17, జూన్ 2018, ఆదివారం

అమె వనిత
బ్రహ్మ తన అంశను పంచి ఆడపిల్లగా మలిచాడు
అతని వంతు సృష్టి చేస్తుంది ఆమె వనితగా రూపు దిద్దుకుని
పూవులలోని సుకుమారత్వాన్ని ఆపాదించుకుని
ఇంద్రధనుస్సు రంగులలోని సౌందర్యాన్ని ఆణువణువూ అద్దుకుని
ధరణి తల్లి నుంచి వారసత్వంగా సహనాన్ని అందుకుని
అవతరించింది అమె వనితగా రూపు దిద్దుకుని
బాల్యంలో తల్లితండ్రుల చాటు పిల్లగా పెరుగుతూ
యవ్వనంలో పెళ్లి అన్న బంధంతో ముడివేసుకుని
తనవారిని పరాయి చేసుకుంటూ భర్త వెంట నడచి
అతనిగా మారిపోతుంది అమె వనితగా రూపు దిద్దుకుని
తాను అమ్మగా మారి తన పిల్లలకు జన్మ నిస్తుంది
వారి ఆలనలో పాలనలో అన్నీ మరిచి జీవిస్తుంది
ఆపద సమయంలో తనో ఆలంబనగా మారి
ఇంటిని కాపాడుకుంటుంది ఆమె వనితగా రూపుదిద్దుకుని
కత్తి పట్టిన వీరనారీమణుల గాధల్లోనూ చిరస్మరణీయం అమె
కలం చేతబూని కావ్య రచనలు చేసిన అక్షర సుమాలలోను అమె
ప్రజారాజ్య పరిపాలనలోను సాటిలేని మేటి అమె
అబలని అలుసు మాని గుర్తించు ఆమెని
పూర్ణత్వాన్ని నింపుకున్న వనితగా ...
బహు రూపాల రూపసి అమె వనిత ...!!


చిన్ని ప్రపంచం ..
చీకటి చెరలో చిక్కిన సూరీడు
ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయి 
ముడుచుకు పోయిన తన కిరణాలను విప్పారిస్తూ ..
ఆ చెరని చేధిస్తున్నాడు జేగురురంగు మొహం వేసుకుని ..
ఆ బాల భానుని ఒడిలోకి తీసుకుంటూ ..
తూరుపమ్మ ఓదారుస్తుంది ఓపికగా..
చిన్ని పంజరం అయినా..
యజమానులు వేసిన దానాను 
పంచుకుని తింటూ..
ఎన్ని గుస గుసలో..
ఎన్నెన్ని ఊసులో ..
ఇతరులకు ఎవరికీ అర్ధం కానివి 
మూడు సంవత్సరాలు 
ఇతర ప్రపంచం ఎరుగవు ఆ జంట పక్షులు 
కాలం ఏ జంటను అయినా విడదియక మానదు ..
పాపం ..
తెలియని జబ్బు చేసి ఓ రోజు 
అలా తన దేహం వదిలి వెళ్ళిపోయింది ఓ పక్షి ..
తన జోడు ఎందుకు పలకటం లేదు 
అన్న అయోమయంలో మరో పక్షి..
హృదయం నీరై ..రోధిస్తుంది..
ఈ దృశ్యం చూసిన ఆ చేయి ..
"వెళ్ళు నేస్తం ..
ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది..
వీనీల ఆకాశంలో స్వేచ్చగా విహరించు ..
నీలో దాగిన ఈ భాదను మరచి ..
వింత వింత విచిత్రాలను చూస్తూ ..
నిన్ను నీవు కాపాడు కుంటూ ..
నీ పయనం సాగించు నేస్తం .."
అంటూ ఆ పంజరాన్ని తెరిచి పట్టుకుంది..
ఈ చిన్ని పంజరమే తన మహలు గా ఎంచిన ఆ పక్షి 
ఎటు పోవాలో తోచక ఎగర లేక ఎగురుతుంది...
అదిగో...!!

విడివడిన కురులను లెక్కచేయక..
దారంతా పరుచుకున్న గులకరాళ్ళను ...
అక్కడక్కడా చేరి నిలిచిన ముళ్ళ పొదలను
చూసుకోక రక్తసిక్తమైన పాదాల అడుగులతో ..
నిలువలేని ప్రాణాన్ని చిక్కబట్టు కుంటూ..
పరుగు పరుగున వచ్చి చేరితిరా కృష్ణా...
నీ బాహువులలో బందీగా నిలచిన ఈ క్షణం
ఇలా స్తంబించిపొతే ఎంతబాగుండు..
ఏ చిత్రకారునుని కుంచె నుంచి జాలువారిన చిత్రంలా...
ఏ శిల్పి ఉలితో చెక్కిన శిల్పంలా...
చిరస్తాయిగా..అమరమై నిలిచిపోతే...చాలు కృష్ణా..


ఎన్ని అందాలో 
మన ఆనందాల వెన్నెల్లో..
అవి అన్ని కాలంతో పాటే 
మనకు సొంతమైనాయి 
ముదిమి వయసులోనూ 
ముచ్చటలను తీరుస్తూ..

కన్నులు కమలాలయినవి ..
నీ చూపులే భానుని కిరణాలనుకుని..
. శ్రీ లక్ష్మి ఆసనం కమలమే..
శ్రీనివాసుని ఎదపై చేరి నిలిచినది..
కొలనంతా విరిసిన కమలాలు ..
చుట్టూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భ్రమరాలు ..
ఎందుకో..
హృదయం అంత సముద్రమై పొంగుతుంది ఎందుకో
మూన్నాళ్ళ ముచ్చటే జీవితమని తెలుపుతుంది ఎందుకో
పూవు పూవు పై వాలుతూ తుమ్మెద
మధువంత తాగి పూవునూ మరుస్తుంది ఎందుకో ..
మావి చిగురు మేసినా గండు కోయిల
కుహు కుహు రావాల పలకకుంది ఎందుకో ..
పున్నమి చంద్రుని వెన్నెలని దోచుకొన్నా గోదారమ్మ
వేదనల ఉప్పెనలతో ఉరుకుతుంది ఎందుకో ..
ఏ మమత కోసమో మూగదైనా మనసు
ఎదురు చూపుల వర్షాన్ని కురిపిస్తుంది ఎందుకో..
శీర్షిక : "రంగస్థలం "
గ్రీష్మ తాపానికి నెర్రెలిడిచిన నేలమ్మ
ఆవిరవుతూ ఆశగా చూసింది నింగివైపు 
ఏ సంతోషమో గాని గగనతలంలో గాలి
ఈవల ఆవల మబ్బులన్నిటిని ఒకటిచేస్తూ .
హోరు హోరున ఈలలు వేస్తుంది..
నాట్యాలు చేసే మేఘాలకి పోటీలెక్కువైనాయేమో
పోట్లాటలకు దిగి భీబత్సవం సృష్టిస్తున్నాయి ..
ఇదే అదునని మెరుపుకన్నెలు అందాలారబోస్తున్నాయి ..
రంగస్థలమైన ఆకాశం నుంచి చప్పట్ల చినుకులు ..
చిటపటమంటూ చేరి ధరణిని ముద్దాడుతున్నాయి..!!