17, జూన్ 2019, సోమవారం

"ఎవరివో కానీ "
ఏ దివిలో విరిసిన పారిజాతమో
అని ఓ కవి అన్నారు ఎపుడో..
నీవు "ఎవరివో కానీ ....
నా ఊహా లోకాలలో ఊపిరి పోసుకున్న
చందనపు బొమ్మవి .
నాకు తెలుసు ..
కలల వాకిళ్ళ నుండి
కలహంస నడకలతో
పారాడు కుచ్చిళ్ళ నడుమ
పచ్చని తమలపాకు పాదాల
మంజీరాలతో సరిగమలు వినిపిస్తూ
మెత్తగా గుండె గుడిలోకి
ప్రవేశించిన దేవతవి ..
నాకు తెలుసు ..
నడుము ఒంపులతో పోటీపడుతున్న
ముంగురులు బంధించిన మల్లెలకెందుకంటా
ఆ గీర్వాణం ..
ఏటి అలల తాకిడికి కందిపోదూ
నీ సౌందర్యం ..
ఆకాశపుటంచుల్లో వేళ్ళాడే ఓ
.మబ్బు తునకనై ..
నేనున్నా ..
ఆసరాగా అరచేతితో అందుకున్న
చిగురుటాకు కొమ్మల్లో
ఓ చిరు రెమ్మనై
నేనున్నా ...
నీ ముందుకు రాలేని ఆసక్తుడనై
నీ స్వాభిమానపు సంస్కారం
ఎక్కడ నన్ను నిర్లక్ష్యపు
చూపులు చూస్తుందో అని
అసహనపు ఆవేదనతో ..
మనసు తెలుసుకొని
మన్నింపుమా ప్రియబాంధవి !
బొండుమల్లెల మత్తుని
వీడనీయని ప్రేమ పరిమళాలతో
అనురాగాల అంతఃపురం నిర్మిస్తా
మనదైన లోకాలకు నిను మహారాణిని జెసి !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి