8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఊగరా..ఊయల...
అమ్మ ఒడి ఊయల చేసి..
ఊగరా...ఊగరా...ఊయల..
నీలాల కన్నుల్లో 
నిండు చందమామ ..
నీదవును రా...
లాలి లాలి జో...రామ లాలి జో ..
కొంగు చాటున చేరి..
అమ్మ రొమ్ముతో కుస్తీలు పడుతూ..
బొజ్జ నింపుకొన్న బుజ్జి తండ్రి..
అరచేతిలో అమ్మ తాళిని బిగించి...
ఆదమరచి నిద్రించినావా చిన్ని తండ్రి..
నిదురలో గొంతు దిగని పాలు...
నీ పెదవుల దాటి బుగ్గలపై జారెనురా..చిట్టి తండ్రి..
లాలీ లాలి జో...రామా లాలి జో...
రాముడని అనుకోనా...
ధర్మమే చెప్పనా...
కృష్ణుడని అనుకోనా...
అల్లరులే సహించనా..
వాదాలకు తావివ్వని
వేదాలు నేర్పించనా...
అన్న....
అయోమయమెపుడు ఈ అమ్మది..
నీ ప్రేమ చాలు..
నీ ముద్దు చాలు..
అనురాగాల నీ స్పర్శ చాలు..
అచ్చంగా ...
నీవుంటే చాలు..చాలు..
అన్న భావమే..నీ కనుల కురిసేది...
ఉంగాలతో..... నీవు చెప్పేది..
ఇదే... భాగ్యమనుకుంటా...
ఇదే..స్వర్గమనుకుంటా..
నీకై జీవిస్తా..
నా నాన్నే నీవైనావని తలచి..
నీ అలనలో అన్నీ మరిచి..
నీకై శ్వాసిస్తా..
మృత్యువే నను చేరితే..
ఒక్క వరమే అడుగుతా..
“తిరిగి... నీవే నా నాన్న అవ్వాలని..”!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి