31, మార్చి 2016, గురువారం



వసంత రాజు..
మలయమారుత వీచికలతొ...తమ గుబాళింపులు కలబోసిన సన్నజాజులు
శిశిరంలో మ్రోడులైనా...ఆమని ఆగమనం సూచనగా లేత చిగురులతో..
స్వాగతసవ్వడి చేస్తున్నాయి...అరవిరిసిన గులాబీ బాలల అందాలతో కూడి..
మాఘంలో మావి చిగురు మేసిన కృష్ణవర్ణపు కోకిలమ్మ...
తన గాత్రంతో ప్రకృతికన్యను వివశురాలిని చేస్తుంటే.....
మంద్రగమనయి పచ్చనికొమ్మల తలలూపుతుంది పరవశంతో..
మధుర పానీయ చెరుకురసం...పనసతొనల తేనియసోనలు ...
ద్రాక్ష, ఖర్జూరాల తియ్యదనాలు...తర్బుజ వంటి అమృత ఫలాలు..
సూర్యుడు ప్రతాపం చూపిస్తూ ఉన్నా..మాధుర్యాలనందిస్తున్నాయి తమవంతుగా..
పండు మిరపకాయ, గోంగూరలతో..ఊరగాయలు ..బామ్మగారి పనయితే...
అమ్మ పెట్టే మాగాయ తాలింపు ఘుమ ఘుమలు ..డాబాపై..గుమ్మడి వడియాలు..
అద్భుతమైన రుచులతో...ఆస్వాదించ స్వాగతమే పలుకుతున్నాయి వసంతునికి..
చైత్రమాసం తొలిరోజు... తెలుగువారి సంవత్సరారంభానికి శుభ సూచకం ఉగాది ..
సాంప్రదాయ వస్త్రాలను దరించి దేవాలయాల కేగి..నమస్కారాలతో దేవుని దర్శించి.
ఆరు ఋతువులకు...ఆరురుచుల మేళవింపుతో కలగలిపిన ఉగాదిపచ్చడిని సేవిస్తారు..
ఉగాది దాటిన తొమ్మిదో రోజున చలువ పందిళ్ళ పానకాలు..వడపప్పులతో...
శ్రీ రామ నవమి వేడుకలు...కళ్యాణవైభోగాలు..ఎంతగా చూసినా తనివితీరని భక్తిరసాలు.
ముత్యాల తలంబ్రాలే కాదు...మేము ఉన్నామంటూ..చల్లగ కురిసే చిరుజల్లులు...
క్షణాల జారుడు మెట్లపై నుండి జారిపోతూ కాలం..తన చుట్టూ ప్రపంచాన్ని తిప్పుకుంటుంది.
తడబడని అడుగులతో...నడువగలిగినప్పుడే..బ్రతుకు దారి సుగమమవుతుంది..
అప్పుడే..ప్రతి మనిషి జీవితంలో...ఏ కాలమైనా వసంతం ..స్థిరనివాసమై..విలసిల్లుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి