29, సెప్టెంబర్ 2015, మంగళవారం

నా చెలికాడు...
రమ్మని చెప్పిన చెలికాడు
'రవళి ...నీకోసం నేనున్నా..అంటూ..
రవ్వల లోలకులు తెస్తాడు అనుకున్నా.
రంగుల సినిమా చూపిస్తాడనుకున్నా...
రహస్యం... అని చెవిలో ..గుసగుసలు చేపుతాడనుకున్నా...
రవిక బిగువులదాచిన వలపులు దోచుకుంటాడనుకున్నా..
రసాత్మకపు తేనెలనందిస్తాడనుకున్నా..
రవి అస్తమించే సమయమవుతున్నా...
రమణీయ మయిన ప్రకృతి ..
రతీమన్మధులకు స్వాగతం చెపుతున్నా..
రవ్వంత కనికరం చూపక వెన్నెలరేడు పున్నమి కన్ను గీటుతున్నా..
రగిలే ఎదలో సెగలు రేపుతూ.. రాడాయె ఎంతకీ ...నా చెలికాడు....!!
************సాయి స్వరూపం.*************
'గు' అంటే అజ్ఞానం 'రు' అంటే పోగెట్టే వాడు...
సద్గురువు గా నిలిచిన... సాయి
ఆ అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతూ..
మనిషిగా అన్ని కర్మలను అనుభవంలో చూపిన
మహిమాన్విత దైవ స్వరూపం సాయి..
బడభాగ్నుల మంటల్లో కాలిపోతూ..
ఒక్కసారి 'బాబా' అని అర్ధిస్తే చాలు..
చల్లని హస్త స్పర్శను అందించి..
సుగమనమయిన మార్గంలో నడిపించెదరు సాయి...
మన పాపాలను చిలిము త్రాగుతూ.... తాను గ్రహించి..
నిరతాగ్నిహోత్రమయిన ఆ 'ధుని' తో..
పదకొండు నిత్య సత్య సూక్తులతో..
దీనజనోద్దారణ గావిస్తూ...భక్తవత్సలుడైన సచ్చిదానందుడు సాయి..
అమ్మలా ఆదరించిన బజియాబాయి తనయుడు తాత్యా కోసం..
తన ప్రాణాలను పణంగా పెట్టి...జీవసమాధి అయి..
శరణమన్న వారికి ..నేటికి 'నేనున్నా...మీకోసం..'
అంటూ ఆపదల గాస్తూ..నిదర్శనం చూపుతున్న నిరాకార సత్యమే.. సాయి...
దత్తాత్రేయుని అయిదవ అవతారమయి అవధూత గా ఇలచేరిన ..
త్రిమూర్తుల ఏకత్వమై..స్మృతిమాత్ర ప్రసన్నుడు.. నిత్యుడౌ షిరిడీ సాయి...!


గోవిందా....గోవిందా...

గోవిందా అని తలచిన చాలు..
ఆ శేషాద్రి నిలయుడు..
వేగిరమే వచ్చి నిలచును మనమున..
ఆపదల గాచి ...అభయమునోసగి..
కనుపాపలవోలె కాపాడునులే.....కాపాడునులే...//గోవిందా//
నీలాల ముడుపులే కట్టించుకొని..
మనసును నిశ్చలమే చేయునులే..
కలతలతో ఎద కలచివేయు తరుణాన
కరుణాకటాక్షాల వర్షాలే కురిపించునులే...కురిపించునులే...//గోవిందా//
ఏడు కొండలపైన కొలువైనా.. వాడు..
కొలిచేవారిని..ఎన్నడూ...కినుక చూపడు..
కష్టాలు కన్నీటి సంద్రాలవు వేళ..
కోటి ప్రభలస్వామి..వెలుగులే తానవునులే..తానవునులే...//గోవిందా//
*************అదే అమ్మ ..**************
గర్భాశయాన్ని కంచుకోటగా మలచి..
తన రక్త మాంసాలతో శరీరాకృతిని ఇస్తుంది అమ్మ..
నెలలు నిండి పురిటి నొప్పులు నీవిస్తే...
జన్మ నిచ్చి ...అక్కున చేర్చుకుంటుంది అమ్మ..
ఆకలితో నీవేడవకుండానే..తన స్తన్య మిచ్చి
పాలు పడుతూ.. నీ బొజ్జ నింపుతుంది అమ్మ...
ఉంగా ఉంగాలతో..నీవు చొంగ కారుస్తూ ఉంటే...
అనురాగ లాలనల చెరగుతో నీ పెదవులు తుడుస్తుంది అమ్మ..
అడుగులు కదపలేని నీ అసహాయతకు తను ఊతమై..
తప్పటడుగులు పడనీయకుండా నడిపిస్తుంది అమ్మ..
అత్తత్త...అంటున్న నీ నత్తి మాటలకు .
మురిసిపోతూ..సరి చేసే భాషల నేర్పిస్తుంది అమ్మ..
అ ఆ ల అక్షరాభ్యాసంతో మొదలైన నీ భవిష్యత్తుకు
తాను పునాధిగా నిలిచి ...నిన్ను ఉన్నత శిఖరాన నిలపెడుతుంది అమ్మ..
నీలోని ప్రతి సంగర్షణని తన గుండెలో దాచుకొని...
అవలీలగా ఆలోచనల తీరాన్ని దాటించేయిస్తుంది అమ్మ..
శరీరం ముడుతలు పడి...శుష్కించి పోతున్నా...
ఎదురు చూపులు నీకోసమే..."బిడ్డ ఎట్లా ఉన్నాడో " అని...అదే అమ్మ
మట్టి గాజులు
ఆడవారికి ప్రీతి కరమైన
అలంకారమగు ఆభరణాలలో ....
అతి ముఖ్యమైనవి గాజులు...
ప్రాచిన కాలం నుంచీ ...
సంప్రధాయ పరపతిని మోస్తున్నా
నిత్య నూతన కళలతో భాసిల్లుతున్నాయి గాజులు.....
దేవతా స్త్రీలు..రాక్షస వనితలు..
మట్టి మోసే మగువలు....మహారాణులు అనే
భేదాన్ని తెలియనీయనివే....గాజులు..
వజ్ర వైడుర్యాలను ఒదిగించుకున్నా..
మేలిమి బంగారు ఛాయలతో మెరిసిపోతున్నా..
అన్నిటినీ మించి గీటుగా నిలిచేవే రంగు రంగుల మట్టి గాజులు..
ముత్తైదు తనంలో ముగ్ధముగా నిలిచి ..
పెళ్లి నాటి ప్రమాణాలని తన చిరు సవ్వడుల
మగనికి తెలియజేస్తూ..మురిపాలు పంచేవే గాజులు..
ఏసువి నీవు..
పరమేశువి నీవు..
ఫకీరు నీవు...
ప్రకృతిలోని ప్రతి అణువు నీవే...నీవే....
సాయి...ఓం సాయి...
జగతికి జీవం..పోస్తూ..
పర లోకపు సారం తెలుపుతూ..
అజ్ఞానపు చీకటిని తరిమి కొడుతూ..
జ్ఞాన జ్యోతిని మదిన వెలింగిచే..
సద్గురువువు నీవే..నీవే...
సాయి....ఓం సాయి...
మతములకు దొరకని
మహిమవు నీవు..
మహిలో మానవతనే
నిలిపిన మహనీయుడవు నీవు
అయినా,,,నిర్మలమైన రూపంతో..
మసీదు నివాసిగా నిలిచినావు..
నిను తలచేవారి ఎదలో కొలువైనావు...
సాయి...ఓం సాయి...
మా తాత ...
కంటి తడిలో
ఆరని కణం అయి
జ్ఞాపకాల గదిలో 
బందీగా నిలిచారు మా..తాత.
వేస్తున్న ప్రతి అడుగుకు ..
చేస్తున్న ప్రతి పనికి ..
పలుకుతున్న ప్రతి పలుకుకు.
ఇంటికి దూలమల్లే..
బ్రతుకు సారం తెలిపి..
జీవన గమకానికి
ఆయువుగా నిలిచి..
నా గురువైనారు మా.. తాత
నా ఉంగాలతో ...
తను కేరింతలు కొట్టే వారట..
నా తప్పటడుగులకు ..
తను తడబడి నడిచేవారట..
బడికి నాతొ పాటూ..
పుస్తకాల సంచి మోస్తూ
తనూ వచ్చేవారట..మా ,,తాత.
కళాశాల రోజుల్లో..
రావడం ఆలశ్యం అయిన క్షణాలలో..
వీధి చివరికంటా వచ్చి .
చిప్పిల్లిన చూపులతో..
ఆరాటంతో వణుకుతున్న శరీరంతో
'పాప ఇంకా రాలేదేమి ' అనుకుంటూ..మా తాత..
అప్పగింతలతో పాటూ..
ఆశిస్సులు అందించి..
దూరం అవుతున్నానన్న బెంగ తో.
మంచాన్ని ఆశ్రయించి...
'నీ కడుపున పుడతానమ్మా..'
అంటూ గాజుకళ్ళతో మూగగా చెప్పి
తాను నిర్జీవమై దైవంలో కలిసిన మా తాత...!
...........__/\__................నివాళులతో...
'అప్పుడు...'
తడి ఆరనివ్వకుండా..
కన్నులకు నీటిని సరఫరా చేసే
హృదయానికి ..
జవాబు చెప్పలేని తనాన్ని..
లో లోన మింగుతూ..
తూనీగల్ని పట్టుకుందామని
పరిగెట్టే పసితనపు అమాయకంలా..
కాలాన్ని పట్టుకోవాలనుకుంటున్న
నా వెర్రి నైజానికి ..
నాలో... నేనే ...
నేను ..ఏమి లేను అనే..
నిజాన్ని తెలుసుకొని..
అమ్మని ..ఆవకాయని ..
తలచుకొని ..తరలి పోతున్నా...
అదే...'అప్పుడు' బాదం కాయలు
ఏరుకున్న ఆ బాల్యం లోనికి...!
‘ సాక్ష్యం’
చూపులు సారించి మబ్బులకేసి
ఆశగా చూసే రైతన్నలకు జీవాన్నిఇస్తూ..
చిటపట మని కురిసే తొలకరి చినుకులు..
గ్రీష్మ తాపానికి వేడెక్కిన నేలతల్లి
గుండెలోనికి జారిన ఆ చినుకులదారలు ..
,మట్టి రేణువుల సంగమంలో జనించిన సుగంధాలను..
వీచే గాలి తెమ్మెరలు ఆలింగనం చేసుకొని..
మోసుకు తిరుగుతున్నాయి...
ఆ పరిమళాల ఆస్వాదనలో..జగతి పులకించి..
ఒళ్ళు విరుచుకుంటుంది..
తొలకరి జల్లుల తడి చీరెను సవరించు కుంటూ..!
తమకంతో నలుపెక్కుతున్న మేఘుడు..
సప్త వర్ణాలవంతెనపై..
మెరుపుల రాయబారం పంపుతూ..
ఉరుముల సందేశాన్ని ఇస్తూ..
తన ప్రేమని చాటుకుంటున్నాడు...
జడివానగా తాను మారిపోతూ..
వానాకాలపు సరాగాల సైయ్యటలకు
ఈ ' తొలకరి జల్లులే ' సాక్ష్యం అని చెపుతూ....!
సాయి సర్వము..
సాయి నిత్యము...
సాయి సకలము
సంతోషము నిచ్చే దైవము..
సాయి గీతము..
సాయి రాగము ..
సాయి చరణము
శరణము నొసగే ప్రణవము..
సాయి బోగము..
సాయి యోగము..
సాయి స్మరణము
అనుక్షణము అభయ ప్రదాయకము..!


నాన్నా....!

అమ్మ పేగు తో ముడి పడి .. ఉన్నా...
నీ ప్రేమ లాలనల ఒడిలో నే... ఒదిగి ఉన్నా నాన్నా...

కడుపు నింపినవి అమ్మ చనుబాలే అయినా..
వెచ్చని నీ ఊపిరిలో శ్వాసిస్తూ..జీవించా...నాన్నా...

వినీలాకాశంలో ఆ పున్నమి చంద్రుడి కన్నా...
అంతం లేని నీ అనురాగంలోని వెన్నెలలంతా నావే గా నాన్నా..

వేదాలలోని సారం నాకు తెలియదు కాని...
నీ మాటలే నాకు వేదాలై.. బ్రతుకు బాటపై అడుగులు వేయించాయి నాన్నా..

అమ్మ ఎప్పుడు అమ్మే...సృష్టి తెలిపిన సత్యం...
నాన్నలో అమ్మ దాగి ఉన్న నిజం నీలోనే చూసాను ..నాన్నా...!
ఎదలోని...
ఎదలోని మూగ బాధా
ఏమని తెలుపను కృష్ణా...
వెదురు పొదలలో ఎంత వెతికినా...
కానరావైతివి కృష్ణా....
అమ్మ చేతి వెన్నముద్దలు
ఆరగించి ..ఆరగించి..
అలసినావో..ఆదమరచి
నిదుర పోయినావో..
అని తలచి తలచి..
నీకై వగచి వగచి......//ఎదలోని//
గోపకన్నెల కౌగిళ్ళ చేరి..
పరవసించి..పరవసించి..
ముద్దు ముచ్చటల తేలిపోయి
సొలసి నను మరచినావో...
అని తలచి తలచి...
నీకై వగచి వగచి......//ఎదలోని//
చిరుఅలలలతో పాదాల
పలకరించెను యమునానది.....
చిరుగాలి సవ్వడులతో..
తాకి నను చుట్టేసెను గాలితెమ్మెర.
మలిగినది సాయం సంధ్య ..
చీకటి... వెలుగును మింగేస్తూ...
మాధవుని జాడ తెలియక మరి మరీ..
తలచి తలచి..
నీకై వగచి వగచి.....//ఎదలోని//.
హనుమా....
ఎంతటి భాగ్యము హనుమా...నీది...
శ్రీరామచంద్రుని దాసువైనావు..
నిరం'తరము' రామనామ స్మరణలోన
జీవించు 'వరము' పొందినావు..
వా'నరము' అని పరిహసించిన రావణునికి
లంకా ధహనము చేసి... నీ శక్తినే చూపినావు..
దుర్లభమనుకున్నది సుగమమనితెలిపుతూ..
వియోగము కడతేర్చి...ఆలుమగల కలిపినావు..
హనుమా అని తలచిన చాలును ...
భయములు తొలగి ..శుభములు కలుగును..
నీ కృపయున్నాచాలును మాకు ..కోరేదొకటే...
ఇహమున శాంతి ..'పరము'న మొక్షం!
"అద్దం "
"ఫో..ఫోయి అద్దంలో ముఖం చూసుకో..."
అంటూ ..ఈసడించుకున్నారని..
అద్దంలో ముఖం చూసుకుంటే...
కనిపిస్తుంది..అసలు "నిజం.."!
చెక్కెర అతికించు కున్న నవ్వు
స్వర్ధపుటాలోచనలచీమలు నాకితే..పోతుంది..
ప్లాస్టిక్ పూల సోయగం..
కన్నులకు విందు చేస్తుంది...కాని..
పరిమళాల గుభాళింపులతో పలకరించదు కదా..!
నిశ్చల మై నిలిచి ఉన్నా అద్దం..
ఎప్పడు అబద్దం చెప్పదు..
తన ఎదురు ఎవరు ఉంటె..
వారినే ప్రేమించే..తత్వం తనది..
అందుకే అందరికీ...అద్దం ఎప్పడు ప్రియ నేస్తమే...!
గోదావరి...
పర్ణ శాలలో కాపురముండి.
ప్రకృతి రమణీయతల పరవశిస్తూ..
ఆలుమగల అన్యోయతకు భాష్యమైన
సీతారాముల సంసారపు సరిగమలను
తన అలల గలగలలో దాచుకొని ...
గుంబనంగా నవ్వుకుంటూ...
పారాడుతుంది జీవనదై ..
ఈనాటికి గౌతమైన గోదావరి...
సుడిగుండాల అగాధాలను ..
ఎత్తు పల్లాల పరవళ్ళను..
పాషాణాల బండరాళ్ళను..
ఇసుకతిన్నెల తివాచీలను..
ఒకే రీతిన స్పృశిస్తూ..
మనోభావాలను మదిన దాచుకొని..
మందహాసమున మగనిచేరే మగువైనటుల
చల్లని తల్లిఅయి సాగుతుంది గోదావరి..
ఏది ఏది నీ సన్నిధి అని..
నిదురను మరిచి ..వెతికాను..
కొండల ..కోనల..
తిరిగి తిరిగి..
వేసారినాను..
మేడల ..మిద్దెల
అడిగి అడిగి ..
అలసినాను.
కలవరపడు
హృదయముతో..
వేదన నిండిన మనసుతో..
సాయి..సాయను స్మరణల
నీ పదసన్నిధి చేర..
నిదురను మరిచి వెతికాను..
మూసిన కన్నుల
కనిపించి... నీవు..
"నేను నీలోనే ఉన్నా .."
అన్నావు..
ఆత్మవు నీవై..
పరమాత్మ స్వరూపమే .
దరిశనమిచ్చావు...
బాబా..అన్న పిలుపులోని
ఆర్తివై..అనుక్షణము మము కాపాడు..!
మహిమాన్వితులం"

వనంలో వివిధ వర్ణాల
పూలు వికసిస్తూ..
కనువిందు చేస్తాయి 
ఒకేలాటి మొలక నవ్వుల ..
కొండలపైనుండి వీచినా..
బండలను తాకినా..
సెలయేటిని మీటినా .
.గాలితరగల ఒకేలాటి
అనుభూతులు .కలిగించు స్పర్శల ..
అనేకానేక దేశాలు...
వేరు వేరు భాషలు ..
ఎన్నో..ఎన్నెన్నో...
జాతులు..మతాలూ ..
నమ్ముకున్న నమ్మకాలు..
.పూజించే దేవుళ్ళు...
అయినా ..
ఒక్కటే...మానవత్వం..
ఒక్కటే ....మతమెరుగని సమానత్వం..
మనసుతో మమతను
పంచె మనుషుల మద్యన.
చెరగక నిలిచి ఉండేవి..
హృదయ స్పందనలతో..
కనుచుపుల పలకరింపులు..
చిరునవ్వుల నిలిచే...
అత్మియతల ఆదరణలు...
ఓదార్పుల అక్కున చేర్చుకొన
అందించే స్నేహ హస్తాలు..
ఒకేఒక భావనల సంగర్షణలు..
ఒకే పులకరింపుల తలపులు..
రుధిరం ఎరుపన్నది నిజమన్న తీరు..
ప్రపంచం ఒక్కటేనని చాటుతూ..
పోలికల వేరు వర్ణాలయినా ..
ఒకే చట్రంలో బిగిసిన మానవులం..
మహిని మహాద్భుతం చేయగలిగే మహిమాన్వితులం..!