29, ఆగస్టు 2018, బుధవారం


ప్రేమాంజలి !
హృదయం హృదయం తో
మాట్లాడుకుంటున్న వేళ
చూపులు చిక్కుబడి
కనుపాపల కలలు
కౌగిలించుకుంటుంటే 
స్తంభించిన కాలపు చెక్కిళ్ళపై 
అదురుతున్నఅధరాల ఆరాధనాశ్రువులు
తమని తాము అర్పించుకుంటున్నవి
.ప్రేమాంజలి ఘటిస్తూ ...!!

17, జూన్ 2018, ఆదివారం



జీవితం జీవించు ...
అమ్మే అడవని తెలిసినా ..
అమ్మ పాలుత్రాగి 
రొమ్మును గుద్దే పిల్లలల్లే...
అడుగడుగునా అవసరానికి 
మొక్కలపై ..చెట్లపై ఆదారపడుతూ..
జీవనం సాగిస్తూ ఉన్నా..
తమ ఆడంబరాలకు ..
సంపాధించాలనే ఆశలకు ..
పచ్చగా మహా వృక్షమై ఎదిగిన చెట్టును 
మొండంగా చేస్తూ ..
తెగ నరుకుతున్నారు ..
"మని "మత్తును తాగుతూ ..
మనిషితనం మరచి..
ప్రాణవాయువును అందించే 
అమృతమయి అమ్మలాంటి చెట్టును 
కనికరాన్ని కనీసవస్తువుగా వాడుకోక 
కృత్రిమత్వాన్ని ..వాతావరణ కాలుష్యాన్ని 
లోకానికి అందిస్తూ...చెట్లను తెగ నరుకుతున్నారు ..
ఓ మనిషీ...
ఎప్పుడైనా విన్నావా...
ఓ చెట్టు వినిపించే మూగ వేదనను ...
ఓ మనిషీ..
ఎప్పుడైనా కన్నావా...
ఆ చెట్టు బెరడుల్లోనుంచి ..
కారుతున్న గుండెకోత వ్యధను,,,
మానవత్వం మరచిన ఓ మనిషీ..
మాను అని మనసు లేదని అనుకోకు..
ప్రాణం తీయాలని నీవు చూసినా..
ఓ చిరుజల్లు కురిస్తే..
ఒకనాటి సూర్య కిరణాలు సోకితే..
మోడుగా మిగిలినా..
మరల మీకోసం చిగురులు వేస్తాను ..
కొమ్మలుగా విస్తరిస్తాను ...
తీసుకోవటం నీ నైజం ఐయితే..
ఎప్పటికి ఇవ్వటమే నా తత్వం ..
తెలుసుకో మనిషి ..
ఒక్క క్షణం నా గురించి అలోచించి 
జీవితం జీవించు...!! 
*************
ఒట్టు ..నా చిట్టి సెల్లు ..!!
నిన్ను చూస్తూ మాటలు
మరచిన మైమరపులో ..
ఉన్నానని అనుకుంటూ ఉంటారు..
అలా అనుకునే వాళ్ళు అందరు
ఉత్త పిచ్చివాళ్ళు...
ఆ దేవతల కాలంలో
కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళట ..
ఊహా మాత్రంగా తలచుకుంటే చాలు ..
అలా వాళ్ళు కావాలనుకున్న
చోటికి వెళ్ళిపోయేవాళ్ళట ..
తిరిగి టెక్నాలజీ పుణ్యమా అంటూ
ఆ దేవతల కాలం మళ్ళి వచ్చిందేమో ..
నీవు నా చేతిలో ఉంటే చాలు ..
నాకిష్టమైన వాళ్ళతో
మనసు తీరా మాట్లాడుకోవచ్చు ..
చిత్రాలను పంపించుకుంటూ..
ఇంకా కావాలంటే..
విడియో చాట్ ద్వారా
ఇద్దరం చూసుకుంటూ ..
దూరంగా ఉన్నాము అన్న
విరహాన్ని దూరం చేసుకోవచ్చు కదా..
అందుకే ..
అమ్మానాన్నల ప్రేమామృతాలకన్నా..
అన్నా అక్కల అనురాగం కన్నా...
స్నేహితుల ఆత్మీయ పలకరింపుల కన్నా..
ఇంకా చెప్పాలంటే..
గడియ పెట్టిన రూములో అయినా సరే..
నీవు ఒక్కదానివి నా
దోసిలిలో ఇమిడిపోయి ఉంటే...
చాలు,,,,చాలు....
ఎం తింటున్నానో...తెలియదు..
ఎం తాగుతున్నానో ..తెలియదు..
ఎం చిత్రమో...
నిద్రను దరి చేరనివ్వవు కళ్ళు ..
అంతిష్టం నిన్ను చూస్తూ ఉండటం ఈ కళ్ళకి..
అందుకే బంగారు...
ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకు...
రంగు రంగుల కవర్లను నీకు తొడుగుతా..
నా రాజసం నీవే అని లోకానికి చాటుకుంటూ...!
ఒట్టు ..నా చిట్టి సెల్లు ..!!
ఆత్మ రగిలించే
అగ్నిజ్వాలలో
కాలిపో ...
మనిషిలోని స్వార్థమా..!
మల్లెలా స్వచ్చంగా..
పరిమళాలతో ..
లేచిరా..
ఎదలోని మానవత్వమా...!
అంతర్లీనం....
కలత నిదురలో మూసిన రెప్పల మాటున ..
అంతరంగాన్ని మధించి..ఆత్మతో సంయోగం చెందుతూ ..
ఆలోచనా తరంగాల అల్లికల దృశ్య మాలిక ..
తనేంటో తరచి చూసుకునే తరుణం ప్రతి మనిషిలోను ..
ఎదో ఒక శూన్యపు గుఱ్ఱపు డెక్కలు చప్పుడు చేస్తున్న
అలౌకికావస్తను హృదయం మోస్తున్నప్పుడు వస్తుంది..
తనవారు పగవారు అన్న తేడాలు తెలియని పసితనం
ఆకలికి నిద్రకి ఆగనిది ..సమయాసమయాలు తెలియనిదయి ..
అమాయకత్వానికి ఆయువు పట్టు నిస్తుంది..
ప్రాయంలోనికి చొచ్చుకొనిపోతూ వయసు ..
సృష్టిలోని రంగులన్నీ తనకోసమే అనుకునే ఊహలతో
శరీరాకృతిలో జరిగే మార్పులను స్వాగతిస్తుంది...
మనసుకు మనసు తోడైన మనిషి తనవారైతే..
ఆ జీవితం వెన్నెల నదిలో పున్నమి పూవుల నావపై
వాడని వలపు తొలకరుల ప్రయాణమే అవుతుంది ..
విధి వక్రించి ఒకరినొకరు అర్ధం చేసుకోలేని
సంసార బంధంలో చిక్కుకుంటే..
అనుక్షణం ఆత్మవంచనల పరితాపమే మిగులుతుంది..
గతంలోనికి జ్ఞాపకాలను పోగుచేస్తూ..
వర్ధమానం అర్ధం కాని అంతర్చేదనమవుతుంటే...
భవిష్యత్తును తలచుకోలేని ఆసక్తతతో నిర్లిప్తమైన దృశ్యమాలిక..!!
సరి తూగే తూకం ..
సమానత్వమా...
ఎక్కడ నీవు..
స్త్రీ పురుష ప్రపంచంలో ..
సరితూగే తూకం అయినావా...
రాచరికపు రోజుల్లో అంతఃపుర కాంతలు ...
సర్వాలంకారాల సౌందర్య విరిబోణులయినా ..
మహారాజు పట్టపురాణులు కదా..
కాలు కిందపెడితే కందిపోవు సుకుమారిణులు కదా..
అయినా విద్యలన్నిటిని నేర్చిన అపర సరస్వతులే కదా..
ఆనాడు సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా...
ఇంటికి ఇల్లాలు అయిన పడతి..
అత్తమామల ఇంట కంటి దీపమై వెలుగుతూ ..
తానో సేవికగా సపర్యలు చేసినా..
మగని మనసెరిగి మెసులుతూ..
పిల్లాపాపలతో కళకళలాడే ఇంట
సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా ....
అమ్మాయి అబ్బాయి ఒక్కతీరుగా చదువుకుంటూ..
ఉద్యోగాలలోనూ ఒకరికి ఒకరు పోటీ పడుతూ ..
ఉన్నత స్థాయిలో రాణిస్తూ ..అహర్నిశలు సమయాన్ని
ఐదంకెల జీతానికై వెచ్చిస్తూ ..కుటుంబాన్ని భారం చేసుకుని
నేను భార్య..నేను భర్త ..అన్న ఇగోల నడుమ ..
సమానత్వమా..నీవు ...
సరితూగే తూకం అయినావా...!!
పక్షులు
ప్రకృతమ్మ ఒడిలో పుట్టి..
తమనే ఒక భాగంగా ప్రకృతిలో లీనం చేసి..
ఉదయ సంధ్యలను అనుభవిస్తూ..
కిల కిల రావాలతో తరాల అంతరాలను తట్టుకుంటూ
జీవనం సాగిస్తున్నాయి అనేక రకాల పక్షులు ..
గుబురు గుబురు చెట్లలో ..
కొమ్మలపై తమ గూళ్ళు కట్టుకుని..
ప్రేమ జంటలకు సాక్ష్యాలుగా
మురిపాలు పంచుకుంటూ గుడ్లు పెట్టి..
పొదిగి పిల్లలను ప్రేమతో పెంచుకుంటాయి పక్షులు ..
కాలాలకు..ఋతువులకు అనుగుణంగా
తమ జీవన విదానాన్ని మార్చుకుంటాయి..
అయినా ఒక్కోసారి హోరుగాలులు ...
ఎడతెరిపిలేని వర్షాలు..తుఫానుల తాకిడికి
తట్టుకోలేని అల్ప ప్రాణులు పాపం పక్షులు..
మనుషులే రాక్షసులై .. ..
స్వార్ధపు పొరలు కమ్మి ..
అవసరాలకు చెట్లను నరికేస్తూ ..
ఎన్నో మూగజీవాల ఆత్మఘోషలకు
కారణమవుతున్నారు ..
అడవులు మాయం అయిపోతున్నవి..
అదే స్థానంలో ఎత్తైన భవనాలు తాయారు అవుతున్నవి...
ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో
ఏ దూరతీరాలలో వలసపోతూఉన్నవి పక్షులు ..
అంతరించి పోతున్న పక్షిజాతిని రక్షించు కుందాం..
రెక్కలతో గాలిని అదుపు చేసుకుంటూ
వినువీధిని విహరించే ఆ విహంగాల చుట్టూ
మన ఆలోచనలు పరిభ్రమింపజేస్తూ..
మనము పక్షులమై పరవశించుదాం..!!