6, మార్చి 2014, గురువారం

మా తాత ....( మది పొరల్లో)

మా తాత గడ్డం పట్టుకొని
 ఉంగాలు చెప్పానట
 ఒడిలో కుర్చుని ఊసులాడుతూ
 మీసాల మెలికల్లో
 మమతని పోగేసుకున్నానట...
అమ్మ చెప్పిన....
అరుదైన ఙ్ఞాపకం......(మది పొరల్లో)

ప్రతీ రోజూ పదిపైసలతో కొన్న
 తియ్యబూందీ పొట్లం లోని బూందీని
 ఒక్కటొక్కటే తింటూ...
అరుగుమీద ఆనందాన్ని అనుభవించిన.. నా
 ఆత్మీయ ఙ్ఞాపకం.......(మది పొరల్లో)

పరికిణీలేసుకున్నా
 పక్కనే పడుకొని మాతాత
 చెప్పే కథల్లాంటి కవనాలని వింటూ...
అకళింపు చేసుకున్న ...నా
 అనురాగపు ఙ్ఞాపకం.....(మది పొరల్లో)

సాయి బాబా తెలియదు కానీ...
మాతాత ప్రతి నిత్యం చెప్పే..మాటలే
 ఆ బాబాగారి సూక్తులు...(సహనం..శ్రద్ద)
అనుక్షణం అనుసరిస్తున్నా..నా
 అనుభవమైన ఙ్ఞాపకం...(మది పొరల్లో)

అప్పగింతలు చెప్పి
 దూరమవుతున్నానన్న భాధని
 తట్టుకోలేని మా తాత
 మంచానికొరిగి...
నెల తిరక్కుండానే....
నానమ్మని వెతుక్కుంటూ....
వినీల గగనంలోనికి
 ఆత్మగా ఎగిరిపోయి...
ముమ్మ్మైమూడు సంవత్సరాలయినా
 సృతిపధంలో మాతాత
 చిరంజీవైన..నా
 అనుభందపు ఙ్ఞాపకం....(మది పొరల్లో)

 (మా తాతగారి కి అశృనివాళులతో.....)  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి