29, ఆగస్టు 2018, బుధవారం

నిశి రాతిరి జాడలో ...
ఊహలను దాటి ఊరించి నీవు
సూర్య కాంతిలోనూ
చుక్కలను చూపించినావు ..
మబ్బుపరదాల మాయ చేసి
ఏరినవన్నీ ముత్యాలేనని
మాలకట్టి మెడల వేసినట్టు బ్రమింపజేసినావు..
వలపు పాటల దోబూచులాడుతూ
మాటలతో బొండుమల్లెలు చేసి
గమ్మత్తుగ మత్తు మందు జల్లినావు ..
సొగసును చూసి వగలనుకుని
జాజి వంటి సుకుమారినని చూడక
ఎద పగులగొట్టి ఏటో వెళ్ళిపోయినావు ...
చిత్రంగా నీ సాక్ష్యంగా ..
ఈ నెమలి ఈక
నను వదలని నీడ అయింది ...
వానచినుకుల జడిలోనూ
నాటి కలలే నేటికీ
రెప్పల కింద నీటి చుక్కలయినాయి ..
పున్నమి వెన్నెల్లో విరిసిన
ఈ కలువలకి చెప్పనా...
తమ చెలునితో నిను వెతికించమని ..
నా శ్వాసలలోని సంగర్షణల
మోసుకెళుతున్న గాలితెమ్మెరలతో
నిను గాలించమని అడగనా...
మంద్రంగా సాగుతూ ..
మధురస్మృతులను లాక్కెళుతున్న
ఏటి తరగలతో కబురు పంపనా ..
నేరుగా నిను చేరుకోలేని అసక్తత ..
నీవు రావేమో అన్న అశాంతి ..
కల్లోలమవుతున్నది సంద్రమల్లె మది ..
ప్రాణసఖుడవని ప్రేమించినాను
ప్రియబాంధవుడవని పూజించినాను
ఆరాధనల అర్పణలు చేసి ..
వేయి కనులు లేవు కానీ ..
రెప్పల దోన్నెలలో ..
నింపుకున్న విరహాన్ని ఒంపలేక
తడబాటు మనసుతో
తడబడు అడుగులు వేయలేక
నిశి రాతిరి జాడలో వేచియున్నా నీకై ..!!
******************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి