29, సెప్టెంబర్ 2015, మంగళవారం

నా చెలికాడు...
రమ్మని చెప్పిన చెలికాడు
'రవళి ...నీకోసం నేనున్నా..అంటూ..
రవ్వల లోలకులు తెస్తాడు అనుకున్నా.
రంగుల సినిమా చూపిస్తాడనుకున్నా...
రహస్యం... అని చెవిలో ..గుసగుసలు చేపుతాడనుకున్నా...
రవిక బిగువులదాచిన వలపులు దోచుకుంటాడనుకున్నా..
రసాత్మకపు తేనెలనందిస్తాడనుకున్నా..
రవి అస్తమించే సమయమవుతున్నా...
రమణీయ మయిన ప్రకృతి ..
రతీమన్మధులకు స్వాగతం చెపుతున్నా..
రవ్వంత కనికరం చూపక వెన్నెలరేడు పున్నమి కన్ను గీటుతున్నా..
రగిలే ఎదలో సెగలు రేపుతూ.. రాడాయె ఎంతకీ ...నా చెలికాడు....!!
************సాయి స్వరూపం.*************
'గు' అంటే అజ్ఞానం 'రు' అంటే పోగెట్టే వాడు...
సద్గురువు గా నిలిచిన... సాయి
ఆ అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలుతూ..
మనిషిగా అన్ని కర్మలను అనుభవంలో చూపిన
మహిమాన్విత దైవ స్వరూపం సాయి..
బడభాగ్నుల మంటల్లో కాలిపోతూ..
ఒక్కసారి 'బాబా' అని అర్ధిస్తే చాలు..
చల్లని హస్త స్పర్శను అందించి..
సుగమనమయిన మార్గంలో నడిపించెదరు సాయి...
మన పాపాలను చిలిము త్రాగుతూ.... తాను గ్రహించి..
నిరతాగ్నిహోత్రమయిన ఆ 'ధుని' తో..
పదకొండు నిత్య సత్య సూక్తులతో..
దీనజనోద్దారణ గావిస్తూ...భక్తవత్సలుడైన సచ్చిదానందుడు సాయి..
అమ్మలా ఆదరించిన బజియాబాయి తనయుడు తాత్యా కోసం..
తన ప్రాణాలను పణంగా పెట్టి...జీవసమాధి అయి..
శరణమన్న వారికి ..నేటికి 'నేనున్నా...మీకోసం..'
అంటూ ఆపదల గాస్తూ..నిదర్శనం చూపుతున్న నిరాకార సత్యమే.. సాయి...
దత్తాత్రేయుని అయిదవ అవతారమయి అవధూత గా ఇలచేరిన ..
త్రిమూర్తుల ఏకత్వమై..స్మృతిమాత్ర ప్రసన్నుడు.. నిత్యుడౌ షిరిడీ సాయి...!


గోవిందా....గోవిందా...

గోవిందా అని తలచిన చాలు..
ఆ శేషాద్రి నిలయుడు..
వేగిరమే వచ్చి నిలచును మనమున..
ఆపదల గాచి ...అభయమునోసగి..
కనుపాపలవోలె కాపాడునులే.....కాపాడునులే...//గోవిందా//
నీలాల ముడుపులే కట్టించుకొని..
మనసును నిశ్చలమే చేయునులే..
కలతలతో ఎద కలచివేయు తరుణాన
కరుణాకటాక్షాల వర్షాలే కురిపించునులే...కురిపించునులే...//గోవిందా//
ఏడు కొండలపైన కొలువైనా.. వాడు..
కొలిచేవారిని..ఎన్నడూ...కినుక చూపడు..
కష్టాలు కన్నీటి సంద్రాలవు వేళ..
కోటి ప్రభలస్వామి..వెలుగులే తానవునులే..తానవునులే...//గోవిందా//
*************అదే అమ్మ ..**************
గర్భాశయాన్ని కంచుకోటగా మలచి..
తన రక్త మాంసాలతో శరీరాకృతిని ఇస్తుంది అమ్మ..
నెలలు నిండి పురిటి నొప్పులు నీవిస్తే...
జన్మ నిచ్చి ...అక్కున చేర్చుకుంటుంది అమ్మ..
ఆకలితో నీవేడవకుండానే..తన స్తన్య మిచ్చి
పాలు పడుతూ.. నీ బొజ్జ నింపుతుంది అమ్మ...
ఉంగా ఉంగాలతో..నీవు చొంగ కారుస్తూ ఉంటే...
అనురాగ లాలనల చెరగుతో నీ పెదవులు తుడుస్తుంది అమ్మ..
అడుగులు కదపలేని నీ అసహాయతకు తను ఊతమై..
తప్పటడుగులు పడనీయకుండా నడిపిస్తుంది అమ్మ..
అత్తత్త...అంటున్న నీ నత్తి మాటలకు .
మురిసిపోతూ..సరి చేసే భాషల నేర్పిస్తుంది అమ్మ..
అ ఆ ల అక్షరాభ్యాసంతో మొదలైన నీ భవిష్యత్తుకు
తాను పునాధిగా నిలిచి ...నిన్ను ఉన్నత శిఖరాన నిలపెడుతుంది అమ్మ..
నీలోని ప్రతి సంగర్షణని తన గుండెలో దాచుకొని...
అవలీలగా ఆలోచనల తీరాన్ని దాటించేయిస్తుంది అమ్మ..
శరీరం ముడుతలు పడి...శుష్కించి పోతున్నా...
ఎదురు చూపులు నీకోసమే..."బిడ్డ ఎట్లా ఉన్నాడో " అని...అదే అమ్మ
మట్టి గాజులు
ఆడవారికి ప్రీతి కరమైన
అలంకారమగు ఆభరణాలలో ....
అతి ముఖ్యమైనవి గాజులు...
ప్రాచిన కాలం నుంచీ ...
సంప్రధాయ పరపతిని మోస్తున్నా
నిత్య నూతన కళలతో భాసిల్లుతున్నాయి గాజులు.....
దేవతా స్త్రీలు..రాక్షస వనితలు..
మట్టి మోసే మగువలు....మహారాణులు అనే
భేదాన్ని తెలియనీయనివే....గాజులు..
వజ్ర వైడుర్యాలను ఒదిగించుకున్నా..
మేలిమి బంగారు ఛాయలతో మెరిసిపోతున్నా..
అన్నిటినీ మించి గీటుగా నిలిచేవే రంగు రంగుల మట్టి గాజులు..
ముత్తైదు తనంలో ముగ్ధముగా నిలిచి ..
పెళ్లి నాటి ప్రమాణాలని తన చిరు సవ్వడుల
మగనికి తెలియజేస్తూ..మురిపాలు పంచేవే గాజులు..
ఏసువి నీవు..
పరమేశువి నీవు..
ఫకీరు నీవు...
ప్రకృతిలోని ప్రతి అణువు నీవే...నీవే....
సాయి...ఓం సాయి...
జగతికి జీవం..పోస్తూ..
పర లోకపు సారం తెలుపుతూ..
అజ్ఞానపు చీకటిని తరిమి కొడుతూ..
జ్ఞాన జ్యోతిని మదిన వెలింగిచే..
సద్గురువువు నీవే..నీవే...
సాయి....ఓం సాయి...
మతములకు దొరకని
మహిమవు నీవు..
మహిలో మానవతనే
నిలిపిన మహనీయుడవు నీవు
అయినా,,,నిర్మలమైన రూపంతో..
మసీదు నివాసిగా నిలిచినావు..
నిను తలచేవారి ఎదలో కొలువైనావు...
సాయి...ఓం సాయి...
మా తాత ...
కంటి తడిలో
ఆరని కణం అయి
జ్ఞాపకాల గదిలో 
బందీగా నిలిచారు మా..తాత.
వేస్తున్న ప్రతి అడుగుకు ..
చేస్తున్న ప్రతి పనికి ..
పలుకుతున్న ప్రతి పలుకుకు.
ఇంటికి దూలమల్లే..
బ్రతుకు సారం తెలిపి..
జీవన గమకానికి
ఆయువుగా నిలిచి..
నా గురువైనారు మా.. తాత
నా ఉంగాలతో ...
తను కేరింతలు కొట్టే వారట..
నా తప్పటడుగులకు ..
తను తడబడి నడిచేవారట..
బడికి నాతొ పాటూ..
పుస్తకాల సంచి మోస్తూ
తనూ వచ్చేవారట..మా ,,తాత.
కళాశాల రోజుల్లో..
రావడం ఆలశ్యం అయిన క్షణాలలో..
వీధి చివరికంటా వచ్చి .
చిప్పిల్లిన చూపులతో..
ఆరాటంతో వణుకుతున్న శరీరంతో
'పాప ఇంకా రాలేదేమి ' అనుకుంటూ..మా తాత..
అప్పగింతలతో పాటూ..
ఆశిస్సులు అందించి..
దూరం అవుతున్నానన్న బెంగ తో.
మంచాన్ని ఆశ్రయించి...
'నీ కడుపున పుడతానమ్మా..'
అంటూ గాజుకళ్ళతో మూగగా చెప్పి
తాను నిర్జీవమై దైవంలో కలిసిన మా తాత...!
...........__/\__................నివాళులతో...