17, జూన్ 2018, ఆదివారం

అంతర్లీనం....
కలత నిదురలో మూసిన రెప్పల మాటున ..
అంతరంగాన్ని మధించి..ఆత్మతో సంయోగం చెందుతూ ..
ఆలోచనా తరంగాల అల్లికల దృశ్య మాలిక ..
తనేంటో తరచి చూసుకునే తరుణం ప్రతి మనిషిలోను ..
ఎదో ఒక శూన్యపు గుఱ్ఱపు డెక్కలు చప్పుడు చేస్తున్న
అలౌకికావస్తను హృదయం మోస్తున్నప్పుడు వస్తుంది..
తనవారు పగవారు అన్న తేడాలు తెలియని పసితనం
ఆకలికి నిద్రకి ఆగనిది ..సమయాసమయాలు తెలియనిదయి ..
అమాయకత్వానికి ఆయువు పట్టు నిస్తుంది..
ప్రాయంలోనికి చొచ్చుకొనిపోతూ వయసు ..
సృష్టిలోని రంగులన్నీ తనకోసమే అనుకునే ఊహలతో
శరీరాకృతిలో జరిగే మార్పులను స్వాగతిస్తుంది...
మనసుకు మనసు తోడైన మనిషి తనవారైతే..
ఆ జీవితం వెన్నెల నదిలో పున్నమి పూవుల నావపై
వాడని వలపు తొలకరుల ప్రయాణమే అవుతుంది ..
విధి వక్రించి ఒకరినొకరు అర్ధం చేసుకోలేని
సంసార బంధంలో చిక్కుకుంటే..
అనుక్షణం ఆత్మవంచనల పరితాపమే మిగులుతుంది..
గతంలోనికి జ్ఞాపకాలను పోగుచేస్తూ..
వర్ధమానం అర్ధం కాని అంతర్చేదనమవుతుంటే...
భవిష్యత్తును తలచుకోలేని ఆసక్తతతో నిర్లిప్తమైన దృశ్యమాలిక..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి