28, డిసెంబర్ 2016, బుధవారం

గోదాదేవి"
అనురాగము..ప్రేమ...భక్తి..
కలయికల రూపమే..గోదాదేవి..
కృష్ణనామ శబ్దాన్ని శ్వాసించటమే 
జీవితమని ఎంచుకొన్నభూదేవి.
.తననితాను పసిపాపగా మలచుకొని..
తులసీవనాన పురిటికందుగా.అగుపించి..
.పొత్తిళ్ళతో..విష్ణుచిత్తుని..
ఒడి చేరింది...తల్లి భూమాత....
తండ్రిఅయి ఆమెను..
గుండెల్లోపెట్టుకు పెంచుకున్నాడాయన..
కోవెలలో జరుగు శ్రీకృష్ణుని
అర్చనాభిషేకాలకు...
తోటలోని ప్రతిచెట్టును అడిగి అడిగి మరి..
కోసి తెచ్చుకున్న అన్నివర్ణముల పూలను..
శ్రద్దాభక్తులతో...అతిసుందరమైన మాలలల్లి..
ముకుందునికి అలంకరించాలనుకొని..
"క్రితం జన్మలో సత్యభామను నేనే..
నా విభుడు ఈ మాధవుడే కదూ..!"
అని తలచుకొనుచు...పరవశముతో..స్వామి సన్నిధిలో
ఉన్నాననుకుంటూ..ఆ మాలలను తనే
సింగారించి.. మురుస్తూ..చప్పున తప్పుతెలుసుకొని
ఏమెరుగక ప్రీతిగా స్వామికి సమర్పించేది..గోదాదేవి...
ఆమె ఆంతర్యం గ్రహించిన గోవిందుడు..
ఆమెచేయందుకొని కల్యాణమాడి....
తనలో ఐక్యం చేసుకున్నాడు..
ముప్పైపాశురాలనిచ్చి స్వామినిచేరు దారి చూపిందీతల్లి..!

15, డిసెంబర్ 2016, గురువారం

దాచు కున్న నిధులలో దొరికిన...ఓపాట...సరదాగా...
ఉంగరాల జుట్టున్న
చిన్నవాడా..
నిన్ను చూస్తుంటే..
నా మనసు
ఆగనంటుంది ఓరయ్యో..
చక్కనైన మోమున్నా..
చిన్నదానా...
నిన్ను చూస్తుంటే...
నా వయసు
అల్లరి చేస్తుంది ఓలమ్మీ..
అద్దాల రైక
బిగ కట్టి..
పైట చెంగు
ముడి పెట్టి..
చీర కుచ్చిళ్ళు
ఎగదోపి..
చేత వరినారు
పట్టుకొని..
నాట్లు ఏస్తుంటే...
ఓలమ్మీ...
నడుము ఓంపులోన..
నా చూపు ..
గిలా గిలా లాడింది...ఓలమ్మీ...//ఉంగ //
అడ్డ పంచె
కట్టినావు..
ఆచ్చాదన లేని
జబ్బలతో...
చురకత్తుల
చూపులతో.
చర్నాకోల
జడిపిస్తూ..
జోడెడ్ల బండి నువ్వు
తోలుతుంటే...
ఎగసిపడు నీ
మగసిరికి చిక్కి
నా గుండె...
విలా విలా లాడింది...ఓరయ్యో..//చక్కనైన //
ఎంకిలా గున్నావు..
ఎదుట ఉండి
దగ్గర రాక
ఏడిపిస్తున్నావు...
నాయుడు బావ నీవైతే..
నిజాము కాద ఈ ఎంకి..
ప్రేమ జాతరలే చూసుకుంటూ..
పరువాలపండగలే చేసుకొందము....//ఉంగ//


చెలీ...!!
కలలను దాచిన నీ కనులు..
నా చూపుల కౌగిలిలొ...
ఒదిగిపొయాయి..
రెక్కలొచ్చిన నా మనసు విహంగమై..
నీ గుండె గూటికి చేరెంది..
మౌనించిన నీ హృదయ పుష్పపరాగం
నీ శ్వాసల ద్వారా పయనిస్తూ.
నను చుట్టేసి మరీ చెపుతుంది..
నా సమక్షం నీకు శాశ్వతం కావాలని..
నీ ప్రాణాల ప్రమిదను
వెలిగించు కున్నావనీ...చెలీ...
పరిచయాలు ప్రణవమై..
పెనవేసుకున్నవి పల్లవిగా..
సంపూర్తి యుగళ గీతము చేసి...
ప్రేమికుల పెదవుల
చిరస్తాయి....పదములవుదాము..చెలీ..!!
ujatha Thimmana(ద్వితీయం) ఓ స్త్రీ మూర్తి..!
త్రిమూర్తులను సైతం చిన్ని పాపలుగా మార్చి....
తన ఒడిలో ఊయల లూపిన
అనసూయ మహాసాధ్వి..ఓ స్త్రీ మూర్తి..!
ఆలుమగల అనురాగానికి భాష్యం చెపుతూ...
తన తనువులోని ప్రతి...అణువు అణువులో
రామ తత్వాన్ని నింపుకున్న సీత ఓ స్త్రీ మూర్తి..!
ఏడుగురు సవతులతో పాటు..
పదహారువేల గోపెమ్మలతో..కృష్ణుని పంచుకున్నా..
ఒక్క తులసీ దళంతో భర్తను గెలుచుకున్న రుక్మిణి..ఓ స్త్రీ మూర్తి...!
అసత్యమాడని హరిచ్చంద్రుని మాట నిలుపుటకు...
తనని తాను అంగడి సరుకుగా మలచుకొని...
మగని విలువ కాపాడిన చంద్రమతి ఓ స్త్రీ మూర్తి...!
అల్పాయుష్కుడైన సత్యవంతుని ప్రాణాలను
తీసుకు వెళుతున్న యమధర్మరాజును వెంబడించి...
ఎదురు నిలిచి పోరాడి మాంగళ్యాన్ని పొందిన సావిత్రి ...ఓ స్త్రీమూర్తి..!
బానిసత్వపు కోరల్లో చిక్కిన భారతదేశాన్ని...
తెల్లదొరల అధికార..అహంకారాలకు బలవుతున్నప్రజల
రక్షించుటకు రణరంగాన కదం త్రొక్కిన ఝాన్సీ రాణి...ఓ స్త్రీ మూర్తి..!
రణరంగమయినా రాజకీయమయినా ఒకచేత్తో పట్టం కడుతూ..చావు
నెదిరించి బిడ్డను కని.స్థన్యమిచ్చి పోషించే ఆత్మీయ.. ఓ స్త్రీ మూర్తి!


*****ఎవరో..ఎవరో...******
నిన్న రాతిరి కలలో...కనిపించెనే...
తెల్లని గుఱ్ఱముపై స్వారి చేస్తూ..
మేఘాల దారిలో..మేను విరుస్తూ..
ఎవరో...ఎవరో....ఆతను వెన్నెల రేడు..
కల అనుకుంటే ...ఏదో కలవరము..
కాదనుకుంటే....నిజమవ్వాలని..
ఏవో ఆశల ఆరాటము...
వేకువలోనా...వెన్నెల కురిసేనేమిటో...
కురులలో చేరి..విరిసిన విరులకు ..
ఆపని ఈ గుసగుసలెందుకో..
పులకరింతల తనువుకు..ఈ పరవశమేమిటో...
ఎదలో చిత్రించుకున్న ఆ అస్పష్టరూపం
కన్నుల ముందు నిలిచేదెన్నడో...
సంగర్షణల మది ఊయల ఊగుతున్నదేమిటో...
పోగవుతున్నవి..క్షణాల గుట్టలని...
మోయలేక పరువాలబరువును..
చెంత చేరే చెలునికి ఆసాంతము సొంతంచేయాలని...
పంటిబిగువున పలకరింపులను దాచి..
విరహిణి అయి వేచియున్నదా..లలనామణి..
అలంకారాలను తోడు చేసుకొని..!!

14, డిసెంబర్ 2016, బుధవారం



మన తెలుగు మన సంస్కృతీ గ్రూప్ లో చిత్ర కవిత పోటిలో...
మొలకే కదూ...
ఊడలు కట్టిన మహా వృక్షమైనా..
చిన్న మొక్క అయినా...
తీగలుగా ఎగబ్రాకే చెట్టయినా..
మొలకగానే మొదలవుతుంది..
భూమాత గర్బంలో చేరింది మొదలు..
నీటి తడి తగిలితే చాలు...గింజనానుతూ..
రెండుగా చీలి తనలోనే అంకురానికి జన్మ నిస్తుంది..
జీవం నింపుకున్న ఆ ప్రాణం మట్టిని చేజించుకుని...
మొలకై...ప్రపంచాన్ని చూస్తుంది...
తన జాతి లక్షణాలను బట్టి....ఎదుగుతుంది..
శతాబ్దాల వరకు నిలిచి ఉండే వృక్షమై..
ముదురమైన ఫలాలను...కూరగాయలను...
ధాన్యాలను...రంగు రంగుల పూవులను ఇస్తూ..
ఒకటేమిటి..విశ్వాన్ని వింత లోకంలో
మెరిపించటానికి....ప్రకృతమ్మకి పుట్టింటి
అలంకారమై..నిలచే ప్రతి చెట్టు .ప్రతి గడ్డిపరక..
చిన్ని మొలకగా.... అవిర్బవించేదే...
మనుషులకు..జంతువులకు..
ఇతర కనిపించి..కనిపించని ప్రాణులకు సైతం..
ఆహారం అందించే అన్నపూర్ణ అంశ ..మొలకే కదూ..!!


నివాళు లిస్తాయి...
ఆ కొమ్మకి...ఈ కొమ్మకి...ఏ కొమ్మకి
పూసిన పూవులో..రంగు రంగుల పూవులు..
రక రకాల పూవులు ..అన్ని ఒకచోట చేరి..
స్నేహానికి మారుపేరుగా ఒకే దారంలో ఒదిగి..
మాలగా రూపుదిద్దు కుంటాయి..
పరిమాళాలని ఇచ్చేవి కొన్ని పూవులయితే...
అందాలను ఆరబోస్తాయి మరికొన్ని పూవులు.
.ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నవో..
మరువం ..ధవనం తో కలిపి కుట్టిన పూలమాలలు
అలంకార ప్రియమయినా...దేవునికి అవి
సమర్పిస్తాయి ఆత్మనివేదనలు...
జాతి..మత..కుల..భేదాలు లేవు..
ధనిక పేద తారతమ్యాలు తెలియవు...
చేపట్టిన వారిగుండె నిండుగా సంతోషాన్ని ఇస్తూ..
పున్నమి చంద్రుని చల్లదనం తమలో దాచుకొని
వెన్మలలు మనకు పంచుతాయి.పూలమాలలు ..
వాలుజడతో పోటి పడుతూ పూల మాలలు ఉడుక్కుంటుంటే ...
వివాహంలో పూలమాలలు వధూ వరులను ఒకటి చేస్తాయి..
పండుగలలో గుమ్మాలకి వేళ్ళాడే పూలమాలలు..
శుభసంకేతాల శాంతిని అందిస్తాయి..చివరికి..
శరీరం వదిలి..పఠంలో నిలచినా..పూలమాలై వేళ్ళాడి నివాళులిస్తాయి.!!
చినుకు..చినుకులలో....
ధాచుకోలేని తమకంతో మేఘుడు
వలపు చినుకులను చిట పట కురిపిస్తూ ఉంటె..
మందస్మిత ..మృదుమనోహరి ....సుందరి ..
అపస్మిత అయి..చినుకుల కడ్డుగా ఛత్రం చేపట్టినా..
కొండల వాలునుండి కొంటె గాలి ..
దూసుకుంటూ వచ్చేసి...ఛత్రాన్ని లాగేసుకుంటూ..
తడిసిన వయ్యారాలను ఆసాంతం చుట్టేసింది.. .
కేరింతలతో కొలనులోని చాపపిల్లలు
ఎగిరి ఎగిరి పడుతున్నాయి....
వాటి అల్లరితో జత కలుపుతూ..
కన్నె మనసు జతగాని తలపుల
మైమరపులలో ..ఓపలేని ఒంటరి అయి...
అతని ఎద చేరి ..సేదతీర ఉవ్విళ్ళు ఊరుచున్నది..
ఆకాశాన్ని సాక్షిగా తెచ్చుకొని మేఘుడు..
చినుకు సూత్రం కట్టి తనదాన్ని చేసుకున్నాడే..
చిన్నదాన్ని వలచిన వాని వలపు...
వాకిట ఇక నిలవని నీటిగీతల రాతలేనా...
వొంపులను వెచ్చగా తాకుతున్న వలువలను
ఈర్ష్య తో...చూపుల శరముల పోరాటాలేనా...!!


(ఓ జ్ఞాపకాల ట్రంకు పెట్టెలో దొరికిన అరుదైన చిత్రం )
కొడుకునై పుట్టలేదు నాన్నా!
నీకు కడసారయినా వీడ్కోలు తెలిపేందుకు
అర్హత లేనిదాననైతినే...
అనురాగం పంచి నన్ను అలరించావే
ఆత్మీయతకూ అర్థమే నీవైతివే
కనురెప్పలు సైతం
నిదురించే సమయంలోఅవి నిదురిస్తాయి
నీ కనుపాపలలోనే నను నిలుపుకొని
అనుక్షణం గుండెల్లో దాచుకొని కాపాడుకుంటివే
తీర్చుకోలేని రుణంతో
శిరసు వంచి నమస్కరిస్తున్నా
నీవేలోకాలనున్నా.....
నీ ఆత్మ శాంతికై నా
హృదయకుసుమాన్ని సమర్పిస్తూ...
చెమరించిన కనులతో
శిరసు వంచి నమస్కరిస్తున్నా నాన్నా...!
మీ పాపగా శ్వాసిస్తూ...
(అప్పుడే దశాబ్దం 10 సంవత్సరాలు గడిచి పోయాయి...అశ్రు నివాళు లతో...)


నన్ను వీడని నా నేస్తం .....ఎంత అపురూపమో .)..
**కన్నీటి చుక్క....****
మేఘమధనం లోనుంచి..
వాన చినుకు పుడుతుంది..
హృదయమధనం లో.....
పురుడు పోసుకుంటుంది కన్నీటి చుక్క..!
ఎదలోపలి స్పందనలని తనలో దాచుకొని..
'నీరు పల్లమెరుగు ' అన్న నానుడికి విరుద్దంగా..
పైకి ఎగబ్రాకుతూ...అడ్డువచ్చే ఆలోచనలకోస్తూ..
కనురెప్పల కట్టలను అధిమి పెడుతూ...
చెంపల పైకి ధుముకుతుంది కన్నీటి చుక్క..!
ధనికులని...పేదవారని తేడాలు లేవు..
ఆడవారు..మగవారు అని గాని..
వయసులో చిన్నవారు అని..పెద్దవారని గాని..
బేదాలు ఎరుగని ...స్వచ్చమయిన ముత్యమే ...కన్నీటి చుక్క !
అమ్మ ప్రేమలోని అమృతానికి...
నాన్న వాత్సల్యపు మమకారాలకి ..
తోడబుట్టినవారి అనుబందపు సుగంధాల ఆస్వాదనలకు
జీవితం పంచుకున్నవారి అనురాగపు అలింగనాలకు
మాటలకందని భాష్యం చెపుతుంది ..కన్నీటి చుక్క..!
ఆనందాల ఆరాటాలకు..అవధులు లేవనిపిస్తుంది..
నైరాశ్యం ఆవరించిన వేళ ..నేనున్నాని తోడునిలుస్తుంది..
శూన్యపు చూపులకడ్డు నిలిచి..గమ్యాన్ని వెతికిస్తుంది..
మనలో మనకే తెలియని మరో మనసు ఉన్న
కనిపించని నేస్తం తానై మనలోనే... ఉండేదే కన్నీటి చుక్క ..!
పుట్టగానే కేరుకేరుమని..తానేడుస్తూ రాలుతుంది....
చితిపై చేరినపుడు ..తనవారిని చేరి ఏడిపిస్తుంది..కన్నీటి చుక్క..!!
*బడా కార్మికులు *******
నెల తప్పిన మరుక్షణంలోనే ...
మంచి స్కూల్ లో సీటుకై రిజర్వేషన్ ..
చేయించాలనే ఆరాటం కాబోయే తల్లితండ్రులది..
ఒకటికి ..రెండుకు ఎలా వెళ్ళాలో కూడా తెలియని పసితనాన్ని ....
డైపర్తో గాలాడనీయక బందించి ..అమ్మా నాన్నకి బదులు..
ఎబిసిడి నేర్చుకో .అంటూ..ప్లే స్చూల్ లో కూర్చో పెట్టే...
బలవంతపు 'అ'రాచరికం తల్లితండ్రులది..
గులాబి చెక్కిళ్ళు ఎర్రబడుతుంటే...
నిద్ర చాలని చిలికి కళ్ళు వాలిపోతుంటే...
పెదవంచున చొల్లు చుక్కలుగా కారుతుంటే..
కుర్చీలో కూర్చొని ఊగుతూ.జోగుతూ...ఊ అంటూ ఉండే..పసివాళ్ళు ..
తాతాబామ్మ చేతుల్లో గారాలు పోవలసిన వాళ్ళు..
అప్యాయతలు కరువై...అనాగరికం పెరిగి..
చదువుల పేరిట జరిగే స్కాముల్లో ఇరుక్కొని..
తమ ఉనికిని కోల్పోయి ..నిస్సహాయులై...
భావి భారతం ఏమో గాని..దిన దిన గండం లా..
బ్రతుకు భారమని తలపిస్తున్నారీ పసివాళ్ళు..
కూలి పనులు చేస్తూ.....డబ్బు సంపాదిస్తారు 'బాల' కార్మికులు.
బండెడు పుస్తకాలని వెన్ను వంగేల మోస్తూ...
చదువు అనుకుంటున్నదాన్ని కొంటున్నా రీ 'బడా' కార్మికులు.!!

వెలుగుతున్న ఆ
దిపమెంత చిన్నబోయిందో...చూడు...!!
నీ ఎదురుచూపులకు
సెలవు చెప్పమన్న...
నన్ను చూసిన ఈ క్షణాన...
నీ పెదవులపై విరిసిన
ఆ నెలవంక
కోటి పున్నముల
చల్లదనాన్నిస్తున్నదే...సఖీ!!
వేల వేల ...
విరహాల అనంతం
నీ బాహువుల
బందీనవ్వాలనే..నా
ఆకాంక్షను...
సఫలీకృతం చేసుకోనీయవే..
.మృదుహాసినీ....!!
*****నేటి బాల్యం ...******
బ్రతుకు అంటే తెలియనిది..
బంధాలను పెనవేసుకున్న ..
చిగురుటాకుల చిరునగవులది బాల్యం..
సత్యా అసత్యాలకు తేడా ఎరుగక
అమ్మా నాన్నల అడుగుజాడలలో
తమ అడుగులు కలుపుతూ నడక నేర్చేదే బాల్యం..
ఆకతాయి తనంలోను అమాయకత్వం
చేయి చేయి కలుపుకునే సహవాసం ..
అరమరికలు లేక కలిసిపోయే తనమే బాల్యం ...
ఆటల్లో ..పాటల్లో ..ఆహ్లాదమయ జీవితం
గిడిచిన కాలంతో పాటు కరిగిపోతూ..
స్మృతిలో మధురంగా నిలిచి ఉండేదే బాల్యం..
తరాలు మారుతున్న వైనంలో
తల్లితండ్రుల స్థితి గతుల మార్పులలో
నాలుగు గోడలకు బందీ అయి ...
చదువుల పేరిట బరువులు తలలో మోస్తూ..
వాలుతున్న రెప్పలను నిద్రమ్మ ఒడిని చేర్చి..
కాగితాలలో కలలకు లేఖలు వ్రాస్తుంది ..
ఈ నాటి తరం పిల్లలకు లభించిన బాల్యం..!!