల ..
రవి కిరణాల వలె స్పృశించు చూపులతూపుల కన్నుల..
రజిత మయమే ... ముఖారవిందపు వెన్నెల ..
రక్కసి అయి కాలం ..గడవకున్నది..క్షణం యుగమై...ఏల...
రజనీకరుని కరుణయున్నను...ఆమె హృది కరుగకున్నదేల..
రంగులమయమయిన వలపుల కలయికలతో జీవితం అవుతుంది ఎన్నటికి కరగని కల..!.
ఆత్మసంబంధం....
పతి పాదాలను సుతిమెత్తగా నొత్తగ సీత
ఆదమరిచి రాముడు
ఆలకించెనామె మనోగీతం
మౌనభాషయే...మనసులకలిపేది
మనుగడ వారిని విడదీయరానిది
అడవులనైనా..పొందితిరి ఆనందం
ఒకరిలొ ఒకరై ఒదిగినదా దగ్గరతనం....
ఆలుమగల అనురాగానికి
ఆయువు పట్టు ...ఆత్మ సంబందమే..
అని నిరూపించిన వారి అడుగు జాడలె..
సంసార సమరంలో ...అలవోకగా ఎక్కగలిగే..
పరమ పద సోపానాలు..!!
*శ్రీ రామా*
రామా...రామా..శ్రీ రామా..
కౌశల్యాసుత రఘురామా..
రవి వంశ తిలకా ..దశరధ రామా..
విశ్వామిత్రుని వెనువెంటను నడిచి
తాటకిని హతమార్చి.. యాగము గాచి
మునుల రక్షించిన దీనజనోద్దరా...
రామా...రామా...శ్రీ రామా...
అవని గర్బమున ..బోసినవ్వులతో..
కళ కళ లాడుతూ కనిపించెను ..అవనిజ సీత..
జనకుని ఇంట అల్లారు తనయి అయి..
అంతఃపురము నుండే రాముని
చూసిన జానకి మనమున
కలిగేనవే...అనురాగ భావనలు..
ఆ ప్రేమామృత ధారలకు..
రామయ్య చేతిలో వంగెను శివ ధనుసు ..
పెళ పెళ విరిగెను ....పూల వర్షమే కురిసెను ..
మనసంతా మాలగా చేసి
వేసెను రామయ్య మేడలో...సీతమ్మ
కల్యాణ వైభొగమే...సీతా రాముల కళ్యాణ వైభోగమే
ప్రతి ఇంట...రామ స్వరణమేనంట..
ప్రతి పెదవి పై...రామ నామమేనంట...
జాగతి అంతా...రామ మయమే నంట...
రామ..రామ..రామ రామ...
రామా.రామా..రామా రామా..
శ్రీ రామా...శ్రీ రామా..శ్రీ రామా...!!

5, ఏప్రిల్ 2016, మంగళవారం

సప్తస్వరాల సంగీతం.

సంగీతానికి స్వరాలు జీవాన్నిఇస్త్తాయి...
స, రి, గ, మ, ప, ద, ని,అను సప్త స్వరాలు..
రాగాల మిళితమై..మరో లోకానికి తీసుకెళతాయి...
సప్తగిరులపైన కొలువైనాడు శ్రీనివాసుడు..
సప్తాస్వాలరధమును.అధిరోహించి
ప్రపంచాన్నిఏలుతాడు సూర్యభగవానుడు..
సప్త గుమ్మాలను దాటుకుని
శేషశయనుడై ఉన్నాడు వైకుంఠవాసుడు...
భగవంతుని సన్నిధానంలో...
సప్తమంకి ఎంత పవిత్ర స్థానం ఉందొ..
ఆదైవాన్ని మదిలో నిలుపుకొని...ఆ చరణాల మ్రోలేందుకు...
సప్తస్వరాల క్రిర్తనలు...పూల దారులయినాయి...
యుగం మొదలు నుంచి...మాట పలుకే కాదు..
అది పదమై...పాదమై..పాటకు పల్లవైనది...
స్వరాల ఆలాపనల గీతాలై..చిరస్తాయిగా నిలిచాయి..
జానపదాలు..జావళీలు. జోలపాటలు..లాలిపాటలు..
కీర్తనలు, లలిత గీతాలు, యువళగీతాలు,
ఒకటేమిటి...ఎన్నోఎన్నెన్నో...మనలోమనకే..
శ్వాసలై స్వరీక రిస్తున్నాయి...జీవితాలను..
సెలఏటి గలగలలలోను...
పారే నిటి గులకరాళ్ళ చప్పుళ్ళలోను..
జలపాతాలగోరులోను...
హోరునవీచే గాలిలోనూ..
కుహుకుహురావాల కోకిల ఆలాపనలలోను..
చిట్టిపిచ్చుక కిచకిచలోను..
ఇలా ప్రకృతిలోని ప్రతి అంశంలోనూ..
స్వరాలుసరాలాడుతూ ఉంటాయి..
చంటిపాప నవ్వినా...ఏడ్చినా...
అదికూడా ఓమధుర స్వర గీతికే..
మనిషి బ్రతుకుపోరాటంలో..
మనసుకు కొంత స్వాంతననిచ్చేది..
ఒంటరితనంలో తోడై..అందరిలో...వినోదమై..
ఆహ్లాదానికి ఆహారమై...
ఆరోగ్య సూత్రమై...నిలిచేది సప్తస్వరాల సంగీతమే.!
**స్వయంప్రకాశితాలై**
అంగవైకల్యం అని వికటించిన చూపులతో చూసే వారే
మనో వైకల్యంతో....జీవితపు చివరి అంచులు చూడలేరు..
భగవంతుని నిర్దయకు బలైనా, ... అంధత్వం..
ఎదలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం....
అణగారనివ్వదు ఏ క్షణం..
తాము చీకటిలో ఉంటూ..చీకటిని చీల్చుకొని...
మిణుకు ..మిణుకుమని మెరుస్తూ......
వెలుగు దారి చేస్తాయి..మిణుగురు పురుగులు..
ఇతరత్రా ఏ సహాయం ఆశించకుండా...
తమ గెలుపు కోసం ..ఓటమిని ఏమాత్రం లెక్కచేయక..
కనురెప్పల మాటున సప్తవర్ణాలు కదలాడుతున్నా...
ఎదురుగా అంతా నలుపు..అయినా భారమని తలవక....
బ్రతుకు దారిలో ముళ్ళని ఏరి అవతల పారేస్తూ...
గుడ్డివారని గేలిచేసే వాళ్ళకి జవాబుగా నిలిచే
ఆత్మ స్థైర్యాన్ని గుండె నిండుగా నిలుపుకుంటారు..
వారు మిణుగురులవలె..స్వయం ప్రకాశితాలై..!
అంగడి సరుకై.....
పురాణాలూ తిరగేసినా కనిపిస్తారు...
రాంబా ..ఊర్వసి...మేనకలు..
మహారాజుల కాలం నాటికెళితే..
దేవదాసిలుగా దర్శనమిస్తారు...
జమిందారీ గిరిలో..
బోగం సానిలుగా..ఊరికి దూరంగా..
అద్భుతాలను సృష్టిస్తూ ...
అనుహ్యమయిన టెక్నాలజీతో
అభివుద్ది పదంలోకి దూసుకెళుతున్నా...
అనేకానేక కారణాలు ..అమ్మాయిలను
కాల్గాళ్స్ గా మార్చేస్తున్నాయి..
అమ్మా అని పిలిపించుకుకోవాల్సిన అమ్మతనం
అంగడి సరుకై.....బేరాలకు తూగే తూకమవుతోంది...!!..
నీ కోసమే...
యవ్వనపు
ఉదయ కిరణాల తాకిడికి
ఉలికి పడి లేచి...
మది తలుపు గొళ్ళెం తీసి..
హృదయ ద్వారాల
వలపు వాకిళ్ళలో...
తలపుల రంగవల్లులను
తీర్చి దిద్దాను ..
ప్రియా..!!
హరివిల్లువై వస్తావా...
సప్తవర్ణాల దృశ్యమాలికవై..
వేఘమై వస్తావా..
చిరుజల్లుల తన్మయత్వమై ..
మెరుపువై వస్తావా...
మింటిచుక్కల మరిపిస్తూ..
చందమామవై వస్తావా..
వెన్నెలదారుల విహరింపజేస్తూ..
ఇలా..
ఆలోచనల ఆలంబనలపై ..
ఊహల లతలలో అల్లుకుపోతున్నా....
మరి..నీ కోసం..
నీ వెవరో...ఎలా ఉంటావో...
ఎమీ తెలియదు ..
కానీ...
నా తలపుల రంగవల్లులను
నీవొక్క సారి చూస్తే చాలు ..
నీ అడుగులో అడుగు వేస్తూ..
నీతో నడిచొస్తా..
నీ కోసమే..నే జీవిస్తా...!!