17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    పెప్పర్ స్ప్రే తో...!!
    "అమ్మా ..నేను కాలేజికి వెళ్ళను...
    ఇక చదువు మానేస్తా..."
    అని ఆనాడే చెప్పిన కూతురు మాటలకి...
    ఇసుమంతైనా విలువనివ్వలేదాయె...

    కళ్ళు మూసుకు పోయిన కర్కశత్వం
    గెలుపు సాధించాలనే మూర్ఖత్వం
    పసిడి తనాన్ని భగభగలాడించింది..
    ఆడపిల్ల ఆక్రోశం ..అగాధాలలో అల్లాడుతుంది..
    తప్పెవరిదంటూ తరచి చూసుకుంటూనే ఉన్నాం..
    అయినా రోజూ జరుగుతూనే ఉన్నాయి..జరిగే ఘోరాలు..
    అమాయకత్వం వీడి...మన అమ్మాయిలంతా ...
    తమని తామే కాపాడు కోవలె...చెంత పెప్పర్ స్ప్రే తో...!!
    జ్ఞాపకాల గాధనే "
    వీధరుగు మీద ..తాత ఒడిలో కూర్చుని
    గడ్డం పట్టుకు ఆటలాడుకున్నానట..
    అది ఎద సందూకంలో భద్ర పరుచుకున్న జ్ఞాపకం.. .
    ...
    అమ్మ చేత చీపురు పుల్ల దెబ్బ తగిలిన
    ముంజేతిపై..రక్తం మరక చూసి ..జేవురించిన నాన్న
    అమ్మని కేకలేసిన వైనం..అదో...అరుదైన జ్ఞాపకం..
    అమ్మ చేతి గాజు పగిలి..తనకి తగిలిన గాయం నుంచి
    వచ్చిన రక్తం ..మరక నా చేతికంటుకుందని తెలిసి...నాన్న .
    గారాబాన్ని .చూసి మురిసిన అమ్మ.. అమృతమైన జ్ఞాపకం....
    పందాలేసుకుని తాడాటలాడుతూ..అలసిన వేళ..
    కారం అటుకులు పంచుకుని తిన్న ..కేరింతల నవ్వుల.
    పసిమనసుల మాసి పోని మధుర జ్ఞాపకం..
    వేసవి సెలవుల్లో..పెళ్ళివారమైపోయి..
    అమ్మ పెళ్ళిలోని చెక్కబొమ్మలని ..అందంగా సింగారించి
    కొబ్బరాకుల బూరల బాకాలతో..వేపచెట్టు పందిరిలో..
    పప్పు బెల్లాల..పంచ భక్ష్యాల విందులతో..
    బొమ్మల పెళ్లి చేసిన ..ఓ పెద్దరికపు జ్ఞాపకం..
    వార్ధక్యపుటంచుల నిలిచినా..పుట్టింటి గారాల పాపనే..
    తిరిగిరాని కాలానికి ..మరోజన్మెత్తి ...మురియాలని..
    బాల్యపు శ్వాసల ఊయలలూగుతున్న..జ్ఞాపకాలగాధనే....!!
    న్యాయం..
    సత్యం అనే పదానికి అర్ధ్తం తెలుసుకోలేని వ్యవస్థ..
    స్వార్ధ రాజకీయ చదరంగంలొ పావులాగా మారి..
    గంతలు కట్టుకున్న న్యాయదెవతని పూర్తిగా కబొధిని చేసింది..
    ...
    కాలాలతో పాటూ మారుతున్న చట్టాలు...
    భారతీయ సంస్కృతిని మరుగున పడేస్తూ..
    విసృలంకత్వాన్ని పెంచేస్తున్నాయి..
    దనవంతుల ఖజానాల్లొ డబ్బు మూలుగుతున్నట్టే..
    ధర్మం ...చలిజ్వరం వచ్చిన రోగిలాగా...
    కంబళి కప్పుకుని సొమ్మసిల్లి పడుకుంది..కదలక మెదలక..
    సాక్ష్యం అవసరాలకనుగుణంగా మారిపోతూ..
    పాదరసమై..జారిపోతుంది....అధికారుల హస్తాలలోనికి.
    చివరికి న్యాయం నిర్ధయయై..నిర్ధోషిని కటకటాలలోనికి నెట్టుతుంది..
    నడిరేయి ఏ జాములో...
    'నడిరేయి ఏ జాములో '
    జానకమ్మ గాత్రంలోని
    మాధుర్యాన్ని ...
    నగవుల రేడు ..
    ఏడుకొండల వాడు
    ఆసాంతం ఆస్వాధిస్తూ....
    నచ్చి మెచ్చిన శ్రీదేవిని
    ఎదపై నిలిపినాడని..
    నన్ను కానటంలేదని..
    అలుకలు పోయిన
    అలివేలు మంగకి .
    నడుమ నలిగే.
    .శ్రీవారు..
    దిక్కుతోచని స్తితిలో...
    నల్లరాయిగా మారి..
    కదలని శిల ఆయినారే...
    అయినా..
    నన్ను కొలిచే వారి
    కొంగు బంగారమేననే స్వామికి ..
    నన్ను నేనుగా
    సమర్పించు కొందుకు..
    నడిసముద్రంలాంటి ...
    ఈ బ్రతుకునుదాటలేక
    నట్టనడుమ నలిగి నలిగి..
    శ్వాసాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నా....!

    See More
    అమ్మలకే అమ్మవి...
    అమ్మలకే అమ్మవి ...
    జగదంబవి...
    ముల్లోకాలను ఏలేటి.....
    మూలకుటమ్మవి..
    అభయహస్తమిచ్చి అన్నివేళలా..
    ఆదుకునే...అన్నపూర్ణవి...//అమ్మవి//

    పతిదేవునిలో సగభాగమై..
    ఆలుమగల అనుబంధానికి ప్రతిరుపమైనావే..
    మంచు కొండల మీ నివాసమైనా..
    వెచ్చని వలపుశ్వాసల ఊపిరులనిస్తూ..
    పరమేశ్వరుని ఇల్లాలివైనావే..
    పార్వతిగా పాపాల హరించే పరమ పావనివి ..//అమ్మవి//
    బెజవాడ కనకదుర్గవైనా..
    శ్రిశైలంలోని బ్రమరాంభికవయినా..
    పద్దెనిమిది శక్తి పీఠాల మహా శక్తివే..
    సౌందర్యలహరిలొ ఆవాహనమైనావె..
    .అర్చనల ..ఆరాధనల సంతుష్టివే...
    సహస్ర నామ సముదాయనివి.....//అమ్మవి//
    +++ఆరాధన ++++
    నీ మదిలో మెదిలే భావాలను
    చదవలేని గుడ్డిదానినైతిని ఇన్నాళ్ళు ..
    నా ఎద ఊసులు తెలుసుకోలేక
    చక్రమల్లె.. జీవనంలో తిరిగాను ఇన్నేళ్ళు..
    ...
    హృదయకుహరంలో..ఏ మూలో దాగిన నీ తలపు..
    మంచును వీడిన మంచి ముత్యమల్లే నిలిచి..
    శ్వేతవర్ణ కపోతమై.... వలపుల గులాబీనందిస్తూ..
    నా మది గడియ తీయమని .. తలుపు తడుతుంది....
    ఉశ్వాస ..నిశ్వాస కదలికలలో..ఉపిరివై..
    ఆరాధనలలో ఆలింగనమైనావు ..
    అక్షర సాక్షిగా...అమరమైన ప్రేమకు..
    నిదర్శనమై అణువణువూ ..అర్పిస్తున్నా..సంసేవితనై..!!

    * అమ్మని (ఆడపిల్లని) * అనే కవిత రాసి
    " ఉత్తమ ద్వితీయ కవిత" విజేతగా నిలచిన
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన .గారికి
    అభినందనలు...
    _/\_
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
    అమ్మని (ఆడపిల్లని)
    అమ్మ కడుపులో అంకురంగా నిలిచిన క్షణంలోనే..
    "అయ్యో!ఈ సారీ.. అమ్మాయి అయితే..ఎలా..." అనుకునే..
    భీతిల్లె అమ్మ హృదయ స్పందనలను చూసాను..
    పురిటి కందుగా..నాన్న నిరాదరణ చూపులకు గురి అవుతూ..
    నాన్నమ్మ అక్కసుగా మెటికిళ్ళు విరుస్తుంటే...
    బెదిరే అమ్మ కొంగు చాటు చేసుకుంటూ..అడుగులు వేసాను..
    అక్క విసిరి పారేసిన పాతగౌనులు వేసుకుంటూ..
    చిరిగి వేలాడే పుస్తకాలను ముందేసుకుని..
    'అ' అమ్మ ! అంటూ అక్షరాలు నేర్చుకున్నాను..
    పక్కింటి మామయ్య వెకిలి చూపులకు మర్మాలు తెలియక..
    బడికి వెళ్ళే దారిలో ...'జాంపండు రోయ్..' అని వినిపించే జులాయిగాళ్ళు
    బెదిరుతున్న నాకు.... కంటిచెమ్మతో..అమ్మ ఇచ్చిన ఓణి వేసుకున్నాను..
    పట్టు వదలక పదవతరగతి ఫస్టుగా పాసైనా..
    ఆడపిల్లకి ఇక చదువెందుకంటూ...ముప్పై ఏళ్ళ బావకి కట్టబెడితే ..
    కుడి కాలు ముందు పెట్టి ...అత్తగారింటి ఇల్లాలినయ్యాను...
    ఇంటెడు పని ఒంటి కాలిమీద చేసినా...ఆడబిడ్డ ఆరళ్ళను ..
    'ఒసేయ్..ఏమోయ్...' అనే...అవహేళనలను కంటి రెప్పలకిందకినెట్టి....
    నాలుగ్గోడల మద్య నలుగుతూ..పెదవంచున దుఃఖం దాచుకున్నాను..
    అమ్మనవుతున్నానన్న ఆనందం అనుభవించ నివ్వకుండా..
    స్కానింగ్లో ‘ఆడపిల్ల ‘ అని తెలుసుకొని...’అభార్షన్ చేయిస్తా ‘అన్న
    మొగుడి మాటలకి ..అణచుకోలేని ఆగ్రహంతో భద్రకాళినే అయ్యాను...
    నవమాసాలలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ..
    ఒడి చేర్చుకున్న చిట్టి తల్లిలి గుండెలకి హద్దుకుంటూ..
    అవసరాలకి ఆరిపోయే దీపం కాదు ఆడపిల్లంటే..
    ఆశయాల సాధనలో ఊపిరులను లెక్కచేయక ఎదురు నిలిచి..
    అభాగ్యులకు ఆలంబన అయిన ఓ కిరణ్ బేడి లానో..
    మహిళాభ్యుదయానికి శక్తి వంచన లేకుండా పాటుపడిన
    దుర్గాభాయి దేశ్ముఖ్ లానో..నా బిడ్డని పెంచుకుంటూ ..ఆత్మస్థైర్యాన్ని
    శ్వాస లో నింపుతూ... కల్పవృక్షమే ఆడపిల్లంటే అని నిరూపిస్తాను...!
    - సుజాత తిమ్మన .
    ***********************
    విజేతకు అభినందనలు 
    గుర్తుండాలని ..!
    మన జీవన ప్రయాణంలో ..
    అర్ధ శతకం పూర్తి చేసుకున్నా...
    వాడని వలపు పూవులకు .....
    వీడని సువాసనలు..
    ఎదలో పులకరింతల కవ్వింతలవుతున్నాయి..

    సాగరం లాంటి సంసారాన్ని
    అవలీలగా ఈదగలిగినాము..
    ఒకరికి ఒకరం ఉంటూ...
    ఒకటిగా మెసులుతూ..
    అనుబంధాన్ని పటిష్టం
    చేసుకున్నాము ఆది దంపతులమై..
    కాలాలు మారినా...
    సంవత్సరాలు గడిచినా...
    యవ్వనం వీడి...
    వార్ధక్యం మనకి చేరువయినా...
    లాలిత్యమైన మన ప్రేమ
    ఎప్పుడూ అమరమైనదే...
    కడదాకా నీ కన్నుల నా మోము
    నిలుచుండాలన్నదే నా ఆకాంక్ష..
    కనిపించని ఆ దేవునికి
    ప్రణమిల్లుతూ వేడుకుంటున్నా,,
    మరు జన్మకీ ..
    మూడుముళ్ళు వేసేటప్పుడు
    కలిగిన నీ వెలి స్పర్స గుర్తుండాలని..!!
    క్యాలెండర్..!
    నిన్నని గుర్తు చేస్తూ..
    రేపటికి ఆశని రేపుతూ..
    గోడ మిద స్థిరమై.....
    రెపరెపలాడుతూ...
    కనిపించే క్యాలెండర్..!

    క్షణాల పాకుడు మెట్ల పై
    నుండి పాదరసంలా
    జారిపోతున్న కాలాన్ని
    అంకెల్లో బందించ లేక
    చిత్తరువై నిలిచే క్యాలెండర్..!
    నెల చివరి రోజున కాళి అయిన పర్స్ ని..
    తీరని అవసరాల ఆకళ్ళతో బేరీజు వేసుకుంటూ..
    మొదటి తారిఖున వచ్చే జీతంకోసం
    వేచిచూసే మద్యతరగతి మందహాసాన్ని..
    నిస్సహాయంగా చూసే..క్యాలెండర్..!
    సెలవు రోజులను ప్రత్యేకంగా చూపెడుతూ...
    శ్రమ జీవులకు హమ్మయ్య..అనిపిస్తుంది..
    పండగలను...జాతీయ పర్వదినాలను..
    తనలో ఇముడ్చుకొని..మరీ..వెతుక్కోమంటుంది ..
    మనలో ఒక భాగమైన నిత్య యవ్వని క్యాలెండర్...!

    భారతీయ “మహిళ”
    జన్మ నక్షత్రాన్ని అనుసరిస్తూ..
    వెతికి వెతికి అల్లారు ముద్దుగా..
    తల్లితండ్రులు పెట్టిన పేరును సైతం.....
    మొగుడి అహంకారపు రావణ కాష్టంలో..
    ఆహుతికి గురి చేస్తూ....
    మాటకి ముందు..మాటకి వెనుక..
    ‘ముండ’ గా నే మిగిలి పోయింది..

    మానసికంగా కూడా ‘పర’ ని
    తలచని పతివ్రతా తత్వాన్ని
    వదులుకోలేని తనాన్ని..
    పుట్టింటినుంచి.. హరణమంగా
    తెచ్చుకున్న..సాంప్రదాయం
    ఆపాద మస్తకము
    ఆపాదించుకుంటుంది..
    చొంగ కారుతున్న ఉంగాలతో..
    సరాగాలడుతూ...
    ‘నా బంగారు తల్లి’ అనుకున్న
    కన్నవారి మురిపాలని
    తలవంచి తాళి కట్టించుకుని
    ఆలిగా మారి..
    తనకు తాను తానుగా లేక
    సంసారపు సంగర్షణల కొలిమిలో..
    కమిలి..కమిలి కాలిపోయి
    బూడిద అవుతూ ఉన్నా...
    ఆత్మ సాక్షిగా ఆ పరమాత్ముని..
    వేడుకుంటుంది....
    “స్వామీ ! నా పసుపు కుంకుమలు కాపాడు “ అని..
    ఆమె ‘భారతీయ మహిళ ‘..

    చివరాఖరుకు...
    తూర్పు పడమరల కలయికలలో
    తొలిసంధ్య మలిసంధ్యల మధ్య నిలిచిన దూరం .
    .బ్రతుకు గమనంలో ప్రయాణం ...
    ప్రయాస అయినా..గమ్యం చేరాలనే తాపత్రయం..

    గెలుపుల విజయలయినా..
    ఓటముల సంఘర్షణ లయినా ..
    చివరాఖరుకు ఆరడుగుల నేలకై..
    జీవితం.. అంతిమం వరకు..బ్రతుకు పోరాటమే..
    జన్మనిచ్చిన అమ్మ ఒడి
    సాంత్వనల అమృతం పంచు గుడే ఎన్నటికి....
    అయితే...మహాప్రస్థాన ఘట్టంలో జీవుడు..సమాధి స్థితిలో
    జనని మట్టిరేణువుల కరిగి....సజీవుడుగానే మిగులుతాడు...!


    సారంగ రాగమంటి వెన్నెల
    సాక్షిగా ..విన్నవించుకొను నా వేదనలకు
    సారాంశమే తెలియని పద్యం వలెనున్నజీవితాన్ని
    సాభిప్రాయంగా నివేదిస్తూ,
    ...
    సాష్టాంగనమస్కారం చేస్తూ..
    సాయి దేవుని..వేడుకుంటున్నా ...వారి
    సాన్నిధ్యము దూరం చేయక ..
    సాకతము నిచ్చు ప్రభువని తలచి..
    సాన్నిధ్యమునెన్నడు వీడక
    సాకారము చేసుకొందు బ్రతుకు..
    సాత్వికమగు బాబాగారి సుక్తులననుసరిస్తూ...
    సాటి జనుల సేవలో తరిస్తూ...
    తానేంకినైతే ....
    పట్టు పావడా గట్టి..
    పరువాల పట్టును
    పైటతో కప్పి.....
    జడకుచ్చుల జడలో..
    జాజి మల్లెలు తురిమి..
    కలువల వంటి కనులకు
    కాటుక రేఖలే తీర్చి..
    నుదుటను సిందూర
    తిలకమునే దిద్ది..
    మిసిమి అందాలకు
    సింగారాల సొగసును చేర్చి..
    రాబోవు తరుణానికై..
    వగచే ఎదను జాగృతి చేస్తూ..
    మది వీణ పలికే...
    సరిగమల శృతిలయలలో..
    తనని తాను కోల్పోతూ..
    కోవెలలో కొలువైన స్వామికి
    విన్నవించుకొన ..
    పూజాద్రవ్యాలను చేతబూని..
    బరువైన నడకల చేరుకొనె..
    కోమలాంగి...
    తానేంకి నైతే..
    ఎంత బాగుండునను తలంపుతో..!
    స్త్రీ మూర్తులు.....
    యత్ర నార్యంతు పూజ్యంతే “...ఇది ఆర్యోక్తి...
    స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో..
    అక్కడ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని భావం......
    మరి ఆ స్త్రీకి ఎక్కడ లబిస్తుంది...ఆ గౌరవం...?
    ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే..
    మొట్ట మొదట అనే మాట...’ఆడ.......’ పిల్ల ..
    అందులోనే..దూరం మొదలైంది...మరి..

    ఆచార వ్యవహారాలు... మూఢ విశ్వాసాలు..
    వద్దన్నా మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి..
    దానికి తోడూ ప్రకృతి సహజంగా..
    పడతికి శారీరక బలహీనతలు...
    (కీచక ) మగవాళ్ళకి ఆయువు పట్టులవుతున్నాయి..
    ఎక్కడ చూసినా..అత్యాచారాలు...
    సామూహిక మానభంగాలు....
    పసి కూన దగ్గరి నుంచి..
    అరవయ్యేళ్ళ వృద్దురాలయినా కూడా..
    తమ కామ దాహాన్ని తీర్చుకోవడానికి...
    వెనుకాడక...నరరూప రాక్షసులు గా మారుతున్నారు...
    మానం మాతృత్వానికి మారు రూపం
    అన్న నిజాన్ని మరచిన నపుంసకులు...
    రెండు నిమిషాల సుఖం కోసం..
    నిండు జీవితాలని బలిచేసే..రాబందులు..
    ఈ ఆగడాలను అరికట్టాలంటే...
    తరలి రావాలి...తరుణులంతా..
    ఆది శక్తి అంశలో జన్మించిన బలం చేతబూని..
    అమ్మ తనం అమ్మాయిలదని చాటుతూ..
    జగతిని ప్రేమమయంచేయ..
    అవతరించాలి..ఎందరో.. మదర్ తెరిసాలు..
    చేతులెత్తి మొక్కాలనిపించే...
    సౌశీల్యాన్ని సొంతం చేసుకొన్న స్త్రీ మూర్తులు....!!
    అపర రుద్రమలై..అంతమొందించాలి ‘ఆ’ కలిపురుషుల..
    *****నాయుడు బావవే కాలేవా...!********
    కొప్పులోన పెట్టిన మల్లెపూల ఊసులు...
    వినకుండా...ఏడకెళతావు బావా...
    ఎదలోన చేరి ...గుస గుసల రొదలను వినలేవా..

    పరువాల పట్టేమో పైటంచును దాటింది..
    పగటిని దాటేసి, సంధ్య చీకట్లను చేరింది..బావా..
    మదిచేసే మారాముకు మాలిమైన కాలేవా...
    ఏటి అలలు ఎక్కసంగ ఏదేదో చెపుతున్నాయి..
    గాలి తెరలు గిలగింతల అల్లరులే చేస్తున్నాయి బావా..
    ఏమరపాటు వీడి నీ వలపుల చెలిమిని చేయలేవా..
    ప్రాణాలన్ని నీపైనే..కలవరింతల క్షణాలైతే..
    నీ సందిట కాపురముంటా యుగాలకైనా బావ..
    ఈ ఎంకి చిక్కని చూపుల్లో చిక్కిన నాయుడు బావవే కాలేవా...
    **‘ని’ (నిర్వచనమెరుగని భవితే..)ర్భయ****
    సమాజంలొ స్త్రీ
    ఎన్నడూ సరితూగలేని ...
    పద్దార్ధమే అయింది...
    బ్రహ్మ దేవుని సృష్టిలొ
    ఆడపిల్లగా రూపుదిద్దుకొని..
    ఆమని అందాలకి ఆవాసమయింది..
    ఇంట గెలిచి..రచ్చ గెలిచి..
    రాజ్యాలేలే రాణి అయినా..
    అమ్మగా అవతరించినపుడు అనురాగ మూర్తే అయింది...
    అమ్మయిగా అభిమానాలను
    జన్మతః అరువు తెచ్చుకొని
    వాటిని కాపాడుకొనలేక అబలే అయింది..
    కట్టుబాట్ల సంఖెలలో ఒరుసుకొని
    కన్నవారి ప్రేమలకు కన్నీటిని నింపుతూ..
    ఊపిరి ఉన్నా కదలలేని శిలే అయింది...
    పురాణాలలో స్త్రీ ఆది శక్తేమోగానీ
    ప్రస్థుత పరిస్థితులలో ఆడది అంటే
    మగవాని మర్మాలకు మసలే మరబొమ్మే అయింది..
    "నడిరేతిరి రహదారిలో...
    ఒంటరిగా నడిచినపుడే స్త్రీకి నిజమయిన స్వాతంత్రం "
    అని మాహాత్ముడన్నాడట...
    కానీ పట్టపగలు మహిళ
    జనసమూహంలో...మానప్రాణాలు కోల్పోయే ఓ
    ‘ని’(నిర్వచనమెరుగని భవితే)ర్బయే అవుతుంది..!!
    రావాలి ..రావాలి ..ఎవరో..ఒకరు..(((
    ప్రాచీన కాలం నాటి వ్యవహారికంలో గల ...
    లోటు పాట్లకనుగుణంగా...
    ఆనాడు పెట్టుకున్న ఆచారాలు..
    రాను రాను అర్ధం చేసుకోను పరిణితి లేక ...
    మూర్ఖంగా పాటించేవే...ముడాచారాలయినవి..

    చాకలి వాని మాట పట్టింపుకు నిండు చూలాలని చూడక..
    అడవుల పంపిన ఆ రాముని సంస్కారాన్ని ...
    అలుసుగా చేకొని అనుమానం రోగంతో భార్యను
    ఆంపశయ్య పరుండజేసే భర్తలు ఎందరో....
    'కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా!' అని...
    మగవాడు ఏమి చేసినా చెల్లునను భావం అహంకారమైయితే..
    ఆ స్వార్ధపు కోరలలో చిక్కి బలి అయేది ఆడదే...
    రాజులు..రాజ్యాలతో పాటు...
    పోషించారు..రాజ నర్తకీమణులను..
    జమిందారులు తమ భేషజం కాపాడుకొందుకు ...
    జోగినులను తాయారు చేసారు..
    అదే రీతిన పసిమొగ్గల వంటి కన్నెలను..
    నోరులేని శునకాలతో పెళ్లి చేసి...
    తమ కామదాహానికి వారి మాన ప్రాణాలను
    మధువు సేవనంతో పాటు సేవిస్తున్నారు ...
    'ఇదేమిటి అంటే..' 'ఆచారం' అంటారు...
    నల్ల గుడ్డను కళ్ళకు గంతలుగా
    కట్టుకున్న న్యాయ దేవతా....!
    ఒక్కసారి నీ మనసును తట్టుకొని...
    కళ్ళగంతలు తీసి చూడమ్మా..
    ప్రతి గల్లిలో..ఓ చెల్లి..ఓ మల్లి...
    కన్నీటికి కూడా భాష్యమెరుగని చిట్టి తల్లి...
    అమాయకపు బెదురు చూపుల పాలవెల్లి..
    అమానుషాలకు..ఆకృత్యాలకు .
    ఆహుతి అవుతూనే ఉన్నారు...
    రావాలి ఎవరో ఒకరు..మరో...
    రాజారామ్ మోహన్ రాయ్...
    ఆడవారి జీవితాల ఆటలాడు.
    తరాల అంతరాలను అంతమొందించ...
    రావాలి ఎవరో ఒకరు...మరో..
    విరేసలింగం పంతులు ...
    అతివల అశువులు తుడిచి..
    భావి జీవితాల వెలుగులు నింప....
    రావాలి..... రావాలి.. ఎవరో..ఒకరు....
    కధన రంగం కాదు ఇది..
    కరుడు గట్టిన పాషాణ హృదయాలను కరిగించ..
    వెన్నెల మనసుల... దీపాలను వెలిగించ..!
    ************కలంతో సేద్యం**************
    అన్నప్రాసన నాడు కలం పట్టుకున్న నన్ను చూసి..
    'నా బిడ్డ కలెక్టరు...అవుతుంది..' అని మురిసారట నాన్న..
    ఆ మురిపం తీర్చ ...కలెక్టరు నయితే అవ్వలేదు కాని.....
    కలం మాత్రం నా జీవనయానపు అడుగులలోని
    ప్రతి కదలికలకు లయగా నిలిచింది..

    'ఓం ' కారంతో మొదలయిన అక్షరాభ్యాసంతో ..
    'అ ఆ'లనుదిద్దిన బాల్యపు...వేళ్ళ చివరల్లో కలం చేరి..
    అక్షర విత్తనాలను పోగేసుకుంటూ..
    ఎదలోని భావాలకు ప్రతిరూపం ఇస్తూ..
    తానో హలం అయి సేద్యమే చేస్తుంది..
    కాగితాలపై...కవితల పంటలను పండిస్తూ...
    స్పందననెరిగిన ప్రతి కవిలోని అనుభవం ఇదేనేమో..
    అందుకే రామాయణ ..మహాభారత గ్రంధాలు..
    వేదాలు ...ఉపనిషత్తులు...అన్నీ...
    కలం చేసిన మహత్యాలే కదా..!
    నారాయణరెడ్డి రసభరిత గీతాలు ...
    శ్రీ శ్రీ గారి ఉత్తేజపూరిత గేయాలు..
    కరుణశ్రీ గారి పుష్పవిలాపం ఏది అయితేనేమి..
    దేవులపల్లి సరళ లలిత స్వరములేమి..
    ఏవైనా...ఎవరినయినా...
    కనుచూపుల కవ్వించాలన్నా....
    పదునైన కత్తిలా ఎదను చీల్చాలన్నా.....
    అది సాధ్యం ఒక్క కలానికే....
    ఇది లోకం ఎరిగిన సత్యం...
    ఆది ..అంతం లేని నిత్య నూతనమైన
    చరిత్రగా నిలిచి చిరస్థాయిని పొందేటంత నిజం..!

    మాలో ఒకడివి..
    మము గాచే వాడివి..
    తల్లి తండ్రుల హృదయము
    కలిగి...ప్రేమించు వాడివి..
    గురువువై..సన్మార్గమున ...
    నడిపించు వాడివి...
    దైవము నీవై...
    కోటి ప్రభలతో...
    జీవితమును వెలిగించు వాడివి..
    అయినా...
    మాలో ఒకడివి..
    మము గాచే వాడివి...
    సాయి నాధా...
    సద్గురు దేవా...
    సమస్యలెన్నయినా.....
    సమాధానము నీవే కాదా....
    సాయి నాధా...
    సద్గురు దేవా....!
    రేపల్లె లోనా
    వెన్న దోచావు...
    మా పల్లె లోనా
    నన్నే దోచావు...
    ఇంకెందుకు రా......
    ఆ కొంటె నవ్వులు...
    మత్తు జల్లే..మరుల
    మరుమల్లె పువ్వులు...
    కృష్ణా...కృష్ణా...కృష్ణా...
    చీరెలెత్తుకెళ్ళి నా
    చిద్విలాసము నీదే..
    వేణువూది సన్మోహితులను చేసే..
    మోహన రూపము నీదే....
    కృష్ణా..కృష్ణా..కృష్ణా....
    శూన్యం
    చేరలేని చూపుల కావలనున్నా..
    మనసుపొరలలో చిక్కుకొని..
    వేదనల భారాన్ని మోస్తూ.....
    క్షణాలని తనలోనికి జార్చేసుకుంటూ..
    సమస్తం తానేఅయి వ్యాపించి....
    స్పర్శనెరుగనీయక కమ్మేస్తుంది 'శూన్యం '

    'ఏమిలేదు' అన్న పదమే 'సున్న' అనుకుంటే..
    'సున్న' శూన్యం అయితే..
    అంతర్లీనమయిన ఆత్మని జతచేసుకుని చూసుకుంటే...
    పదిరకాల సమాదానాల పదవుతుంది..'శూన్యం'
    లోలోన దోబూచులాడుతూ....
    ఒక్కోసారి రెచ్చగొడుతూ..
    మరొక సారి మార్గం చూపిస్తూ...
    ఎల్లవేళలా 'నేనున్నా'నంటూ..
    వెంట వెంట ఉండే స్నేహశీలి 'శూన్యం'
    తపనలలో ఆకాశమై అనంతమవుతుంది
    తడి కన్నుల చెమరింపులలో..
    చల్లని అమ్మతనమై..సేద తీరుస్తుంది..
    సందిగ్ధావస్తలో..లక్ష్మణరేఖ అయి..
    ఆపదల గాచే ఆయువు పట్టవుతుంది..'శూన్యం'