31, అక్టోబర్ 2015, శనివారం

నీకూ... తెలుసు...


ఒంటరినని తేలిక చేసే... లోకానికేం తెలుసు
నీ తలపుల ఒరవడిలో... ఒదిగి నే సెదతీరుతున్నానని..
నాకోసమే...ఎగసి ఎగసి పడుతూ..
కదిలి వస్తున్న ఆ కెరటాలకి తెలుసు...
అంతులేని సంపదనే కాదు..
అగాధాలను సైతం తనలో దాచుకున్న సాగరుడికి తెలుసు..
అనంతమైన ఆకాశాన్ని ఇముడ్చుకొని
నురగై తేలుతున్న నీటికి తెలుసు..
తీరంలోకి కొట్టుకువచ్చి...
ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆల్చిప్పలకి తెలుసు..
ఎదమధనంలో ఏమరపాటున కూడా నిను మరువదు మనసు
నీవిల లేకున్నా...సముద్రుడి సాక్షిగా ..అది..నీకూ.. తెలుసు...
గాజులు...


గాజుల చేతులతో వడ్డిస్తూ.... నా శ్రీమతి
రోజు నాచేత అమృతం తిపిస్తుంది..అందుకే..
అరవైలోను...ఇరవై లా నా ఆరోగ్యం ..
తన గాజుల గలగలలలా..ఉరకలు వేస్తుంది...
మొట్టమొదటగా తను అడిగినదోకటే..కోరిక..
ఎప్పుడు మట్టి గాజులు నా చేతులకు తొడగాలని...
నలబై ఏళ్ల సహచర్యం ..ముడుతలు పడినా..
ఆ చేతులలో...తరగని మిలమిలల సౌంధర్యం ..
మగని తలపులను తెలిపే...అరుదైన సాధనం..
ఇల్లాలి అనురాగపు గెలుపులకదే..జీవనం..
బంగారు రాసులతోచేసిన నగలు ఇవ్వలేని ఆనందం..
డజను మట్టి గాజులపొట్లం విప్పినప్పుడు..
కలుగుతుంది అదే...ఆనంద పరవశం.!
చేతుల నిండా గాజులతో...
కాలికి మెట్టెలతో...
పసుపు రాసిన ముఖానికి ..
సూర్యబింబమల్లె ప్రకాశించే కుంకుమతో..
తలలోనిండా పూలతో..
కట్టెమీద పడుకున్నా...
ఆ స్త్రీ మూర్తి అయిదవతనం లోని...
ఆత్మ పొందుతున్న అనుభూతిని ...
ఆరు కాలాల సౌంధర్యాన్ని.
తనలోనే ఇముడ్చుకున్న సౌభాగ్యము,..
చెప్పకనే చెపుతుంది...!
"ఎగిరింది కడలీ కెరటం.. "
."ఎగిరింది కడలీ కెరటం..ఆ నింగి స్నేహం కోసం.."
కడలి అంచుననున్న నాకు ..దూరంగా విపిస్తున్న పాట ...
నిజం..ఏనాటికైనా ఆ రెండు చేరువ అవుతాయా...?.అన్న ప్రశ్న..
చేపలు..తిమింగలాలు లాంటి అనేక జలచరాలకు
ఆవాసమై నిలిచి..లోన బడభాగ్నులను దాచుకున్నా..
వెన్నెలంటి నురగతో... పాదాలను కడుగుతూ..కడలి..
దేశ దేశాలను కలుపుతూ...సముద్ర యానం చేయిస్తూ..
రవాణా సౌకర్యం కలిగిస్తూ...దూరాలను చెరిపేస్తూ..
ప్రపంచమంతా ఒకటే అని తెలుపక తెలిపేను కడలి..
కదలివచ్చిన నదులని తనలో కలుపుకుని..
సంగమ ప్రదేశాలకు..పవిత్రతను చేకూరుస్తూ..
మనుషుల పాపాలను గ్రహింపజేస్తూ ..
పుణ్య స్నానాలు చేయిస్తుంది కడలి.....
స్వాతి చినుకులను ...ముత్యాలుగా మారుస్తూ...
అంతులేని సంపదకు తన గర్భాన్ని ఆవాసంగా చేసి..
మచ్స్య కారులకు ,..జీవనాదారమై నిలిచింది కడలి..
అలల తరంగాలు ...అటుపోట్లకి నిలయాలుగా..
జీవితానికి ..అనుబంధ వాక్యం తెలియజేస్తూ..
"కింద పడినా ..తిరిగి లేవటానికే.." అన్న సత్యంలా ..
విరిగిన కెరటాన్ని...తిరిగి నిలబెడుతుంది..కడలి..!
మీవే..మీవే..అని..!

సాయంసంధ్యను వీడుతూ ..
ముసురుకుంటున్న చీకట్లకు
వెన్నెల పంచాలనే ఉబలాటంతో
ఉదయిస్తున్న పున్నమి జాబిలితో..
పోటీపడుతూ..ఎదురునిలిచిన నా చెలి..
అందాలను బందించిన అనుబందంతో..
నునుసిగ్గులలో పూసిన ఎర్రని రోజాలు..
ప్రీతిగా గొనుమని తెలిపే..అల్లరి చూపులు..
అందించిన చేతిలోని స్పందనలు .
.చెప్పకనే చెపుతున్నాయి...
జడలో తురిమిన మల్లెలంత స్వచ్చంగా..
ఊగుతున్న జూకాల కదలికలంత ఇష్టంగా....
చేతికున్న గాజుల గలగలలంత పవిత్రంగా..
మనసా ..వాచా..కర్మణా ...అర్పణలన్నీ..మీవే..మీవే..అని..!
ఏకత్వం
శివ తత్వం, విష్ణు తత్వం ఏకమై...
ఏకత్వ స్తాణువై..పూజలందుకొను మాసం.. కార్తీకం..
విశేష ఫల ప్రదమైన ..పవిత్రమైన..
ఉపాసన కాలమయిన దక్షిణాయానంలో వచ్చే మాసం.. కార్తీకం..
నెల వంక అయిన చంద్రుడు ..కృత్తికా నక్షత్రంతో కూడిన రోజే.
నెలారంబమని..ఆ పేరుమీదే...నిలిచిన మాసం...కార్తీకం..
ఈశ్వర స్వరూపమే దీపం...ఆ ఈశ్వర దర్శన బాగ్యంకొరకే..
ఉదయం...సాయంసంద్యలలోనూ.. దీపం పెట్టుకొను మాసం ..కార్తీకం..
ప్రతి దేవాలయంలోను..అర్చనారాధనలతో ..ధ్వజస్తంబంపైన ..
ఆకాశదీపం వెలుగులు రువ్వుతూ కనిపించే మాసం..కార్తీకం..
ఆశ్వీయుజమాసంలో ..చంద్రుని వెన్నెలను త్రాగిన నదీజలాలు..
ఔషధీయిక్తమై ..నదీ స్నానానికి ప్రాశస్త్యమిచ్చే మాసం..కార్తీకం.
విష్ణు తల్పమైన ఆదిశేషుని ..శివుని .కంఠాభరణం..నాగుని ..
పూజిస్తూ....పాలుపోయు నాగుల చవితి వచ్చు మాసం.. కార్తీకం..
ఒకటిగా కలిసి...బెదాలను విడిచి ..వనబోజనార్దమై..
పరమాత్మ స్వరూపమైన చెట్ల నీడలకేగు మాసం.. కార్తీకం..
ఆలయాల్లో..యమద్వారమును తలపించు .. జ్వాలా తోరణం
శైవ..విష్ణు లోకాల దారిని చూపించు మాసం..కార్తీకం..

25, అక్టోబర్ 2015, ఆదివారం

జో...జో...
అలకలన్నీ తీరి
అలివేలు మంగ..
అచ్చంగ విభునికి 
అన్ని అర్పించంగ...
కాటుకంటిన శ్రీవారి
బుగ్గలు నిగ్గు తేలంగ
అది చూసి నవ్వింది ..
అమ్మలగన్న అమ్మ..
మురిపెంగా...
సతి సాన్నిధ్యము లోని
సరసాల సౌఖ్యాలు ..
అనుభవములోన మగనికి
ఆనందాల పొదరిళ్ళె...
ఆలు మగల అన్యోనతలోన
మధుమాసానికి... ఎపుడు
ఆవాసమేలే...
పాల కడలి అలల నురగల
తేలేటి శేష తల్పముపైన..
సేద తీరి నట్టి..
చిద్విలాసపు నగవుల
శ్రీనివాసుడ వేలే..
నడిరేయి దాటుతున్నది..
తొలిజాముకు దగ్గరవుతూ..
గుండె సడిలోన గువ్వలా ఒదిగి..
పవ్వళించరా..స్వామి..!
నాశ్వాసలోని నీ నామ జప తెరలోన..
జో..జో...!....జో..జో...!
************హృదయ స్పందనలు కావా..!*************
గున్నమావి చిగురులను ప్రీతిగా ఆరగిస్తూ..
కుహు కుహు రాగాల.. కోయిల పాట విన్నా..
నిశబ్ద నిశీధిలో స్వార్ధం మరచి నిండు చంద్రుడు 
పున్నమి వెన్నెలను.. మంచు వలె కురిపిస్తూ ఉన్నా..
చల్లనిగాలి పిల్ల తెమ్మెరలై..మెత్తగ స్పృశిస్తూ.
వికసించిన మల్లెల పరిమళాన్ని మేనంతా పామేసినా..
ఎద లోతులలో కదలికలే అవి....హృదయ స్పందనలు కావా..!
వదిలేసినపసితనంలో ..కొత్తగాచేరిన ప్రాయాన్ని..
వయసుచేసే చిలిపి అల్లరుల వేగే కన్నె మనసు..
నీవేనేనను పలుకుల ఆసరా ఇచ్చువాడు..
ఎవరని..ఎచట ఉన్నాడని..ఏమరపాటులో...
ప్రతి చూపును కంటికొస బిగించి .. వెతుకుతున్నపుడు..
వెనుకగా వచ్చి వెచ్చని కౌగిలిచ్చినపుడు..
మదిగదిలో పులకింతలే అవి ...హృదయ స్పందనలు కావా..!
ముడిపడిన బంధంతో ..జీవితాలు ఏకమై..
పంచుకున్న మధురామృతాల సాక్షిగా..
మొలక నవ్వుల చిరుదీపం తమ మద్యన
ఉదయిస్తుందని తెలిసినపుడు..
ఆనందపు మెరుపులే అవి  ..హృదయ స్పందనలు కావా..!
తన అద్భుతమైన చిత్రంలొ...నా కవితని బందించారు...ప్రముఖ చిత్రకారులు ఛంద్ర గారు....ధన్యవాదాలు ఛంద్ర గారు...
సోదరా...! నడిరేతిరి దాటెనని దిగులేలరా.. పున్నమి వెలుగుల వెన్నెలా పిండారబోసినట్లుంది చూడరా.... ఆటుపోట్ల అలజడులను అణచుకొని సాగరుడు అలల ఉయలలే... ఊపుతున్నాడురా.. తెరచాప లేని నావైనా.... తేలిపోతూ,, సాగుతుందిరా.. జాలరోళ్ళమని మనల జాలి చూపుతూ.. తన కడుపున దాచుకున్న మత్స్య సంపదనే.. వలల కంచింది...మన కడుపు నింపుతుంది రా.. సముద్రమెంత గొప్ప మనసు కలదిరా.. సోదరా.. .ఈ ప్రకృతి అంతా... మన అమ్మ వంటిది రా..సోరరా...!
అలలపై తేలింది.. పూలనావా...అలా..అలా..అలా... మదిలోన మొలిచింది.. వెన్నెలలాంటి కలా కలా..కలా.. ఏటి లోని నీటిలో.. ఒక్కటై కనిపించే ఇద్దరమూ మురిపాలను పంచుకొని మురిసిపోవు ఈ శుభదినమూ... నీరెండ వెలుగులన్నీ.. సిందూరాలయే..చెలి చెక్కిళ్ళలో ప్రణయాల పరిమళాలు.. చేరాయి పరువాల ముంగిళ్ళలో..


*********తెలుసుకోండి...**********

చేదైనా..చేతిలో గ్లాసు ప్రతిష్టకి చిహ్నం 
ఉన్నవాళ్ళ కుటుంబాలలో...
పార్టీల పేరిట మందు సేవనాలు..
అలవాటై అవే చేస్తాయి కుటుంబ నాసనాలు..
శరీరాన్ని గుల్ల చేసి..ఆసుపత్రి పాల్జేస్తాయి.
మరీ శృతి మించితే...బూడిదగా మిగులుస్తాయి..
కాయ కష్టం చేసుకునే బడుగు జీవులు సైతం..
కల్లు ,సారాయిలకు బానిసలవుతూ ..
.బ్రతుకు దుర్భరం చేసుకుంటున్నారే..
ఎవరు చూసినా ..ఎటుచూసినా....
చూడ చూడ రుచుల జాడ ఒకటే ..! అన్నట్టు..
జీవిత విలువలను వలువలు విడిచినట్టు విడిచిపెడుతున్నారే..
మద్యపానం అంటే అసుర సమ్రక్షణమనితెలుసుకొని.....
మానవత నిలుపుటకు మధువును మట్టుపెట్ట పూనుకొండుకు..
గాంధీగారి నడవడిని, కందుకూరి ఆశయాలను,
రాజారామ్ మోహన్ రాయ్ తెగువను,.
పుణికిపుచ్చుకున్న యువతరం ..
నడుంకట్టి ..వాడ వాడలా తిరుగుతూ.
ప్రతిఒక్కరికి అర్థంచేయించండి....తెలుసుకోండి...!

*******ఉయ్యాలో..ఉయ్యాలా..*********
ఉయ్యాలో..ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా...
బంగారు రంగులో ఉయ్యాలా ..పసుపు గౌరమ్మనే చెయ్యాలా..
గూనుగు పూలతో ఉయ్యాలా..అందంగ పేర్చాల ఉయ్యాలా..
బంతులు. చేమంతులు , మందారాలు ఉయ్యాలా..
గుట్టగ పెర్చాలె ఉయ్యాలా..
రంగు రంగుల పూల బతుకమ్మ ఉయ్యాలా..
చల్లని తల్లి ఆ యమ్మ ఉయ్యాలా..
కన్నె పిల్లల కలలు తీర్చుతాదే ఉయ్యాలా..
ముత్తైదువుల పసుపు బొట్టవుతాదే ఉయ్యాలా..
వనితలందరూ ఉయ్యాలా...ఒక్కచోట చేరి ఉయ్యాలా..
ఊపాలే ఊపాలే ఉయ్యాలా...చేతులు ఊపాలే ఉయ్యాలా..
చప్పట్లు కొట్టలే ఉయ్యాలా...చుట్టురా తిరగాలే ఉయ్యాలా..
దుర్గమ్మ తల్లిని కొలవాలె ఉయ్యాలా..
మట్టి దీపమే పెట్టాలె ఉయ్యాలా..
బతుకమ్మ .. బతుకమ్మఅంటూ ఉయ్యాలా..
ఏటిలోన విడువాలే ఉయ్యాలా..
నీటి పైన తేలి ..ఆయమ్మ ఉయ్యాలా...
పోయి మల్లి ఏడాదికొచ్చునే ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..
మళ్ళి రావే తల్లి ఉయ్యాలా...మమ్ము సల్లంగ దీవించు ఉయ్యాలా..
తెలంగాణా తల్లికి ఉయ్యాలా...అడబిడ్డవే నీవు ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..