12, డిసెంబర్ 2014, శుక్రవారం

      ******బాల కార్మికులే కదూ !*****
      ఉమ్మడి కుంటుంబాలలో ..తాతయ్యతోచేరి ... కర్రాటలు...
      నానమ్మ పక్కలో దూరి.. అడిగి అడిగి చెప్పించుకునే..కాశిమజిలీ కథలు.
      పెద్దమ్మ పెట్టే పెసర బూరెలు , చిన్నాన్న తెచ్చే సీమచింతకాయలూ ....
      అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..అనుబంధాల అల్లికలలో..
      ఒంటబట్టించుకున్నఆప్యాయతలు.... అణకువల ఆదరణలు...
      ఏవి..?... ఏవి...? అని వెతుకులాటల వేదనలలో ..
      ఒంటరి అయిన బాల్యాలు..

      ఉంగాలతోనే..ఎ ఫర్ ఆపిల్ అని చెపుతూ...
      డైపర్లతో గాలాడనీయక ..సున్నిత ప్రదేశాలని మూసేస్తూ..
      తప్పటడుగులతోనే ...ప్లే స్కూల్ కి నడిపిస్తూ..
      అగ్గిపెట్టెల అపార్ట్మెంట్లలో..ఒకళ్ళని మించి కంటే..
      భారమని తలచే .న్యూక్లియర్ కుటుంబాలలో..
      వారి వారి ఆలోచనల సంకుచిత బుద్దిని ..
      పాలుగారు లేత మనసులపై రుద్దుతూ..తల్లితండ్రులు..
      భుజాన బస్తాల వంటి బ్యాగులు మోస్తూ..
      ఆటోలలో..ఇరుక్కుంటూ...
      స్కూలు బస్సుల్లో కూరుకుపోతూ..
      దూర దూరాలలోని కాన్సెప్ట్ స్కూల్స్ కని ..
      పరుగులు పెడుతున్న బాలలు..
      గ్రౌండ్ లేని బడులలో...ఇండోర్ గేమ్స్ అంటూ..
      ఇరుకు గదులలో..
      కంప్యుటర్లకి కళ్ళని అతికింపజేయిస్తూ..టీచర్లు.
      క్రమశిక్షణ పేరుతొ..ఎక్స్ ట్రా ష్టడిస్ అంటూ ...
      రోజుకు పన్నెండు గంటలు.. చదువులు..
      మట్టి కొట్టుకుంటూ..అంట్లు తోముతూ..
      పేడ పిసుకుతూ...పిల్లల్ని మోస్తూ..
      తనది కాని బ్రతుకు ఈడుస్తున్న ...ఈ.. బాలలు..
      అక్కరలేని బేషజాన్ని ప్రదర్శించే పెద్దల ఇగోలకు ..
      తనను తాను కోల్పోతూ....
      సారంలేని జీవితం గడుపుతున్న..ఈ.. బాలలు..
      చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న బాల కార్మికులే కదూ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి