9, మే 2015, శనివారం


శూన్యం


చేరలేని చూపుల కావలనున్నా..
మనసుపొరలలో చిక్కుకొని..
వేదనల భారాన్ని మోస్తూ.....
క్షణాలని తనలోనికి జార్చేసుకుంటూ..
సమస్తం తానేఅయి వ్యాపించి....
స్పర్శనెరుగనీయక కమ్మేస్తుంది 'శూన్యం '

'ఏమిలేదు' అన్న పదమే 'సున్న' అనుకుంటే..
'సున్న' శూన్యం అయితే..
అంతర్లీనమయిన ఆత్మని జతచేసుకుని చూసుకుంటే...
పదిరకాల సమాదానాల పదవుతుంది..'శూన్యం'

లోలోన దోబూచులాడుతూ....
ఒక్కోసారి రెచ్చగొడుతూ..
మరొక సారి మార్గం చూపిస్తూ...
ఎల్లవేళలా 'నేనున్నా'నంటూ..
వెంట వెంట ఉండే స్నేహశీలి 'శూన్యం'

తపనలలో ఆకాశమై అనంతమవుతుంది
తడి కన్నుల చెమరింపులలో..
చల్లని అమ్మతనమై..సేద తీరుస్తుంది..
సందిగ్ధావస్తలో..లక్ష్మణరేఖ అయి..
ఆపదల గాచే ఆయువు పట్టవుతుంది..'శూన్యం'



హరి విల్లె...


ఏడు రంగులు ఏక చాపమై...
నింగిలోన దరిశనమిస్తుంది...
నేలతల్లిని పాదాలను ప్రేమమీరా ముద్దాడుతున్నట్టు..
రంగులు రకరకాలైనా...ఒక్కటిగా కలిసి ఉంటే
కప్పేసిన దట్టమయిన మబ్బుల నుండి
చొచ్చుకొని వచ్చిన సూర్యకిరణాలలోనూ..
చిరు చిరు చినుకుల చిలిపి అల్లరిలోనూ...
ఒదిగిపోయి తానే చెప్పకనే చెపుతుంది..
'కుల, మత, జాతి, పేద, ధనిక, భాష, దేశాల
భేదాలు మరచి ..స్నేహభావంతో మెలుగుతూ...
సమసమాజ స్థాపనలో జీవితాలని వెలిగించే..
ఇంధ్రధనువై నీవే కనువిందు చేయగలవని'...
చిట్టి పొట్టి చిన్నారుల అమాయకపు
కనుల విస్మయమై ఓలలాడుతూ..
కన్నె మనసుల కలల సౌధాన్ని
ఆకాశమార్గాన విహరింపజేస్తూ..
దుక్కి దున్ని పంటలు పండించు రైతన్న
తొలకరికై ఎడారికన్నుల ఎదురుచూపులకు
ఆశల పూలు పూయిస్తూ...
నిలిచి ఉంటుంది...సంబరాల సంతోషాల హరివిల్లై!


హోళీ..హోళీ..!!


శిశిర ఋతువుకు వీడ్కోలు చెపుతూ...
వసంతానికి స్వాగతం పలుకుతూ....
బేదాలను మరచి..విభేదాలను విడిచి.....
ఎదలోన పూచే ఇంద్రధనుసు రంగులకు
ప్రకృతి అందించు అనేక రకాల హంగులను జతచేసి..
నవ్వుల పువ్వులను ..సరదాల సంబరాలను
ఒకరికొకరు పంచుకుంటూ..పండుగ చేసుకునేరోజే.. హోళీ...

పాల్గుణమాస పున్నమి నాటి రాత్రి..
ప్రతి మనిషిలోని స్వార్ధ పూరిత మలినాలను
ఇంటిలోని పనికిరాని ..చెదలు పట్టిన సామానులను
ఒక్క చోట కుప్ప పోసి...కామునిరూపం ఇచ్చి
వెన్నల సాక్షిగా ... దహనం చేస్తూ..
భానోదయంలో కొత్త చిగురుల కోటి ఆశలరంగులను
మమతల అత్తరులను... ఒకరికొకరు పులుముకుంటూ..
కేరింతల అల్లరుల సంబరాలను పండించే రోజే....హోళీ!
పురాణాల్లో ..రాధాకృష్ణుల ప్రణయరాగాలకావ్యమై
ప్రేమానురక్తుల పలకరింపుల ... వసంతోత్సమే ....
కాటేసే కాలనాగు కోరలలో చిక్కి ....చెదిరి పోతున్న బంధాలను
పటిష్టం చేయ ఏడాదికి ఒకమారైనా..మది తలుపులు తెరిచి
అనురాగ సుధలను రంగుల కలయికలలో రంగరించి
ఒకరికొకరు ఉల్లాసంగా సంబరాలు జరుపుకునే రోజైంది..హోళీ...!
చిట్టి పొట్టి చిన్నారుల చేతుల్లో అమాయకపు తోరణమై..
ఉరకలు వేసే వయసు చేయు సందడుల జోరులో
జారిపోయే క్షణాలరంగవల్లికలై ..
శరీరాలు సహకరించక పోయినా ..
ఉత్సాహం పొంగే మనసుతో.....
నాటి ముచ్చట్లను నెమరువేసుకుంటూ...
ఆ జ్ఞాపకాల అల్లికలో ఒద్దికై.....
తారతమ్యం మరపించి..మురిపించే మనసుల
సంబరాలను జరుపుకునే రోజే...హోళీ..!
ఆనాటినుంచి..ఈనాటివరకు..మరి ఏనాటికీ..
పండుగ ఎప్పుడు సరసమైనదే కావాలి గానీ ..
అపశ్రుతుల తీగెలను కదిలించే పెనుగాలి కాకూడదు..
నేలతల్లి అందించు మొక్కల సహజ రంగుల దీవెనలతో..
రసాయనాల విషాలను తరుముతూ..జరుపుకుందాం సంబరంగా హోళీ.. !

దైవము నీవని నమ్మితిని...
నీ చరణములనే చేరితిని..
శరణము కోరి వేడితిని..
అభయమునీయమని కోరితిని..
బాబా...సాయి బాబా...బాబా సాయి బాబా...
...
షిరిడి సాయి...
ఆశ్రిత జన రక్షక సాయి...
అల్లా మాలిక్ అంటూనే...
పరమాత్మ తత్వము చూపేదవోయి..
బాబా సాయి బాబా..బాబా..సాయి బాబా..


అనుక్షణము నీ స్మరణల జీవము
సధాసాగనీ..ఇలలో సౌఖ్యము..
సమస్యల దాటించే నీ సమాధానము..
నీ సుక్తుల సారమై ..చివరికి నిలవనీ .ఈ ప్రాణము
బాబా...సాయి బాబా...బాబా...సాయి బాబా....

కన్నులము - కలువలము**


మదిలోని భావాలను మూగభాష లోనికి అనువదించి,
చూపుల పత్రాలపై, భాషణాక్షరాలను లిఖిస్తాము,
మేము అందాల 'నయనాలము'...
...
హృదయసాగరాన ఆవేదనల సునామీలు రేగుతుంటే,
ఆ 'వేదన'నంతా కన్నీటిగా మార్చి, తోడి పోసేస్తాము,
మేము సొగసైన 'లోచనాలము'...
సకల చరాచర జగత్తునంతా తన చిన్ని నోటిలో
ఇముడ్చుకున్న చిన్నారి కన్నయ్య వోలె,
సువిశాల ప్రపంచాన్నంతా మా (కను)పాపలపై నిలిపి
సృష్టి సౌందర్యాలను, ఆత్మీయుల రూపాలను మీకు చూపే
మేము సువిశాల 'నేత్రాలము'...
అలముకున్న అంధకారాన్ని తరిమికొట్టి,
జీవన జగత్తును వెలుగుమయంగా మార్చిన జ్యోతులం,
మేము సౌందర్య 'చక్షువులము'...
ముఖకమలంలో అందంగా ఒదిగిన కలువలము,బ్రతుకు తెరువుకు బాసటగా నిలిచే ఆలంబనలము,మేము జీవం నిండిన 'దేహ దీపాలము'...
మేము కరవై, బ్రతుకు బరువైన దీనులకు మనిషివై,
మహాత్ముడవై నీ మరణానంతరం సైతం మాకు ప్రాణమివ్వు,
మరొక దేహాలయంలో మము 'దివ్వెలు'గా ప్రతిష్టించి...
.
See More

గృహిణి గా....




మ్రోగుతున్న అలారం
గొంతు నొక్కి...
'మరికొంచం సేపు ..'...
అనుకుని .కునుకు తీస్తూ..
'అమ్మో ..అయిదైపోయింది...'
జుట్టు ముడివేసుకొని...
చిర కుచ్చిళ్ళు ఎగదోపి..
వంటగది లోకి పరుగులు ..
గృహిణి గా అవి బాధ్యతల బరువులు..

పిల్లలను బడులకు
భర్తను ఆఫీసుకు..
సాగనంపే వరకు..
ఆగని ఊపిరుల ఉరుకులు..
ఆయాసం అయినా..
అన్నీ తానై..చేస్తూఉన్నా..
దొరుకుతాయిగా అప్పనంగా
'ఒసేయ్..ఏమోయ్..'అనే
బిరుదులూ....
గృహిణి గా అవి జన్మతః తెచ్చుకున్న మకుటాలు..
ఇంటి మూల మూలలా..
చీపురుకట్టతో చేయించే విన్యాసాలు..
చిందర వందరగా చెదిరిన
సామానులను సర్దుకోవడాలు..
కట్టుకున్నవాడు...కన్నవాళ్ళు
విడిచేసిన బట్టలనుతకడాలు..
అప్పటివరకు గొంతులో కాఫీ పడలేదే..
అనుకుంటూ..కమ్మని కాఫీ సేవనంతో..
పోయిన ప్రాణం తిరిగి వచ్చిన బావనలు..
ఆదరా బాదరా స్నానం..
"అయ్యో స్వామి..!
ఇంతా చేసి..నీకు మొక్కేందుకు
సమయం చిక్కటంలేదేమి.."
అనుకుంటూ...వెలిగించే దీపాలు..
గృహిణిగా ..అవి భక్తిరసాత్మ సమర్పణలు ....
స్కూలు నుంచి ఆకలాకలంటూ..
వచ్చే పిల్లలకోసం ..
ఆలోచనల తెంపరలలోనుంచి పుట్టే..
అరుదైన పదార్ధాల పిండివంటలు..
'ఆహా..అమ్మా..వావ్..!'
అంటూ వారు తింటూ ఉంటె..
సామ్రాజ్యం గెలిచినంత సంతోషాలు..
గృహిణిగా అవి..ఆత్మియతల ఆలింగనాలు..
పిల్లల పుస్తకాలలో దూరి..
హోం వర్కులతో కుస్తీ చేస్తూ..
తల నొప్పిని కూడా మరిచిపోవడాలు..
టక టక మని వచ్చిన మగని గని
గుమ్మంలో నుంచే బాగులందుకొనే ..
సేవా కార్యక్రమాలకి నాంది ప్రస్తావనలు..
రాత్రి వంటకి ఉపక్రమణ ..
ఇది వద్దు ..అది వద్దు అంటూ ఉన్నా..
మా అమ్మ..మా బుజ్జి అంటూ...
ముద్దులతో కడుపులు
నింపే..అమ్మతనాలు..
గృహిణి గా అవి..అరహరము ఆపాదించుకున్న అనురాగపు కొమ్మలు..
అటు తిప్పి ఇటు తిప్పి ..
తిన్నాననిపించి..
సింకు లోని గిన్నెలని శుభ్రం చేస్తూ..
పుట్టింటి మురిపాలను నెమరు వేసుకుంటూ..
అలసటని మరచి...
ఆనందాలని వెతుక్కుంటూ..
ఉన్నదానిలో లేమిని ఎన్నడూ చూడక..
సంతృప్తిని తాననుభవిస్తూ..
శాంతిసుగంధాలను వెదజల్లుతూ..
చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ..
చెదరని చిరునవ్వును చిందించడాలు ..
గృహిణి గా అవి..అపురూపంగా దొరికిన ఆభరణాలు ...
వలపు పూదోటల వికసించే కుసుమాలు..
అవి వేడుక చేసే.. పతికి వాడని వసంతాలై..
కరిగిన కాటుక రేఖలు..
దొరికిన కలల ప్రపంచపు వాకిళ్ళు..
గృహిణిగా అవి..ప్రతి శ్వాసలో సేవించే అమృతపు గుళికలు..!!
మా అమ్మ చేతి వంట



బ్రహ్మ తన అంశని
అమ్మలో దాచాడు......
అందుకే...బిడ్డ కడుపున
అంకురంగా నిలిచిన క్షణం నుంచి..
తన రక్త మాంసాల ఆహారంతో రూపునిస్తుంది..
ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మ నిస్తుంది..
ఒడి చేర్చుకొని...
చను బాలతో కడుపు నింపుతుంది ..
ఆరునెనల అన్నప్రాసన చేయించి...
చందమామని చూపిస్తూ..
వెన్నెల బువ్వలు ..
గోరుముద్దలు చేసి తినిపిస్తుంది...
బోసినవ్వుల్ల్లో బంగారు భవిష్యత్తుకు
పునాధులు వేయిస్తూ...
బిడ్డ ఏది ఇష్ట పడతాడో...
ఆ పదార్దమే చేయాలనే అమ్మ తాపత్రయం..
అమ్మ ప్రేమని ఆయువు చేసుకొని..
ఎదుగుతూ...అమ్మ ఏది చేసినా..
అందులోని మమతామృతాన్ని ఆస్వాధిస్తూ..
ప్రతి మనిషి ..అమ్మ ఎక్కడ ఉన్నా..మా
" అమ్మ చేతి వంట మరి మరీ ఇష్టం" అనుకుంటాడు

**స్వయంప్రకాశితాలై**




అంగవైకల్యం అని వికటించిన చూపులతో చూసే వారే
మనో వైకల్యంతో....జీవితపు చివరి అంచులు చూడలేరు..
భగవంతుని నిర్దయకు బలైనా, ... అంధత్వం.....
ఎదలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం....
అణగారనివ్వదు ఏ క్షణం..

తాము చీకటిలో ఉంటూ..చీకటిని చీల్చుకొని...
మిణుకు ..మిణుకుమని మెరుస్తూ......
వెలుగు దారి చేస్తాయి..మిణుగురు పురుగులు..
ఇతరత్రా ఏ సహాయం ఆశించకుండా...
తమ గెలుపు కోసం ..ఓటమిని ఏమాత్రం లెక్కచేయక..
కనురెప్పల మాటున సప్తవర్ణాలు కదలాడుతున్నా...
ఎదురుగా అంతా నలుపు..అయినా భారమని తలవక....
బ్రతుకు దారిలో ముళ్ళని ఏరి అవతల పారేస్తూ...
గుడ్డివారని గేలిచేసే వాళ్ళకి జవాబుగా నిలిచే
ఆత్మ స్థైర్యాన్ని గుండె నిండుగా నిలుపుకుంటారు..
వారు మిణుగురులవలె..స్వయం ప్రకాశితాలై..!

ఎన్నటికి కరగని కల


..
రతీదేవిని తలపించే ఆమెను చూసిన వేళ మదిలో మన్మధ హేల..
రమణి వయ్యారాల సిరులను దోచుకోవాలనుకునే...మరుల గోల..
రమ్యమయిన తలపులలో విహరింపజేయు విరహాగ్ని లీల..
రక్షణ కోల్పోతుందని యవ్వనం.. అలజడులపడు టేల...
రత్నాలు..మణిపూసల హారాల సింగారాలు దాగినవి ఆమె చిరునవ్వుల ..
రవి కిరణాల వలె స్పృశించు చూపులతూపుల కన్నుల..
రజిత మయమే ... ముఖారవిందపు వెన్నెల ..
రక్కసి అయి కాలం ..గడవకున్నది..క్షణం యుగమై...ఏల...
రజనీకరుని కరుణయున్నను...ఆమె హృది కరుగకున్నదేల..
రంగులమయమయిన వలపుల కలయికలతో జీవితం అవుతుంది ఎన్నటికి కరగని కల..!.
లలిత...


లలిత లావణ్య వతి అయిన మా ఇంటి ఆడబిడ్డ
లక్ష్మి కళ ఉట్టి పడుతూ...నట్టింట తిరుగాడుతుంటే..
లయ బద్దమయిన నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది.....
లక్షల కట్నం ఇచ్చి అయినా సరే...
లక్షణమయిన వరుని తేవాలని ...
లంఖణాలు చేస్తూ...మరీ వేదన చెందుతూ ఉన్నా..
లంగరు వేసినా ఆగని నావలాగా...
లక్ష్యం చేరని బ్రతుకవుతుందేమో అని దిగులు...
లంబోదరునకు అనేకానేక దండాలు పెట్టించి..
లడ్డూల నివేదన ... చేయించి...
లకారానికి తగ్గని జీతం ఉన్న అల్లుణ్ణి ఈయమని వేడుకుంటున్నా..!