31, మార్చి 2016, గురువారం



ఉగాది లక్ష్మి...
మావి చిగురులు నావి..
మామిడీ కాయలు మీవి...
అంటుందా గండు కోయిల...
కుహు.కుహు... అంటూ..
గొంతు సవరించుకొంటూ..
అలుకలనున్నదో..ఏమో..మరి..
పచ్చని చిలక...ఎర్రని ముక్కుతో..
రామ..రామ..అంటూ...
వసంతునికి పితూరీలు చెపుతుంది..
గుబురుల్లోంచి తొంగి చూస్తూ...
ఒంపులు తిరిగిన నదిపాయలాంటి జడలో..
తురిమిన మల్లెలన్ని..నవ్వుతున్నాయి పకపకా..
కొత్త కోక కట్టుకున్న చిన్నదాని అందాలు..
సోగ కన్నుల మెరిసే..తళుకులు ..
ఋతువుల న్నిటిని కలబోసిన
ఆరు రుచుల ఉగాది పచ్చడిని
చేత బూనిన వయ్యారాలు ...
వసంతునికి స్వాగతం పలుకుతూ...
జయనామ వత్సరాది చెడులను దూరం తోసేసి..
అష్ట ఐశ్వర్యాలను ...అరురరోగ్యలను ప్రసాదించాలని
ప్రతి ఒక్కరు లేదు అన్న పదం లేకుండా జీవించాలని ..
స్నేహసిలతతో పాటు సమతాబావంతో మెలగాలని ..
కోసృకుంటున్నాయి..శుభాకాంక్షలతో....


వసంత రాజు..
మలయమారుత వీచికలతొ...తమ గుబాళింపులు కలబోసిన సన్నజాజులు
శిశిరంలో మ్రోడులైనా...ఆమని ఆగమనం సూచనగా లేత చిగురులతో..
స్వాగతసవ్వడి చేస్తున్నాయి...అరవిరిసిన గులాబీ బాలల అందాలతో కూడి..
మాఘంలో మావి చిగురు మేసిన కృష్ణవర్ణపు కోకిలమ్మ...
తన గాత్రంతో ప్రకృతికన్యను వివశురాలిని చేస్తుంటే.....
మంద్రగమనయి పచ్చనికొమ్మల తలలూపుతుంది పరవశంతో..
మధుర పానీయ చెరుకురసం...పనసతొనల తేనియసోనలు ...
ద్రాక్ష, ఖర్జూరాల తియ్యదనాలు...తర్బుజ వంటి అమృత ఫలాలు..
సూర్యుడు ప్రతాపం చూపిస్తూ ఉన్నా..మాధుర్యాలనందిస్తున్నాయి తమవంతుగా..
పండు మిరపకాయ, గోంగూరలతో..ఊరగాయలు ..బామ్మగారి పనయితే...
అమ్మ పెట్టే మాగాయ తాలింపు ఘుమ ఘుమలు ..డాబాపై..గుమ్మడి వడియాలు..
అద్భుతమైన రుచులతో...ఆస్వాదించ స్వాగతమే పలుకుతున్నాయి వసంతునికి..
చైత్రమాసం తొలిరోజు... తెలుగువారి సంవత్సరారంభానికి శుభ సూచకం ఉగాది ..
సాంప్రదాయ వస్త్రాలను దరించి దేవాలయాల కేగి..నమస్కారాలతో దేవుని దర్శించి.
ఆరు ఋతువులకు...ఆరురుచుల మేళవింపుతో కలగలిపిన ఉగాదిపచ్చడిని సేవిస్తారు..
ఉగాది దాటిన తొమ్మిదో రోజున చలువ పందిళ్ళ పానకాలు..వడపప్పులతో...
శ్రీ రామ నవమి వేడుకలు...కళ్యాణవైభోగాలు..ఎంతగా చూసినా తనివితీరని భక్తిరసాలు.
ముత్యాల తలంబ్రాలే కాదు...మేము ఉన్నామంటూ..చల్లగ కురిసే చిరుజల్లులు...
క్షణాల జారుడు మెట్లపై నుండి జారిపోతూ కాలం..తన చుట్టూ ప్రపంచాన్ని తిప్పుకుంటుంది.
తడబడని అడుగులతో...నడువగలిగినప్పుడే..బ్రతుకు దారి సుగమమవుతుంది..
అప్పుడే..ప్రతి మనిషి జీవితంలో...ఏ కాలమైనా వసంతం ..స్థిరనివాసమై..విలసిల్లుతుంది.

30, మార్చి 2016, బుధవారం

"మా అమ్మ చేతివంట "
బ్రహ్మ తన అంశని 
అమ్మలో దాచాడు...
అందుకే...బిడ్డ కడుపున
అంకురంగా నిలిచిన క్షణం నుంచి..
తన రక్త మాంసాల ఆహారంతో రూపునిస్తుంది..
ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మ నిస్తుంది..
ఒడి చేర్చుకొని...
చను బాలతో కడుపు నింపుతుంది ..
ఆరునెనల అన్నప్రాసన చేయించి...
చందమామని చూపిస్తూ..
వెన్నెల బువ్వలు ..
గోరుముద్దలు చేసి తినిపిస్తుంది...
బోసినవ్వుల్ల్లో బంగారు భవిష్యత్తుకు
పునాధులు వేయిస్తూ...
బిడ్డ ఏది ఇష్ట పడతాడో...
ఆ పదార్దమే చేయాలనే అమ్మ తాపత్రయం..
అమ్మ ప్రేమని ఆయువు చేసుకొని..
ఎదుగుతూ...అమ్మ ఏది చేసినా..
అందులోని మమతామృతాన్ని ఆస్వాధిస్తూ..
ప్రతి మనిషి ..అమ్మ ఎక్కడ ఉన్నా..మా
" అమ్మ చేతి వంట మరి మరీ ఇష్టం" అనుకుంటాడు...!

23, మార్చి 2016, బుధవారం

భక్తి బావనతో
బంతి పూవులు తేనా...
మనసున మెదిలే మమతతో
మల్లె పూవులు తేనా...
గుండెనిండా ప్రేమతో
గులాబీ పూవులు తేనా....
అన్నీ నేనై...
నేనే నీకై....
అర్పితమై పోనా...
ప్రభూ....!!!!
"అతివ" - "ఆదిశక్తి"


యుగయుగాల చరితం తిరగేసినా
అతివ ఎప్పుడూ ఆది శక్తి అవతారమే
సతిగా అత్మాహుతి చేసుకున్నా
తన అభిమానాన్ని కాపాడుకుంది
పార్వతిగా పరమేశ్వరుడిని చేరి
సగబాగమై తాను నిలిచింది
అమృతమయి అన్నపూర్ణగా వెలిసి
ఆకలి దప్పుల తీరుస్తుంది
కౌశల్యలోని కన్న ప్రేమ రామునిదైతే
యశోదమ్మలోని పెంచిన ప్రేమ కృష్ణయ్యదై
వారినెల్ల వెళలా కాపాడింది
ఒకఝాన్సీగా ..సమరాన దూకి
తెల్లవాళ్ళను తరిమి కొట్టింది
రుద్రమగా ఖడ్గం చేత బట్టి
ఎదుటివారిని గడగడలాడించింది
మధురమైనవి వెంగమాంబ గీతాలైతే...
మందహాస బరితం మొల్ల రామాయణం
'నైటింగేల్ ' అనిపించుకుంది
పసితనంలోనే కవితనువ్రాసి సరోజినీదేవి
మహిళాభ్యుదయానికి తన జీవితాంతంవరకూ
పాటుపడింది దుర్గాబాయ్ దేశ్ముఖ్
అనంతాల్లో కెగిరి అహా! అనిపించుకుంది
విశ్వంలో కలిసిపోయి అమరమైంది కల్పనాచావ్ల
అమ్మ గా మమతామృతాన్ని పంచుతూ
మగని కనుసన్నల అనురాగమునందిస్తూ
ఆశయాల భివృద్దిపధంలో
ఎందరికో...మర్గదర్శకమై
నిత్యం...అనునిత్యం...
పరిశ్రమిస్తూ...ఉన్నా...
ఇంటా..బయిటా...
చెరగని.... చిరునవ్వు
చెదరని... మనస్థైర్యం
ఒక్క మహిళకే సొంతం...!!!
అందుకే...."అతివ - ఆదిశక్తి"

14, మార్చి 2016, సోమవారం

తులసి....
విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమై..
ప్రతి పూజలోను నిలచే.. తులసి...
ఆరుబయట తానున్నా...
అందరిని ఆదుకునే ఆరోగ్యప్రదాయని తులసి.
చిట్టి మొక్కయినా....
చిట్కాల వైద్యంలో అగ్ర స్తానం పొందినది తులసి. .
తిర్తంలో పత్రమై చేరినా...
మాలలో దళమై నిలిచినా ఆ పేరే..తులసి..
మరణ శయ్యపై..నారాయణ మత్రంతో...
కలిసిపోవును తులసి..
అతివలకు ఆరాధ్య దైవమై నిలిచి ...
అమ్మగా అనుక్షణ౦ కాపాడే తులసి..
ప్రదక్షిణాలకు పరిపక్వత నిచ్చి ....సిరి సంపదల వరమొసగు తులసి....
రకాలలో..అనేకం...కృష...లక్ష్మి...అడవి...
అయినా...ఒకే గుణమున్న తులసి..
సత్య భామ గర్వమణచ..
.ప్రేమ..భక్తిని తెలుపుటకు రుక్మిణి చేరిన తులసి..
త్రాసులో కృష్ణునితో..తూగి..
అరాదనను తెలుపుకున్నపరమపావని తులసి..!!
సీతాకోక చిలుక ...
పలకరించే పెదవులకు...
ఇన్ని కలవరింత లెందుకు...
ఎదురుచుపుల నయనాల 
నిలిచిన చెమ్మ తుడి చెందుకా ...
రెక్కలోచ్చిన ఊహలు..
రంగుల సీతాకోక చిలుకలైతే...
ప్రతి బావం పుప్పొడై..
విందు చేయదా..చుంబనాలతో..

12, మార్చి 2016, శనివారం

మదర్ తెరిసా....
మనసు వెన్నలా ఉన్న ఏ అమ్మాయి అయినా అమ్మే..
అని నిరూపించిన అమృత మూర్తి ' మదర్ తెరిసా'
అల్బేనియా లో పుట్టినా ...భరతమాత ఒడి చేరి
అనాధలకు...అభాగ్యులకు...తన ఒడిని పంచిన ప్రేమమయి
అంటారని తనం అన్నది అవనికి దూరం అంటూ...
చిపిరి పట్టి రోడ్లు ఊడ్చి నట్లే...మత బెదాలను తరమికొట్టిన
మహనీయ మహిళా మణి ...తరగని మమకారాల గని
పద్మశ్రీ...భారతరత్న అన్న బిరుదులే కాదు ..ప్రపంచ ప్రక్యాత
నోబెల్ బహుమతి కూడా పొందినా...నిరాడంబర జీవితమే
తన ఆశయ సిద్దికి అనుకూలమని..ఎంచుకొనిన మాననీయి..మదర్ తెరిసా..!!
గ్రీష్మం....
శిశిరం లో మోడుగా మారిన కొమ్మలన్నీ....వసంతుని ఆగమనంతో
చిగురులు తొడిగి....ప్రకృతి కన్యకు....పచ్చని చీర కట్టాయి...
మావి చిగురులు మేసిన కోయిలలు గొంతు సవరించుకొని 
కుహు...కుహు..ల రావాలతో....కమ్మని గానామృతాన్ని పంచుతున్నాయి..
కరిగిన హిమంలోని చల్లదనం ...వచ్చే గ్రీష్మంలోని వెచ్చదనం
కలబోసుకొని నులివెచ్చని పొత్తిళ్ళను గుర్తుచేస్తున్నాయి....
రేరాజు కురిపించే వెన్నెలను పోటీ చేస్తూ...
తీగేలనిండా...విరగబూసిన మల్లెలు పరిమళాలతో మత్తెక్కిస్తున్నాయి..
చైత్ర వైశాఖ మాసాలలో ...మామిడి కాయల తోరణాలగుత్తులు ..
జేష్ఠ ఆషాడ మాసాల గ్రీష్మ ఋతువుకు స్వాగతం పలుకుతూ...
పచ్చని పుచ్చకాయలు ఎర్రని గుజ్జుతో...చల్లగా సేద తీరుస్తానంటూ..
వీది వీదిన చెరుకు బండ్లు ...తీయని అమృత రసాన్ని అందిస్తూ....
బాబోయ్...ఎం ఎండ!!అనుకుంటూనే..ఐస్క్రీం తింటూ ఆనందించే కాలమిదే..
"రోహిణి కార్తి లో రోళ్ళు పగులుతాయట..." నానుడిని గుర్తు చేసుకుంటూ...
రోడ్డు మీద ఆమ్లెట్ వేసే ఆంకర్ని ని టివిలోచూస్తూ.."నిజమే..!" అనుకుంటాం..
బడుల సెలవులు....పిల్లల అల్లరులు....ముచ్చటలే..పని వత్తిళ్ళయినా..
పదినెలల కాలం ఎదురుచూపులతీరం....బంగినపల్లి మామిడిపండ్ల రుచులే...
వచ్చే వర్షఋతువుకై..భానుడు తనప్రభావంతో సముద్రజలాలను ఆవిరిచేస్తూ!!

10, మార్చి 2016, గురువారం




మామ !!
ఏమరతో ఎటికెళితే మామ ....
ఎదురొచ్చి బుగ్గ గిల్లి
 చిటికేసెనే మామ....
ఎరుపెక్కిన బుగ్గతో
మూతి బిగువు జతచేస్తే..
పకా పకా నవ్విండు మామ
ఆ నవ్వుల పువ్వులన్ని
ఏరుకొని మాల కడుతుంటే..
మాయమై..పొయిండు మామ
రెప్పలార్పు కళ్ళేమో
కొలనులే అయ్యాయి...
దిక్కులన్ని దిగులుగా
ఎటో ఎటో...సూ స్తున్నాయి...మామ 
అలల మీద చేపలన్నీ
అటు ఇటు పరిగెడుతూ...
కొంటె నవ్వుల
గాలమే ఏస్తుంటే.మామ...
ఎకసెక్కాలకు
కాలమిది కాదని...
కాళ్ళతో తపా తపా కొట్టాను..
నీళ్ళన్నీ ఎగిరి పడి
ఒళ్లంతా తడిపేసే.మామ ...
ఒరుసుకొని గుడ్డలన్నీ
అందాలన్నీ ...ఆరబోసేనే..మామ....
బంతిపూవు తీసుకొని..మామ ...
బేగి బేగి నొచ్చేసిమామ.....
జడన తురిమి మామ...
ముద్దిచ్చి ముచ్చట చేసే...మామా...!
ఓడిన చేరి ఊసులాడు కుంటూ మామ..
కాలమే  మరచినాము మామ..
ఓ చందమామ...ఓ ఓ చందమామ..


7, మార్చి 2016, సోమవారం

ఈ క్షణం ఇలా...
ఒక్క క్షణం...ఒకే ఒక్క క్షణం
అమ్మ చెప్పిన మాట విని ఉంటె...
ఈ క్షణంలో ఇలా ఉండకపోదును కదా!!
అశల సౌధాలను అవలీలగా నిర్మించుకుంటూ
సాగుతున్న నేను...నీ చూపుల
సంకెళ్ళ లో బందినే,,, అయ్యాను
నీ మాటల మర్మంలోని మధువును త్రాగి
మైకంలో నన్ను నేను మరిచాను...
మత్తు వదిలించుకొని చూసుకుంటే.....
అన్నీ కోల్పోయి మిగిలున్నాను..చరించే శవాన్నై....
ఈ చీకటి నన్ను కాల్చేసినా
బాగుండును...
ఈ నిశబ్ధం నన్ను మింగేసినా
బాగుండును...
ఈ ఒంటరితనం నన్ను కబళించినా
బాగుండును...
"ఉరకలేసే యవ్వనం
విష నాగై కాటేస్తుంది...జాగ్రత్త తల్లీ ..!!"
అని అమ్మ చెప్పిన మాట
ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం
అలోచించి ఉంటె....
ఈ క్షణం ఇలా....!!
పంట....
ప్రేమ అనే పంట పండించాలంటే....
సారవంతమయిన నేల కావాలి
నేల పొరల్లో ఎక్కడో 
నాటుకున్న " ప్రేమ " విత్తనం
బయాల బురదలని తప్పించుకుని
మొలకెత్తాలి....
మొలకెత్తగానే సరిపోతుందా...మరి.....
చిగురుల మాటలతో.....
చిలిపి పూవుల చూపులతో...
ఎదుటివారికి తన " ప్రేమ " ని
వ్యక్త పరచచాలి....
అప్పుడే పరపరాగ సంపర్గం కలిగి
" ప్రేమ" అనే పంట పండుతుంది...
వ్యక్త పరచని " ప్రేమ "
గుండెలో సమాధి అయి
దానిపై ముళ్ళ కంచెలు మొలిచి
పదే...పదే....
గుచ్చుకుంటూ ఉంటాయి.... జీవితాంతం....

5, మార్చి 2016, శనివారం

లక్ష్మి నరసింహ...!!
ఓం నమో నారాయణాయ...!!ప్రహల్లాదుని నామ జపంతో...
ప్రీతి నొందిన మహానుభావా...నరనారాయణ రూపివై
దుష్ట శిక్షణ గావించుటకు...వెంచేసినావయ్యా...నమో..నరసింహ...!!
ఏడి దేవుడన్న హిరణ్యాక్షునకు స్తంభమును పెగుల్చుకొని...
అతని చెరపట్టినావే...బ్రహ్మ వరమును వ్యర్ధము చేయక...
గడప పై కూర్చుండి చీల్చి చెండాడినావే...పసివాని గాచి....!!
యాదగిరిన నరసింహుడవై ...సింహచాలమున అప్పన్నవై..
మంగళ గిరిన పానకాల స్వామి వై....భక్తుల బ్రోచేవు....
అడుగడుగునా..దండాలు పెట్టించుకుంటూ...ఆపదల తిర్చేవు...
చెంచులక్ష్మి చెంత సేద తీరిన ....లక్ష్మి నరసింహా...నమో..నమో..నమః!!
అనాధవు కావని....
నరకంలో సైతం...
చేసిన తప్పుకే ...
శిక్షఉంటుందట...
మరి నేనేం తప్పు చేసానో...!
అమ్మ కుప్పతోట్టిలో
పడేసింది....!!
" నాన్న " అంటే..
ఏమిటో..కుడా తెలియదు...
ఎక్కడో..ఎవరో..పరేసినది
తింటూ...
గాలికి తిరిగేనాకు
ఈ గాలి బుడగలే..
తోడయ్యాయి...
అమాయకంగా ఆడుకుంటూ
అల్లరిచేసే పిల్లలకు
ఎగసిపడుతూ ...
సమాదానమిచ్చే అలలు
నాకు మాత్రం
జీవిత పాఠాన్ని నేర్పుతున్నాయి..
నిరంతరం శ్రమించటమే లక్ష్యంగా
సాగిపొమ్మని...
ప్రకృతమ్మ ఒడి ఉండగా
నీవు అనాధవు కావని...!!!

3, మార్చి 2016, గురువారం

బుద్దుడై.....

ఆశ నిరాశలు...సుఖ దుఃఖాల జీవిత ఫలమేమి..అని హరహారము...
ఆలోచనల మధింపు లో...అన్యమనస్కుడై సంచరించే సిద్దార్దునకు....
ఎదురొచ్చిన శవ ఊరేగింపు సమాదానం కాగా....మనసు చలించి..
రాజ్యదికారాలను....అనుభందాలను ..వదులుకొని....సన్యసించే....
భోధి వృక్షము నీడ...నిచ్చి ...జ్ఞాన సంపాదనకు మార్గము బోదించే..
దశావతారాలలో తొమ్మిదవ అవతారమై...భాసిల్లినాడు
అహింస..సత్యము....ధర్మము ....వట్టి మాటలు కావని..
మాననీయ విలువలను కాపాడుకొనుటకు రహదారులని..
ప్రతి మనిషి....వాటికి కట్టుబడి ...మెలగాలని...అడుగడునునా ..
ఆత్మ దర్శనం చేయిస్తూ....బుద్దుడై...విశ్వ శాంతికి కారకుడైయ్యాడు!!
హరి విల్లె...
ఏడు రంగులు ఏక చాపమై...
నింగిలోన దరిశనమిస్తుంది...
నేలతల్లిని పాదాలను ప్రేమమీరా ముద్దాడుతున్నట్టు..
రంగులు రకరకాలైనా...ఒక్కటిగా కలిసి ఉంటే
కప్పేసిన దట్టమయిన మబ్బుల నుండి
చొచ్చుకొని వచ్చిన సూర్యకిరణాలలోనూ..
చిరు చిరు చినుకుల చిలిపి అల్లరిలోనూ...
ఒదిగిపోయి తానే చెప్పకనే చెపుతుంది..
'కుల, మత, జాతి, పేద, ధనిక, భాష, దేశాల
భేదాలు మరచి ..స్నేహభావంతో మెలుగుతూ...
సమసమాజ స్థాపనలో జీవితాలని వెలిగించే..
ఇంధ్రధనువై నీవే కనువిందు చేయగలవని'...
చిట్టి పొట్టి చిన్నారుల అమాయకపు
కనుల విస్మయమై ఓలలాడుతూ..
కన్నె మనసుల కలల సౌధాన్ని
ఆకాశమార్గాన విహరింపజేస్తూ..
దుక్కి దున్ని పంటలు పండించు రైతన్న
తొలకరికై ఎడారికన్నుల ఎదురుచూపులకు
ఆశల పూలు పూయిస్తూ...
నిలిచి ఉంటుంది...సంబరాల సంతోషాల హరివిల్లై!