24, ఫిబ్రవరి 2014, సోమవారం

భాస్కరా....

రాత్రి పగళ్ళ రాట్నం తిప్పుతూ...
ఏడు గుఱ్ఱాల రధమెక్కి...
నిరంతరం సాగిపోయే..భాస్కరా!!...
నమోనమః!!

చీకటివెనుక ...వెలుగుకు...
ప్రాణంపోసే పరాత్పరుడవు...
పచ్చని ప్రకృతి కన్యకు
వెచ్చని కౌగిలి నిచ్చే ప్రేమికుడవు....

నీ గమనాలని ఉద్దేశిస్తూ
పరిబ్రమించే నవగ్రహాలు ...
గ్రహాల అనుసందానంతో
జీవించే మనుషుల సోపానాలు..

ముల్లోకాలకు
మూలాదారం నీవే.......
సకల చరాచర సృష్టి కి
ఆదిత్యుడివి.. నీవే...

కాలాలకు కారణం
నీ కదలికలే..
ఆరోగ్య ప్రదాయకాలు
నీ తొలి కిరణాలే....

హిమమెంత కురిసినా....
రేయంత వగచినా....
ఆగని నీరాక
మాకానంద దాయకమే...

చివరికి శ్రీవారికి సైతం
ఎదురుచుపులే...
సుప్రభాత సేవకు
నీ ..ఉదయ సంధ్య ఊసుల
మేలుకొలుపులకై...!!
గోదావరి ఒడ్డున అడుక్కుంటున్న పిల్లల చూసి...కంటి చెమ్మతో...

ఎందుకమ్మ గోదారి....!!

ఎందుకమ్మ! గోదారి...!!...
ఈ అవాంతర రాక..
అంతర్వేదిన సముద్రుడు
ఆగమన్నాడా..
నా హృదయసంద్రంలొ చేరినావు
ఉప్పొంగి వెల్లువై...
కనురెప్పల కట్టలే తెంచినావు..
ఎందుకమ్మ గోదారి...!!

ఆడపిల్లనని అలుసుజేసి
అయ్య నన్ను అమ్మజూపెనే...
అది భరించలేక అమ్మ
ఆయువే తీర్చుకొనె...
అనాధనై..
నీవిడిచిన తడి ఇసుకల
ఒడిజేరితిని...
నీ తరగల జోలలలొ..
సాంత్వనే పొందితిని
అడవి కాయలమ్ముకుంటూ
ఆకలే తీర్చుకొంటిని..
ఎందుకమ్మ గోదారీ...!!

నావ నడుపు ఈసుగాడు
ఆబగాజూస్తుంటే..
అది.."ఆరాధనే " అనుకొంటినీ..
ఎఱ్ఱబడ్డ అతని కనులజూసి
" ప్రేమే " నేమో అని బ్రమసితినీ..
నీ నీటిమీద తేలుతూ
నావలో ఊగితిని..
పున్నమి చంద్రుని సాక్షిగా..
వెన్నెల తాళి కట్టి
బాహువుల బందించినాడే..
మాయ పొరల మైకమే కమ్మెనే...
ఎందుకమ్మ గోదారీ....!!

లేత కిరణాలు
వెచ్చగా తగులగా..
తేరుకొని చూసుకుంటే...
ఒంటరినై..పడిఉన్నా..
ఇన్నాళ్ళూ దాచుకున్న

కన్నెతనమంతా దోచుకొని
దొంగలా జారుకున్నడే..
ఈసుగాడు...!!
నావలేని తెడ్డు బ్రతుకైనదని
ఇక తెలుసుకున్నా..
ఎంద్కుకమ్మ గోదారి..!!

పులకరింతలు
వేవిళ్ళుగా మారినాయి..
ఉమ్మనీటిలో
ఊపిరేపోసుకుంది మరోజీవి...
అమ్మనవుతున్నానని ఆనందమా..
వద్దనుకున్నా ఆగనిది
ఈ అనుభందము...
బొసినవ్వుల ఒడిచేరినదీ
ముద్దులు మూటకట్టే అమాయకత్వం..
గోదారమ్మ ఒడిన
పుట్టిన మరో గోదారే కధా!
నా పిల్ల పేరు " గోదావరి " కధా..!
ఎందుకమ్మ గోదారీ...!!

పడవలోన పనికి కుదిరి
పనిపాటలుజేస్తున్నా..
పాపతో ..పాటలే పాడుకుంటూ..
పసితనమే..నాదైనట్టు..

పట్నం సారులు నలుగురు
పడవేక్కి మందు కొట్టినారు
పాలు తాపుతున్న అమ్మతనాన్ని
పాశవికంగా ఛెరిచినారు
రక్తసిక్తమైన దేహంతో..
గుక్క పట్టిన గుండెతో..
గోదారమ్మా...!!
నీ ఒడిలో..
ఒదిగిపొదామనీ...నేనొస్తే...
నీ......
ఈ అవాంతర రాక
ఎందుకమ్మా...!! గోదారమ్మా!!
రామ చిలుకా....

అలుకలేలనే...అల్లారు ముద్దు రామ చిలుకా...
పంచెవన్నెల పడుచుదనం చూసి...కపట ప్రేమలు చూపి..
లయలు హొయలు దోచుకొని ..నిన్నోంటరినిచేసి.. పంజరాన ఒదిలేసి ...
దారివేతుక్కుంటూ...వేల్లిపోయేనా..నీ జతగాడు....

దిగులు పడకు రామచిలుక...నా గుండె గూటిలో...పోదువుకుంటా..
మాటలెన్నో నేర్పుతా ...నీ మాటలే వేదవాక్కని చాటుతా..
మనిషిలో లేని మమతను...నీలో చూసుకుంటూ...
నా ప్రాణానికి ప్రాణంలా నిను కాపాడుకుంటా...!!
చల్ చల్ గుర్రం....

చల్ చల్ గుర్రం అంటూ..
నాన్న మీద ఎక్కి ఆడిన జ్ఞాపకం...
నిన్ను చూస్తుంటే......
ఎదలో...తన్నుకొస్తుంది...

కన్నేతనంకన్న కలలో...
రాకుమారుడిని మోసుకొచ్చిన వైనం
కనుల మెదులుతుంది...

కోర్కెలు గుర్రాలంటారు...
పగ్గాలు లేని గుర్రాలకి మల్లె పరుగులు తీసి..
నిస్పృహల చిక్కి నిర్జీవమవుతాయి...

ధవళ కాంతుల అశ్వరాజమా !
పలు విదాలుగా ఆలోచన రేపే..
పరుష తురగమా...!!
నీ రాజసం అసామాన్యం..
నిను వర్ణింప ఎవరి తరం...!!
అన్నదాతలు....

నీటి చుక్క కరువై...గ్రాసం దొరకక
జోడెడ్లు నీరసించి మూలబడ్డాయి...
అయినా ఆపదలో..ఎప్పుడు ఆమె ఆదిశక్తే......
అని నిరూపించే...గ్రామీణ మహిళలు సైతం...
నాగలి చెరో భుజాలకెత్తుకొని...
జీవన పల్లకీకి బోయిలే అయ్యారు...
ఎండని లెక్కచేయక ...కమ్ముకునే మబ్బులకేసి
ఆశగా చూస్తూ....బక్కచిక్కిన దేహాలయినా...
వీడని మనస్థైర్యం తో ముందుకు సాగు వారు...!!
వారే మన అన్నదాతలు....అన్నపూర్ణలు ....!!