17, జూన్ 2019, సోమవారం

అమృతకలశం "
పూవులలోని మధువునంతా
ఎంతగా తాగినాయో ఈ పెదవుల తుమ్మెదలు
తేనె బరువుకు వాలిపోతున్న రెక్కలవోలె
ఒంపులు తిరుగుతూ మైమరస్తున్నవి చెలి
చిలిపి చేష్టల తుళ్ళింతలతో
కొలనులో పరిగెట్టే చేపలను పోలిన కనులు
ఎదలోని అనురాగాల ఆలాపనలను
మౌనంగా వినిపిస్తూ అరమోడ్పులవుతున్నవి చెలి
గులాబీల సోయగాలను చేమంతుల చెమరింపులతో
రంగరించి పోతపోసినారేమో ఈ చెక్కిళ్ళను
నన్ను నీలో చూపిస్తూ ఉంటే
నేనే నీవన్న ..నీలో నేనున్న నిజం
యమునలో విరిసిన ఈ పద్మం
నీటికై నీతో వచ్చిన ఈ కడవ సాక్ష్యం కదూ చెలి
ఈ రాధాకృష్ణుల ప్రేమ తత్వం
అజరామరమైన సుందర సుధా మధుర కావ్యం
అనురాగాల ఆరాధనల అద్వైత్యమైన భక్తి విశ్వాసాలకు
ఆదర్శమై నిలచిన అపురూపమైన అమృత కలశం
అచంచలమైన నిత్యయవ్వన చరితం రాధామాధవీయం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి