29, ఆగస్టు 2018, బుధవారం

బోనం
ఇంటి ముందు కళ్ళాపి జల్లు
పచ్చని వాకిట్లో
చుక్కలను బంధించిన 
ముడుల అల్లికల ముగ్గులు ..
గడపలకు పసుపు కుంకుమ
బియ్యం పిండితో బొట్లు
మావిడాకుల తోరణాల
బంతిపూలదండల అలంకారాలు ..
ఆషాడ మాసపు
మేఘాల మెరుపులు
అప్పుడప్పుడు చిరుజల్లులు
ఉరుముల ఉరుకుల వానలు
దుక్కిదున్ని విత్తనాలు
జల్లు రైతన్నలు
చల్లంగా చూడమ్మా అంటూ
అమ్మలు అమ్మమ్మలు
ఆడబిడ్డలు
అమ్మోరి తల్లికి దండాలు పెట్ట
పసుపు బొట్లతో కొత్త కుండలో
పులగం నైవేద్యం పెట్టి
వెలిగించిన దీపంతో
బోనం చేసి తలపైకెత్తుకునే ...
మల్లమ్మ , ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ
ఎన్ని పేరులో అమ్మకి
చల్లంగ చూడుతల్లి ...
అమ్మా మాయమ్మ ...
భక్తితో పెట్టిన బోనం అందుకో
అభయమునిచ్చి అందరిని ఆదుకో ...
రంకెలేసే పోతురాజు చూడు
చెడును పారదోలా
కొరడాతో కొట్టుకునే
గజ్జెలు కట్టిన కళ్ళతో
చిందులు వేసేనమ్మ ...
అమ్మా మాయమ్మా ..
బంగారమడుగలేదు
వజ్రాలకాసలేదు
మెడలు మిద్దెలు
భోగభాగ్యాలనిమ్మనలేదు ..
తల్లీ ! ఏటికేడు నీ బోనం
ఎత్తుకునే బాగ్య మీయు తల్లి
చిటికెడు కుంకుమ చివరిదాక
కానుకీయు తల్లీ ...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి