12, డిసెంబర్ 2014, శుక్రవారం

    "వెతుకు తూనే ఉన్నా...!"
    ఎదగదిలోని..చీకటి కుహరంలో...ఉదయించిన ఒక ప్రశ్నకి
    సమాధానం కోసం తల్లడిల్లుతూ...నా చూపులు సారించినంత మేరా
    వెతుకుతూనే ఉన్నా..
    ...
    సముద్రం తన గర్భంలో చెలరేగిన కంపనాలకి
    అతలా కుతలమవుతూ...సృష్టిస్తుంది సునామీని...
    తన కెరటాలను ఉత్తుంగ తరంగాలను చేసి ఎగురవేస్తూ...
    ఆ బ్రహ్మాండమైన అలల చేతులతో భూమాతను ముంచి వేస్తూ...
    ఉప్పొంగి ఉరికిన నీటి ప్రవాహానికి, ఎల్లలు లేని వెల్లువకు...
    కొట్టుకొని పోయి అనాధ లయిన వాళ్ళు ఎందరో..
    ఆశ్రయం కోల్పోయి అలమటించే వాళ్ళు ఎందరో..
    సద్దు మణిగిన సమయాన అలవోకగా అందరికీ అశ్రయమిస్తూ ..
    భేదాలను మరచి...అందరూ తన వారేనంటూ...
    ఆ అంబుధియే ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది..
    విచక్షణ మరిచి విఝ్రుంభించిన గాలి సైతం ఉనికిని తెలుసుకొని ...
    ప్రాణ వాయువై...జీవకోటికి జీవం పోస్తుంది..
    ప్రకృతి ప్రవర్తనలో మార్పులు చేర్పులు...అత్యంత సహజాలు...
    కానీ మనిషికెందుకు....వీడని క్రోధాలు, స్వార్ధపు అహంకారాలు..?
    నీటి బుడగ లాంటి జీవితం కోసం అవసరమా నిజాల సమాధులు..?
    మానవత్వం మరిచినవాడు..అసలు మనిషి ఎందుకవుతాడు....?
    సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నా...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి