17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    ************కలంతో సేద్యం**************
    అన్నప్రాసన నాడు కలం పట్టుకున్న నన్ను చూసి..
    'నా బిడ్డ కలెక్టరు...అవుతుంది..' అని మురిసారట నాన్న..
    ఆ మురిపం తీర్చ ...కలెక్టరు నయితే అవ్వలేదు కాని.....
    కలం మాత్రం నా జీవనయానపు అడుగులలోని
    ప్రతి కదలికలకు లయగా నిలిచింది..

    'ఓం ' కారంతో మొదలయిన అక్షరాభ్యాసంతో ..
    'అ ఆ'లనుదిద్దిన బాల్యపు...వేళ్ళ చివరల్లో కలం చేరి..
    అక్షర విత్తనాలను పోగేసుకుంటూ..
    ఎదలోని భావాలకు ప్రతిరూపం ఇస్తూ..
    తానో హలం అయి సేద్యమే చేస్తుంది..
    కాగితాలపై...కవితల పంటలను పండిస్తూ...
    స్పందననెరిగిన ప్రతి కవిలోని అనుభవం ఇదేనేమో..
    అందుకే రామాయణ ..మహాభారత గ్రంధాలు..
    వేదాలు ...ఉపనిషత్తులు...అన్నీ...
    కలం చేసిన మహత్యాలే కదా..!
    నారాయణరెడ్డి రసభరిత గీతాలు ...
    శ్రీ శ్రీ గారి ఉత్తేజపూరిత గేయాలు..
    కరుణశ్రీ గారి పుష్పవిలాపం ఏది అయితేనేమి..
    దేవులపల్లి సరళ లలిత స్వరములేమి..
    ఏవైనా...ఎవరినయినా...
    కనుచూపుల కవ్వించాలన్నా....
    పదునైన కత్తిలా ఎదను చీల్చాలన్నా.....
    అది సాధ్యం ఒక్క కలానికే....
    ఇది లోకం ఎరిగిన సత్యం...
    ఆది ..అంతం లేని నిత్య నూతనమైన
    చరిత్రగా నిలిచి చిరస్థాయిని పొందేటంత నిజం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి