12, డిసెంబర్ 2014, శుక్రవారం

    "జ్ఞాపకాల గాధనే "
    వీధరుగు మీద ..తాత ఒడిలో కూర్చుని
    గడ్డం పట్టుకు ఆటలాడుకున్నానట..
    అది ఎద సందూకంలో భద్ర పరుచుకున్న జ్ఞాపకం.. .
    ...
    అమ్మ చేత చీపురు పుల్ల దెబ్బ తగిలిన
    ముంజేతిపై..రక్తం మరక చూసి ..జేవురించిన నాన్న
    అమ్మని కేకలేసిన వైనం..అదో...అరుదైన జ్ఞాపకం..
    అమ్మ చేతి గాజు పగిలి..తనకి తగిలిన గాయం నుంచి
    వచ్చిన రక్తం ..మరక నా చేతికంటుకుందని తెలిసి...నాన్న .
    గారాబాన్ని .చూసి మురిసిన అమ్మ.. అమృతమైన జ్ఞాపకం....
    పందాలేసుకుని తాడాటలాడుతూ..అలసిన వేళ..
    కారం అటుకులు పంచుకుని తిన్న ..కేరింతల నవ్వుల.
    పసిమనసుల మాసి పోని మధుర జ్ఞాపకం..
    వేసవి సెలవుల్లో..పెళ్ళివారమైపోయి..
    అమ్మ పెళ్ళిలోని చెక్కబొమ్మలని ..అందంగా సింగారించి
    కొబ్బరాకుల బూరల బాకాలతో..వేపచెట్టు పందిరిలో..
    పప్పు బెల్లాల..పంచ భక్ష్యాల విందులతో..
    బొమ్మల పెళ్లి చేసిన ..ఓ పెద్దరికపు జ్ఞాపకం..
    వార్ధక్యపుటంచుల నిలిచినా..పుట్టింటి గారాల పాపనే..
    తిరిగిరాని కాలానికి ..మరోజన్మెత్తి ...మురియాలని..
    బాల్యపు శ్వాసల ఊయలలూగుతున్న..జ్ఞాపకాలగాధనే....!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి