29, ఆగస్టు 2018, బుధవారం

సూర్యునికి స్వాగతం '
ఏ హృదయం స్పందించెనో ...
వేణువై పలికింది చిరుగాలి ..
ఏ మమతలు హర్షించెనో..
చినుకులై కురిసింది మేఘమాల ..
పులకరించి నేల తల్లి
మొలకలనే మోలిపించెను ..
తోటలోన రంగురంగుల పూవులు
విరిసి ఇంద్రధనుసు మరిపించెను..
కొండలు కోనలు ప్రకృతితో రమించి
చీకటిని పారద్రోలి సూర్యునికి స్వాగతించెను ..!
రైతు .."
నేలతల్లి ఒడిలో పెరుగుతూ
ఆయమ్మ కమ్మని వాసనలే
శ్వాసలుగా స్వచ్చతని నింపుకున్నవాడు రైతు ..
కాయ కష్టం చేసే కండల్లో
కొండల్ని పిండి కొట్టగల బలం ఉన్నా..
వెన్నపూసలాంటి గుండెతో మొక్కను ప్రేమించు రైతు ..
ద్వేషించే మనసు..మోసంచేసే గుణము లేని
కల్లా కపటం తెలియని అమాయకత్వంతో
అందరినీ తనవారనుకొనే ధన్యజీవి రైతు ..
నింగిలోని చందమామ వెన్నెలని పంచినట్టే..
మట్టి మధించి వేసిన పొలాలనుండి తెచ్చిన ..
దాన్యంలోని తెల్లని వెన్నెల బియ్యంను ఇచ్చే రైతు..
బస్తాలకేక్కిన దాన్యం గోడవునులలో నిలువలుంటే..
అప్పు చేసి పెట్టుబడి పెట్టిన దానికి సరి ధర రాకుంటే..
అప్పు తీర్చే మార్గం లేక ఆవేదనల ఉరికి వెళ్ళాడు రైతు..
దళారుల దొంగ వ్యాపారంలో రైతును బలి కానీయకుండా
ప్రభుత్వం ప్రతి పంటకి గిట్టుబాటు ధరని అందించితే..
తన ఇంటికే కాదు ప్రతి ఇంటికి ఆహార ఆరోగ్య ఆనందాలని ఇస్తాడు రైతు
చిన్నికన్నా ..
ఉగ్గు తిని
ఉంగా ఉంగా
నేర్పించావురా ..
పాలు తాగి
పొలమరింపు
నేర్పించావురా..
ఒడిని చేరి
ఊయల ఊగి
అమ్మతనం నాకు
అందించినావురా..
బోసి నవ్వుల
ముత్యాలు రాల్చి
చొంగ కార్చు పెదవులతో
తీపిముద్దులిచ్చినావురా..
చందమామ నాకొద్దు
మా అమ్మ నాకు
చాలు చాలంటూ ..
హద్దుకొని ఆదమరచినావురా..
ఏ దేవుని వరమో..
ఏ నోముల ఫలమో ..
నీ అలనలో అమ్మనై
నా చూపుల కంచె కట్టినానురా..!
సంతృప్తి ..
దారి తెలియనివారికి
ఓ మాట సాయం
కంటి చుపులేనివారికి
ఓ కర్రలా సాయం
నిరాశల క్రుంగువారికి
నేనున్నా అన్న
భరోసా సాయం
పెదవులపై ఎప్పుడు
చెదరని చిరునగవు
ఎదుటి వారిని ఆహ్లాదపరుచు
పలకరింపు సాయం..
ఏ రీతిలో మనం ఒకరికి
సాయం అందించినా ...
మాధవుని సేవలో
ఒక భాగమవుతుంది ...
అవసరాలకు మించి
అర్బాటాలు చేస్తూ
విరాళాల పేరుతొ ఇచ్చి
సన్మానాలు చేయించుకునే వారికంటే ...
ఆకలితో ఉన్న అర్బకునికి
కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు
మన ఆత్మపొందే సంతృప్తే
మనం చేసినసాయానికి
ప్రతి ఫలం లభించినట్టవుతుంది..!!
************.
'నిప్పు కణిక '
నీలో నీవు తొంగి చూసుకో..
దాగుంది ఓ నిప్పుకణిక..అదే 'సత్యం '
ఎంతవరకు నీవు భరిస్తున్నావు..
ఎంతవరకు నీవు రమిస్తున్నావు..
భరించలేక బయట పడేస్తున్నావా..
సుఖించలేక నీళ్ళు జల్లుతున్నావా..
నివురు కప్పిన సత్యం ఎప్పుడో నిన్ను
కాల్చి బూడిద చెయ్యక మానదు తెలుసుకో..!!
నిశి రాతిరి జాడలో ...
ఊహలను దాటి ఊరించి నీవు
సూర్య కాంతిలోనూ
చుక్కలను చూపించినావు ..
మబ్బుపరదాల మాయ చేసి
ఏరినవన్నీ ముత్యాలేనని
మాలకట్టి మెడల వేసినట్టు బ్రమింపజేసినావు..
వలపు పాటల దోబూచులాడుతూ
మాటలతో బొండుమల్లెలు చేసి
గమ్మత్తుగ మత్తు మందు జల్లినావు ..
సొగసును చూసి వగలనుకుని
జాజి వంటి సుకుమారినని చూడక
ఎద పగులగొట్టి ఏటో వెళ్ళిపోయినావు ...
చిత్రంగా నీ సాక్ష్యంగా ..
ఈ నెమలి ఈక
నను వదలని నీడ అయింది ...
వానచినుకుల జడిలోనూ
నాటి కలలే నేటికీ
రెప్పల కింద నీటి చుక్కలయినాయి ..
పున్నమి వెన్నెల్లో విరిసిన
ఈ కలువలకి చెప్పనా...
తమ చెలునితో నిను వెతికించమని ..
నా శ్వాసలలోని సంగర్షణల
మోసుకెళుతున్న గాలితెమ్మెరలతో
నిను గాలించమని అడగనా...
మంద్రంగా సాగుతూ ..
మధురస్మృతులను లాక్కెళుతున్న
ఏటి తరగలతో కబురు పంపనా ..
నేరుగా నిను చేరుకోలేని అసక్తత ..
నీవు రావేమో అన్న అశాంతి ..
కల్లోలమవుతున్నది సంద్రమల్లె మది ..
ప్రాణసఖుడవని ప్రేమించినాను
ప్రియబాంధవుడవని పూజించినాను
ఆరాధనల అర్పణలు చేసి ..
వేయి కనులు లేవు కానీ ..
రెప్పల దోన్నెలలో ..
నింపుకున్న విరహాన్ని ఒంపలేక
తడబాటు మనసుతో
తడబడు అడుగులు వేయలేక
నిశి రాతిరి జాడలో వేచియున్నా నీకై ..!!
******************
మన కనులకే ..'
హృదయ సాగరంలో
మునుగుతూ..తేలుతూ ..
బయిటికి రాలేని మాటని 
శ్వాసల చప్పుళ్ళతో
జోలపాడి ..నిద్ర పుచ్చి
అంతర్మధనంలో ఊగిసలాడుతున్న
ఆనందం అయినా..
ఆవేదన అయినా..
అనుభూతి అయినా ..
ఆగ్రహం అయినా...
స్పందన ఏది అయినా...
మౌనం బట్టలు తొడిగి
తమలో చూపిస్తూ ఉంటాయి
కనులు ..
చూపులతో లోకాలను చుట్టేస్తూ ..
లోన నిక్షిప్తం చేయిస్తాయి...
కనులు ..
అందుకే శరీరంలో అతి
ముఖ్యపాత్రను పోషిస్తూ ఉంటాయి
కనులు ..
దురదృష్టమో ఏమో కానీ
కొందరికి పుట్టుకతోనే కంటిచూపు ఉండదు..
లేదా
ఏదేని కారణం చేతైనా కనులు
తమ ఉనికిని పోగొట్టుకుంటాయి...
మనిషి చనిపోయినా కళ్ళు
మరి ఆరుగంటలు బ్రతికే ఉంటాయట..
ఆ కళ్ళు ఊరికే ధహనమో ..ఖననమో
కాకుండా ...చూపులేని వారికి
చూపును ప్రసాదించే వరం ఇవ్వాలి..
కళ్ళ దానం చేసి..
మరో మనిషిలో జీవించి ..
వారి బ్రతుకులో వెలుగులు నింపాలి ..
ఈ మహత్తు ఉంది మన కనులకే...!!

తోడుకొచ్చి నీళ్ళు నిన్ను
అభిషేకింతునా శివా .,,
పైనమ్మకి చెప్పు..
పక్కనమ్మకి చెప్పు ..
తెలియక పాపమెంతో చేసినా...
శివ నిన్ను తలచుకుంటూ ..
పనులు చేసుకొంటి ..
చల్లంగ చూస్తావో..
కష్టాల కథలే చూపిస్తావో ..
బ్రతుకుకు ...
బతకటం నేర్పిస్తావో...
శివ...నిదే భారం ..
నిన్ను కొలుచుటే నాకు
జివాధారం ..శివ...శివ..శివ..
ఓం నమశ్శివాయః...
హర హర మహాదేవ..
సాంబో శంకర..నమో నమః ..!!
**********
కల్తీ నలుసు .."
గర్బకోశంలో పడిన నలుసు ఏడుస్తుంది
ప్రకృతికి విరుద్దమైన కల్తీ కలుపు మొక్కనని..
పదినెల శిశువై ఉమ్మనీటిబుడగని చీల్చి బయటపడితే
అసలుఅమ్మ ఎవరో తెలియని కల్తీతనయనని ..
శ్వాసించే గాలి ఊపిరి తిత్తులలో జేరి
కాలుష్యపు కోరలతో ఎక్కడ ఉదరాన్ని కాన్సరుకేస్తుందోనని..
జీవంలేని నడకలై కల్తీ బ్రతుకును మోస్తూ
ప్లాష్టిక్ నవ్వుల ప్రపంచంలో ఇమడలేనని ఏడుస్తుంది ...!!
'ఇష్ట సఖి '
అలిగిన వేళ అందాలు
అరవిచ్చు కుంటూ
ఆరేసుకుంటాయి ..
సత్య కన్నుల్లో ..
ఉదయ అరుణిమలు..
చూపుల్లో పున్నమి వెన్నెల్లలా ..
ఆరాధనా విరుల దండలతో
కృష్ణయ్య చెలి కురుల తురుముతూ
'ఎంతటి వాడినైనా..నీ దాసుడనే సఖీ'
అన్న భావనల సమర్ధింపులతో
జాగు చేసిన సమయాన్ని
జంట సరసాల జావళిగా మార్చే ..
అష్ట భార్యలయినా ..
ఇష్ట సఖి సత్య ..
ఇంపుగ మగని కొంగున దాచుకుని
మురిపాల విందులనారగిస్తూ ..
ముచ్చటగా మురిసిపోయే..!!
స్నేహబంధం,
పున్నమి వెన్నెలనైనా మండుటెండలనైనా
సమంగా అనుభవిస్తూ అలుపు తెలియనీయనిది స్నేహమే ..
అమ్మలా లాలించినా నాన్నలా శాసించినా
కంటిచివర నీటిబొట్టును జారనివ్వనీయనిది స్నేహమే ..
తోడబుట్టినవారిది జన్మతః వచ్చిన అనుబంధమయితే
లోనఉన్న మనసులా అన్నీనీవే అనుకునేదే స్నేహబంధం ..
ఈర్ష్యాద్వేషాలకు తావివ్వనిది స్వార్ధాన్ని దరిచేరనివ్వనిది
సాగే జీవనమజిలీలలో ఎప్పటికీ తోడుండేదే స్నేహబంధం ...!!
***********
(ఈ చిత్రం నా మనవడి ఫ్రెండ్ అవినాష్ వేసాడు ..)
బోనం
ఇంటి ముందు కళ్ళాపి జల్లు
పచ్చని వాకిట్లో
చుక్కలను బంధించిన 
ముడుల అల్లికల ముగ్గులు ..
గడపలకు పసుపు కుంకుమ
బియ్యం పిండితో బొట్లు
మావిడాకుల తోరణాల
బంతిపూలదండల అలంకారాలు ..
ఆషాడ మాసపు
మేఘాల మెరుపులు
అప్పుడప్పుడు చిరుజల్లులు
ఉరుముల ఉరుకుల వానలు
దుక్కిదున్ని విత్తనాలు
జల్లు రైతన్నలు
చల్లంగా చూడమ్మా అంటూ
అమ్మలు అమ్మమ్మలు
ఆడబిడ్డలు
అమ్మోరి తల్లికి దండాలు పెట్ట
పసుపు బొట్లతో కొత్త కుండలో
పులగం నైవేద్యం పెట్టి
వెలిగించిన దీపంతో
బోనం చేసి తలపైకెత్తుకునే ...
మల్లమ్మ , ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ
ఎన్ని పేరులో అమ్మకి
చల్లంగ చూడుతల్లి ...
అమ్మా మాయమ్మ ...
భక్తితో పెట్టిన బోనం అందుకో
అభయమునిచ్చి అందరిని ఆదుకో ...
రంకెలేసే పోతురాజు చూడు
చెడును పారదోలా
కొరడాతో కొట్టుకునే
గజ్జెలు కట్టిన కళ్ళతో
చిందులు వేసేనమ్మ ...
అమ్మా మాయమ్మా ..
బంగారమడుగలేదు
వజ్రాలకాసలేదు
మెడలు మిద్దెలు
భోగభాగ్యాలనిమ్మనలేదు ..
తల్లీ ! ఏటికేడు నీ బోనం
ఎత్తుకునే బాగ్య మీయు తల్లి
చిటికెడు కుంకుమ చివరిదాక
కానుకీయు తల్లీ ...!!
ప్రేమ
అవును
నిజం
ప్రేమ ఎక్కడో లేదు 
మనలోనే ...
హృదయంలోనే ఉంది
అమ్మ ప్రేమ
అమృతం పంచుతుంది
సోదర ప్రేమ
మమతను పెనవేస్తుంది
చెలిమి ప్రేమ
సంతోషాహ్లాదాలనిస్తుంది ..
వలపు ప్రేమ
జీవితానికి బంధమవుతుంది
లోన దాగిన ప్రేమ
ఎప్పుడు పవిత్రమై
పసితనాన్ని పూసుకుని ఉంటుంది
ఆ రేఖ దాటితే
అనేక రుగ్మతల పాలవుతుంది ...
అందుకే నేస్తం
ప్రేమని ప్రేమించు
ప్రేమతో
ఆనందాలని పంచు ....!!

* మరుల పూలు *
ఎదను కోస్తున్నవి
ఎదురు చూపులు
గుబులు పుట్టిస్తున్నవి
గజిబిజిగా ఆలోచనలు
తహ తహ లాడుతున్నవి
తాళిని మోస్తున్న పసుపుతాడు ముచ్చట్లు
విడివడుతున్న కురులనుండి రాలుతున్నవి
పందిట్లో పోసుకున్న తలంబ్రాలు
కదపలేని అడుగులతో చిత్రం అయినాయి
మెరుస్తున్న మెట్టెల పారాణి పట్టీల పాదాలు
సిగను చేరలేదని చిన్నబోతున్నవి
విరిసినా మురిపానికి నోచుకోని మల్లెలు
తెల్లచీర పచ్చగాజుల కలలు కంటున్నవి
పొద్దున్న పోయి ఇంకా రాని మామకోసమా కనులు
మేమే సాక్ష్యం అంటున్నవి
ఇత్తడి చెంబులో నిండుగా ఉన్న నీళ్లు
విరహపు కవ్వింతల ఆరడి చేస్తున్నవి
మౌనపు ఊసులలో తడిసిన మంచు మరులపూలు !

 "నీ తలపుల "
ఎదలో దాగిన నీవు
కంటి రెప్పలపై 
తార్లాడుతున్నావా
కృష్ణా ....
కనుదోయి బరువై
వాలుతున్నది ..
మానస మందిరములో
మాధవీ లతలతో
మురిపించితిని కదా...
కృష్ణా ....
గాలి తరగల చేరి
చుట్టేయు చుంటివేలా ...
నీ తలపుల
సుఖించాలనీ ...
నీ భావనల రమించాలనీ
కృష్ణా ...
ఉవ్విళ్లూరు వలపుల
నిను చేరుకొందును రా ...!!

ప్రేమాంజలి !
హృదయం హృదయం తో
మాట్లాడుకుంటున్న వేళ
చూపులు చిక్కుబడి
కనుపాపల కలలు
కౌగిలించుకుంటుంటే 
స్తంభించిన కాలపు చెక్కిళ్ళపై 
అదురుతున్నఅధరాల ఆరాధనాశ్రువులు
తమని తాము అర్పించుకుంటున్నవి
.ప్రేమాంజలి ఘటిస్తూ ...!!