17, ఫిబ్రవరి 2015, మంగళవారం


    * అమ్మని (ఆడపిల్లని) * అనే కవిత రాసి
    " ఉత్తమ ద్వితీయ కవిత" విజేతగా నిలచిన
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన .గారికి
    అభినందనలు...
    _/\_
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
    అమ్మని (ఆడపిల్లని)
    అమ్మ కడుపులో అంకురంగా నిలిచిన క్షణంలోనే..
    "అయ్యో!ఈ సారీ.. అమ్మాయి అయితే..ఎలా..." అనుకునే..
    భీతిల్లె అమ్మ హృదయ స్పందనలను చూసాను..
    పురిటి కందుగా..నాన్న నిరాదరణ చూపులకు గురి అవుతూ..
    నాన్నమ్మ అక్కసుగా మెటికిళ్ళు విరుస్తుంటే...
    బెదిరే అమ్మ కొంగు చాటు చేసుకుంటూ..అడుగులు వేసాను..
    అక్క విసిరి పారేసిన పాతగౌనులు వేసుకుంటూ..
    చిరిగి వేలాడే పుస్తకాలను ముందేసుకుని..
    'అ' అమ్మ ! అంటూ అక్షరాలు నేర్చుకున్నాను..
    పక్కింటి మామయ్య వెకిలి చూపులకు మర్మాలు తెలియక..
    బడికి వెళ్ళే దారిలో ...'జాంపండు రోయ్..' అని వినిపించే జులాయిగాళ్ళు
    బెదిరుతున్న నాకు.... కంటిచెమ్మతో..అమ్మ ఇచ్చిన ఓణి వేసుకున్నాను..
    పట్టు వదలక పదవతరగతి ఫస్టుగా పాసైనా..
    ఆడపిల్లకి ఇక చదువెందుకంటూ...ముప్పై ఏళ్ళ బావకి కట్టబెడితే ..
    కుడి కాలు ముందు పెట్టి ...అత్తగారింటి ఇల్లాలినయ్యాను...
    ఇంటెడు పని ఒంటి కాలిమీద చేసినా...ఆడబిడ్డ ఆరళ్ళను ..
    'ఒసేయ్..ఏమోయ్...' అనే...అవహేళనలను కంటి రెప్పలకిందకినెట్టి....
    నాలుగ్గోడల మద్య నలుగుతూ..పెదవంచున దుఃఖం దాచుకున్నాను..
    అమ్మనవుతున్నానన్న ఆనందం అనుభవించ నివ్వకుండా..
    స్కానింగ్లో ‘ఆడపిల్ల ‘ అని తెలుసుకొని...’అభార్షన్ చేయిస్తా ‘అన్న
    మొగుడి మాటలకి ..అణచుకోలేని ఆగ్రహంతో భద్రకాళినే అయ్యాను...
    నవమాసాలలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ..
    ఒడి చేర్చుకున్న చిట్టి తల్లిలి గుండెలకి హద్దుకుంటూ..
    అవసరాలకి ఆరిపోయే దీపం కాదు ఆడపిల్లంటే..
    ఆశయాల సాధనలో ఊపిరులను లెక్కచేయక ఎదురు నిలిచి..
    అభాగ్యులకు ఆలంబన అయిన ఓ కిరణ్ బేడి లానో..
    మహిళాభ్యుదయానికి శక్తి వంచన లేకుండా పాటుపడిన
    దుర్గాభాయి దేశ్ముఖ్ లానో..నా బిడ్డని పెంచుకుంటూ ..ఆత్మస్థైర్యాన్ని
    శ్వాస లో నింపుతూ... కల్పవృక్షమే ఆడపిల్లంటే అని నిరూపిస్తాను...!
    - సుజాత తిమ్మన .
    ***********************
    విజేతకు అభినందనలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి