11, అక్టోబర్ 2016, మంగళవారం

*********తెలుసుకోండి...**************
చేదైనా..చేతిలో గ్లాసు ప్రతిష్టకి చిహ్నం
ఉన్నవాళ్ళ కుటుంబాలలో...
పార్టీల పేరిట మందు సేవనాలు..
అలవాటై అవే చేస్తాయి కుటుంబ నాసనాలు..
శరీరాన్ని గుల్ల చేసి..ఆసుపత్రి పాల్జేస్తాయి.
మరీ శృతి మించితే...బూడిదగా మిగులుస్తాయి..
కాయ కష్టం చేసుకునే బడుగు జీవులు సైతం..
కల్లు ,సారాయిలకు బానిసలవుతూ ..
.బ్రతుకు దుర్భరం చేసుకుంటున్నారే..
ఎవరు చూసినా ..ఎటుచూసినా....
చూడ చూడ రుచుల జాడ ఒకటే ..! అన్నట్టు..
జీవిత విలువలను వలువలు విడిచినట్టు విడిచిపెడుతున్నారే..
మద్యపానం అంటే అసుర సమ్రక్షణమనితెలుసుకొని.....
మానవత నిలుపుటకు మధువును మట్టుపెట్ట పూనుకొండుకు..
గాంధీగారి నడవడిని, కందుకూరి ఆశయాలను,
రాజారామ్ మోహన్ రాయ్ తెగువను,.
పుణికిపుచ్చుకున్న యువతరం ..
నడుంకట్టి ..వాడ వాడలా తిరుగుతూ.
ప్రతిఒక్కరికి అర్థంచేయించండి....తెలుసుకోండి...!


10, అక్టోబర్ 2016, సోమవారం

సముద్రం...ఏదైనా....
పరవళ్ళు తొక్కుతూ పారాడిన నడులన్నిటిని...తనలో కలుపుకుని
అలల సందళ్ళతో ఆహ్లాదపరుస్తూ....వెన్నెలంటి నురగనందిస్తుంది
అనంతమైన ఆకాశానికి తాను దర్పణమై నిలిచి ..
తనలో ఇముడ్చుకుందా..అనిపిస్తుంది నీలవర్ణంలో మెరుస్తూ..
తొలి సంధ్యలో...బాల బానుని ప్రసవిస్తూ..పురిటి నొప్పులను అనుభవిస్తే...
మలిసంద్యలో స్మశాన వైరాగ్యాన్ని పొందుతూ...స్థబ్దమవుతుంది..
తుఫాను తాకిడికి అల్లకల్లోలమయినా..తనలోతానే సుడులు తిరుగుతుంది..
అగ్ని పర్వతాలు లోలోన బ్రద్దలైనా..గుంబనంగా ఎగిసి పడుతూఉంటుంది..
సకలజలచరాలకు జీవాన్ని ఇస్తూ..అనంతమయిన సంపదను తనలో దాచుకొన్నా
అంతుపట్టని సముద్రతీరం ఎప్పుడూ...అపురూప దృశ్య కావ్యమే...
కష్టాలు..కలతలు ..ఏకమై..ఎదకోత కోస్తున్నా ఏమరపాటుకు లోనవక
హృదయ సముద్రం... ఓదార్పుల అలలతో సాంత్వన నిస్తుంది..
సంతోషాల సరదాలు ఉప్పొంగినా....దుఃఖాల నదులు దూసుకొచ్చినా
మనిషి మనుగడకు తాను నిరంతరం శ్రమిస్తూ...జీవదానం చేస్తుంది..
అందుకే...సముద్రం...ఏదైనా...అనంతం...అద్భుతం..అపురూపం...!!!


కర్ణ ...
దుర్వాస ముని మంత్ర ప్రభావం చూడాలనే తపనతో...
కుంతిదేవి సూర్యుని ఆరాదిస్తూ ..మంత్రం జపించినంతనే...
ఆ భాస్కరుని తేజంతో..జన్మించి కన్యగా ఉండగానే తల్లిని చేసావు..
నీ తప్పు లేకపోయినా ...నీటి పాలైనావు..పసిగుడ్డు గానే...
సూతుని ఇంట సుతునిగా పెరుగుతూ...రాజసం మాత్రం విడువక
కౌరాధిపతి దురోధనుని అనుంగు మిత్రుడి వై...స్నేహశీలివనిపించుకున్నావు..
పుట్టుకతోనే కవచ కుండలాలను ధరించిన వాడివే....కానీ
ఇంద్రుని మాయాజాలం లో....భాగంగా...బ్రాహ్మనుడిగా వచ్చినతనికి
దానంగా ...రక్త మాంసాలతో...ఊడబెరికి ఇచ్చి ...దాన కర్ణుడివి అయినావు..
అర్జునిడితో సమంగా అన్ని విద్యలలోను ఆరితేరినా....
గురువు శాపానికి గురి అయి ...బ్రహ్మాస్త్ర ప్రయోగం సమయం లో
మతిమరుపుకులోనయి...కదనరంగంలో రధ సూన్యుడివయ్యావు ..
అరుణ కిరణాల తాకిడికి...పార్ధుని అస్త్రధాటికి ..శరీరం ఖండాలుగా మారినా..
అమరుడవై..నిలిచావు...సూరత్వమే కాదు...స్నేహంలోని గొప్పతనాన్ని చాటుతూ..!!
కంటి చెమ్మ ...
ఎప్పుడూ అది కావాలి...ఇది కావాలి.....
అని అడుగుతూ ఉండేదానివే....కదా తల్లీ...
అడిగినదే తడవు గా...సాధ్యమయినంత వరకు...
నీకు అన్నీ ఇచ్చాను రా...బంగారు..
ఇప్పుడు నన్నే అడుగు తుంటే...
నన్ను ...నేనెలా ఇవ్వను రా...పిచ్చి తల్లి...
అప్పగింతల వేళ ...ఆవేదనే అయినా...
ఇది ఆనంద సమయమే ప్రతీ తల్లితండ్రులకు..
దూరమయినా.... దగ్గరితనంలోని మమకారం ..
కూతురి కాపురం కోసమే...కలవరం.రా..అమ్మడు
గుండెల మీద పారాడిన నీ పసితనం ..
గూడుకట్టుకుందమ్మా ఎద లోగిలిలో..
నేను గుఱ్ఱం అయి..నిన్ను స్వారి చేయిస్తాను..
గుజ్జన గుళ్ళు ..అష్టా చెమ్మలు ఆడుకుంటూ..
ఆగూటిలో...నేను నీతోనే ఉంటానురా..నాన్నా..!
యుగ యుగాలకు తండ్రి కూతుళ్ళ అనుభందం
నిత్య నూతనమే...ఆ అనురాగానికి అవధులు లేవు..
అరమరికలు ఎన్నడూ కానరావు..
అదే..నాన్నప్రేమ..కూతురిలో దాగిన కంటి చెమ్మ !!
మా తాత చెప్పేవారు.........
పైన ఏడేడు లోకాలుంటాయని...
స్వర్గం చివరిదని...
అక్కడ...దేవతలుంటారని..
చిన్ని కళ్ళ ల్లో ఎన్నెన్ని కలలో...
ఆ లోకాల చేరుకోవాలని...
ఆ దేవలోకంలో...
నేను ఓ దేవత గా తిరుగాడాలనీ..
కొలనులో మిల మిల మెరిసే....
వాడని స్వర్ణ పుష్పాలని సృసించాలనీ...
తీగె మల్లెల ఊయలలో ఊగుతూ
పెరగని బాల్యంలోనే....చిరంజీవినవ్వాలనీ...
కళ్ళు తెరిచే సరికి..బాల్యం దాటి పోయింది...
ఆశల నిచ్చెన కూలిపోయింది..
మబ్బులు మాత్రం మిగిలాయి...
తాతని తనలో కలుపుకొని...!!
వెన్నెల రాజా...వినుమా ఒక మాట...
వేదనతో నా మనసు తెలిపే ..వలపు సంజ్ఞల మాలిక...
అతని చూపులవలలో చిక్కి.. కలవరపడిన కనుదోయి..
కలలకావాసమైనిలచింది..
చిరుగాలి తాకిడికే...తనువు తహతహల
తపనలను చేరుతుంది....
విప్పారిన పూల పలకరింపులు సైతం...
మన్మధ శరాలై..మదిని తాకుతున్నాయి
చీకటి తెరలను చిలుస్తూ..పున్నమిలో నున్న
నీవు కూడా ...విరహ తాపం రేపుతున్నావు..
విన్నపాలు విని ఉరుకుంటే సరికాదు...
విన్నవించు మరి ఆతని మదికి చేరవేసి..
నిండు జబిల్లివై...జాతర చేసేవు ...
జగరణలో జప్తు చేయకు ఇక...!!

 నీరు..

పల్లం చూసుకొని పరుగులు తీస్తూ...తుళ్ళి పడుతున్నా..
అడ్డుకట్ట వెయ్యగానే.....ఆగిపోయి ...అణుకువ చూపే నీరు..
లోకంలో...మూడు వొంతులు స్తానాన్ని ఆక్రమించి..
సమస్త జీవ రాసికి అత్యవసర ఆదారమైనది నీరు ..
తటాకాలలో..స్థిరమైనా...నదులలో చేరి ఉరకలు వేస్తూ..
సముద్రంలో కలిసి...అలల అల్లరి చేస్తుంది..నీరు..
కవుల మనోభావాలకు ...చినుకుల భాష్యం చెపుతూ..
మది తలపుల తలుపులు తీస్తూ...వానై కురిసే..నీరు..
భానుని ప్రతాపానికి తాళలేక ...ఆవిరిగా మారి...
మబ్బులలో దూరి....ఉరుముల మెరుపుల తాకిడికి..జల్లైకురిసే నీరు..
పంట పోలాలకి ప్రాణ దాతైనా....వాయువిజ్రుంబణకి .
విశ్వ రూపం చూపిస్తూ...ఉప్పెనై విరుచుకు పడుతుంది..నీరు..
జల చరాలను గర్బంలో దాచుకొని...వాటి ఉనికికి స్తావర మవుతూ...
అనేకానేక జల సంపదలను లోకానికందించే కల్పం..నీరు..
దోసిట్లో...గుక్కెడైనా..దాహం తీరుస్తూ.....
తను లేనిది ప్రపంచం లేదని చెప్పక చెప్పేదే..నీరు...!!
తల్లీ వరలక్ష్మీ దేవి..!
మావిడాకుల తోరణాల సన్నాయితో స్వాగతం చేతున్నానమ్మా .
మంచి ముత్యాల సరులవోలె రంగవల్లులు తీర్చి మరీ.. తల్లీ వరలక్ష్మీ దేవి !
మణిమయసువర్ణ ప్రతిమను మనసున నిలుపుకొని...
పసిడి వర్ణపు పుష్పాల నీకలంకారం చేసితినే తల్లీ వరలక్ష్మీ దేవి.!
శ్రవణమాసపు శుక్రవార శుభఘడియలలో ..మది గదిలో కొలువు తీర్చి
ఆచమనము...అష్టోత్తర అర్చనలతో నిను పుజింతునే తల్లీ వరలక్ష్మీ దేవి !
పరమేశ్వరుడు తన ప్రియపత్ని అయిన పార్వతికి..లోకాల గాచుటకు
ప్రియమారా నీ వ్రత విధానము తెలియజేసేనే తల్లీ వరలక్ష్మీ దేవి ..!
చారుమతి స్వప్నమున దరిశన మిచ్చినావట అనుగ్రహముతో ..
ప్రీతి వాక్కులు పలుకుతూ..నిను సేవించమని చెప్పినావట తల్లీ వరలక్ష్మీ దేవి..!
సంతసించిన ఆ ఇల్లాలు తన చెలులతోగూడి భక్తి శ్రద్దలతో ..
వ్రతమాచరించినంతనే..సౌభాగ్యాల కోరి వరము లిచ్చినావట తల్లీ వరలక్ష్మీ దేవి ..!
నీ కృపాకటాక్షాల భారాన్ని మోస్తూ..చల్లని చూపుల రేఖలు..
మాపై ప్రసరింపజేయ.. మాఇంట ఆసీనురాలివి కావే తల్లీ వరలక్ష్మీ దేవి ..!
నవ సూత్రముతో బందించుకొని ...నవనైవేద్యముల నివేదన చేసితినే తల్లీ వరలక్ష్మీ దేవి !
"ఓ బొజ్జ గణపయ్య ...నీ బంటునేనయ్య " అని తలపుల నిలుపుకొని..
బంకమట్టితో..మనసున మెదులు నీ రూపమును తీర్చిదిద్దునునయ్యా వినాయకా .. !
మారేడు జిల్లేడు మొదలగు పరి పరి విదములగు పత్రితో..నీకాసనము వేసి..
గన్నేరు...నందివర్దనం...చేమంతులు...ముద్దబంతులే కాదు...
ఎదలో పూసిన భక్తికుసుమాల..నీకలంకారము చేసి...
ప్రాణ పటిష్ట గావించి...అష్టోత్తర అర్చనలతో...నిను పూజింతునయ్యా వినాయకా..!.
మోదుకలు...ఉండ్రాళ్ళు...గారెలు ..బూరెలు...పరమాన్నాలతో పాటు..
అటుకులు ..కొబ్బరి పలుకులు..బెల్లం కలిపి..నీకు నివేదన చేసేదనయ్యా..
శమంతకమణి కథ చదివి...అక్షతలు తలపై వేసుకొని ..
చంద్రుని చూసిన నిందను బాపుకొనెదనయ్యా వినాయకా.....!
తొలిపూజలు అందుకొంటూ ...విజ్ఞములను తొలగించే గణనాధుడవు...
మరుగుజ్జు రూపమయినా..... బహుసుందరాంగుడవు..
వాడవాడలా కొలువు తీరి...నవరాత్రుల శోభతో భాసిల్లెదవు.
నిమజ్జనము చెంది.. నీటిలో కలిసినా..లోకాల రక్షించువాడవుగదయ్యా.. వినాయకా ..!
.
పర్యావరణ పరిరక్షణగావించుటకు ...సహజసిద్ది గణేషుడను ..
ప్రతి ఇంట నిలపుకొని ..చవితిలోన చల్లగ అర్చించెదరు గదయ్యా ..వినాయకా..!
సుజాతను ....
సుజాతను నేను... అమ్మానాన్నల ప్రియ సుతను నేను...
సుమనోహరుడి వలపు వెన్నెలను ఆస్వాదించు ప్రియసతినై...
సువిశాల జగతిలో నేనొక చుక్కల పల్లకీలో పయనించు అభిజాతనై...
సుమధుర స్వప్నంలోని మధురోహల్లో తేలిపోతూ...ఆ
సుప్రభాత సుందరుని లేలేత కిరణాలకి...
సుస్నేహ పవన మాలికల వీవనల స్పర్శకు...
సుఖ నిద్రా ప్రపంచంలోనుంచి ఇహలోకంలోకి బలవంతంగా వచ్చి...
సుముఖంగా ముఖ ప్రక్షాళన గావించి, సుమబాలలా స్నానించి...
సువాసనా భరితమైన ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్నా...
సుర్ సుర్ మని కాలుతున్నా, లెక్క చేయక, మధురమైన రుచిని ఆస్వాదిస్తూ...
గుర్తుండాలని ..!
మన జీవన ప్రయాణంలో ..
అర్ధ శతకం పూర్తి చేసుకున్నా...
వాడని వలపు పూవులకు ..
వీడని సువాసనలు..
ఎదలో పులకరింతల కవ్వింతలవుతున్నాయి..
సాగరం లాంటి సంసారాన్ని
అవలీలగా ఈదగలిగినాము..
ఒకరికి ఒకరం ఉంటూ...
ఒకటిగా మెసులుతూ..
అనుబంధాన్ని పటిష్టం
చేసుకున్నాము ఆది దంపతులమై..
కాలాలు మారినా...
సంవత్సరాలు గడిచినా...
యవ్వనం వీడి...
వార్ధక్యం మనకి చేరువయినా...
లాలిత్యమైన మన ప్రేమ
ఎప్పుడూ అమరమైనదే...
కడదాకా నీ కన్నుల నా మోము
నిలుచుండాలన్నదే నా ఆకాంక్ష..
కనిపించని ఆ దేవునికి
ప్రణమిల్లుతూ వేడుకుంటున్నా,,
మరు జన్మకీ ..
మూడుముళ్ళు వేసేటప్పుడు
కలిగిన నీ వెలి స్పర్స గుర్తుండాలని..!!