26, ఫిబ్రవరి 2018, సోమవారం

సంక్రాంతి సంబరాలు ...
హేమంతపు చలి కొరుకుడులు
లో లోనకి దూరి ..
చక్కిలి గింతలు పెడుతున్నా ...
తూరుపమ్మ ఎర్ర చీర సింగారించకుముందే ..
ఎగ దోసిన కుచ్చిళ్ళను ...
జారుతున్న పైటను లెక్క చేయక...
తమ వాకిలిలో ముత్యాల సరాల ముగ్గులు..
ఇంద్ర ధనుసును పోలే రంగవల్లికలు...
తీర్చి దిద్దలన్న తపనలతో..
విల్లై వంచిన నడుముతో ..
కొంటె గాలి ఊరకుండక...
మాటి మాటికి కురులను చెరిపేసే వంకన
చెక్కిళ్ళను ముద్దాడి పోతుంటే..
శంఖంలాంటి మెడను విదిలించి ..
నిదుర బారాన్ని వదిలించుకున్న కనులతో
ఉరిమి చూస్తూ...అంతలోనే ..
పెదవులపై నెలవంకను నిలుపుకుంటూ..
రెక్కల గుర్రం మీద వచ్చే రాకుమారుడు కాదు గాని..
రెక్కలున్న విమానం ఎక్కి వచ్చే
రాజశేకరుడు తన వాడే అన్న తపనల కలలను..
ఎదలోపల దాచుకుంటూ ..
సంక్రాంతి శోభను తమ ముంగిటిలో పట్టి బందించే..
ఆ పడుచుదనం అందాలను చూడ ..
ప్రకృతి సైతం స్తంభించిదేమో...
పందాలకై తయారయిన కోడి పుంజులు
ఇక ఒకటే గోల...కొక్కోరోక్కో అంటూ..
గుమ్మడి పూలను కొప్పున పెట్టుకుని
గొబ్బెమ్మలు పేరంటానికి వచ్చేసాయి..
నవదాన్యాల ఆభరణాలు ధరించి..
ఉత్తరాయణంలోనికి అడుగుపెడుతూ సూర్యుడు ..
తూరుపమ్మ ఎర్ర చీర విప్పే ప్రయత్నం చేస్తున్నాడు..
పల్లె సీమకు పట్టు కొమ్మ వలె సంక్రాంతి సంబరాలు ..
భోగిస్నానాలను చేసి ..అంబరాన్ని తాకుతూ ..
ఎగురుతున్నాయి గాలిపటాలై...ఆనందాల విందులతో...!!
**************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి