17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    పెప్పర్ స్ప్రే తో...!!
    "అమ్మా ..నేను కాలేజికి వెళ్ళను...
    ఇక చదువు మానేస్తా..."
    అని ఆనాడే చెప్పిన కూతురు మాటలకి...
    ఇసుమంతైనా విలువనివ్వలేదాయె...

    కళ్ళు మూసుకు పోయిన కర్కశత్వం
    గెలుపు సాధించాలనే మూర్ఖత్వం
    పసిడి తనాన్ని భగభగలాడించింది..
    ఆడపిల్ల ఆక్రోశం ..అగాధాలలో అల్లాడుతుంది..
    తప్పెవరిదంటూ తరచి చూసుకుంటూనే ఉన్నాం..
    అయినా రోజూ జరుగుతూనే ఉన్నాయి..జరిగే ఘోరాలు..
    అమాయకత్వం వీడి...మన అమ్మాయిలంతా ...
    తమని తామే కాపాడు కోవలె...చెంత పెప్పర్ స్ప్రే తో...!!
    జ్ఞాపకాల గాధనే "
    వీధరుగు మీద ..తాత ఒడిలో కూర్చుని
    గడ్డం పట్టుకు ఆటలాడుకున్నానట..
    అది ఎద సందూకంలో భద్ర పరుచుకున్న జ్ఞాపకం.. .
    ...
    అమ్మ చేత చీపురు పుల్ల దెబ్బ తగిలిన
    ముంజేతిపై..రక్తం మరక చూసి ..జేవురించిన నాన్న
    అమ్మని కేకలేసిన వైనం..అదో...అరుదైన జ్ఞాపకం..
    అమ్మ చేతి గాజు పగిలి..తనకి తగిలిన గాయం నుంచి
    వచ్చిన రక్తం ..మరక నా చేతికంటుకుందని తెలిసి...నాన్న .
    గారాబాన్ని .చూసి మురిసిన అమ్మ.. అమృతమైన జ్ఞాపకం....
    పందాలేసుకుని తాడాటలాడుతూ..అలసిన వేళ..
    కారం అటుకులు పంచుకుని తిన్న ..కేరింతల నవ్వుల.
    పసిమనసుల మాసి పోని మధుర జ్ఞాపకం..
    వేసవి సెలవుల్లో..పెళ్ళివారమైపోయి..
    అమ్మ పెళ్ళిలోని చెక్కబొమ్మలని ..అందంగా సింగారించి
    కొబ్బరాకుల బూరల బాకాలతో..వేపచెట్టు పందిరిలో..
    పప్పు బెల్లాల..పంచ భక్ష్యాల విందులతో..
    బొమ్మల పెళ్లి చేసిన ..ఓ పెద్దరికపు జ్ఞాపకం..
    వార్ధక్యపుటంచుల నిలిచినా..పుట్టింటి గారాల పాపనే..
    తిరిగిరాని కాలానికి ..మరోజన్మెత్తి ...మురియాలని..
    బాల్యపు శ్వాసల ఊయలలూగుతున్న..జ్ఞాపకాలగాధనే....!!
    న్యాయం..
    సత్యం అనే పదానికి అర్ధ్తం తెలుసుకోలేని వ్యవస్థ..
    స్వార్ధ రాజకీయ చదరంగంలొ పావులాగా మారి..
    గంతలు కట్టుకున్న న్యాయదెవతని పూర్తిగా కబొధిని చేసింది..
    ...
    కాలాలతో పాటూ మారుతున్న చట్టాలు...
    భారతీయ సంస్కృతిని మరుగున పడేస్తూ..
    విసృలంకత్వాన్ని పెంచేస్తున్నాయి..
    దనవంతుల ఖజానాల్లొ డబ్బు మూలుగుతున్నట్టే..
    ధర్మం ...చలిజ్వరం వచ్చిన రోగిలాగా...
    కంబళి కప్పుకుని సొమ్మసిల్లి పడుకుంది..కదలక మెదలక..
    సాక్ష్యం అవసరాలకనుగుణంగా మారిపోతూ..
    పాదరసమై..జారిపోతుంది....అధికారుల హస్తాలలోనికి.
    చివరికి న్యాయం నిర్ధయయై..నిర్ధోషిని కటకటాలలోనికి నెట్టుతుంది..
    నడిరేయి ఏ జాములో...
    'నడిరేయి ఏ జాములో '
    జానకమ్మ గాత్రంలోని
    మాధుర్యాన్ని ...
    నగవుల రేడు ..
    ఏడుకొండల వాడు
    ఆసాంతం ఆస్వాధిస్తూ....
    నచ్చి మెచ్చిన శ్రీదేవిని
    ఎదపై నిలిపినాడని..
    నన్ను కానటంలేదని..
    అలుకలు పోయిన
    అలివేలు మంగకి .
    నడుమ నలిగే.
    .శ్రీవారు..
    దిక్కుతోచని స్తితిలో...
    నల్లరాయిగా మారి..
    కదలని శిల ఆయినారే...
    అయినా..
    నన్ను కొలిచే వారి
    కొంగు బంగారమేననే స్వామికి ..
    నన్ను నేనుగా
    సమర్పించు కొందుకు..
    నడిసముద్రంలాంటి ...
    ఈ బ్రతుకునుదాటలేక
    నట్టనడుమ నలిగి నలిగి..
    శ్వాసాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నా....!

    See More
    అమ్మలకే అమ్మవి...
    అమ్మలకే అమ్మవి ...
    జగదంబవి...
    ముల్లోకాలను ఏలేటి.....
    మూలకుటమ్మవి..
    అభయహస్తమిచ్చి అన్నివేళలా..
    ఆదుకునే...అన్నపూర్ణవి...//అమ్మవి//

    పతిదేవునిలో సగభాగమై..
    ఆలుమగల అనుబంధానికి ప్రతిరుపమైనావే..
    మంచు కొండల మీ నివాసమైనా..
    వెచ్చని వలపుశ్వాసల ఊపిరులనిస్తూ..
    పరమేశ్వరుని ఇల్లాలివైనావే..
    పార్వతిగా పాపాల హరించే పరమ పావనివి ..//అమ్మవి//
    బెజవాడ కనకదుర్గవైనా..
    శ్రిశైలంలోని బ్రమరాంభికవయినా..
    పద్దెనిమిది శక్తి పీఠాల మహా శక్తివే..
    సౌందర్యలహరిలొ ఆవాహనమైనావె..
    .అర్చనల ..ఆరాధనల సంతుష్టివే...
    సహస్ర నామ సముదాయనివి.....//అమ్మవి//
    +++ఆరాధన ++++
    నీ మదిలో మెదిలే భావాలను
    చదవలేని గుడ్డిదానినైతిని ఇన్నాళ్ళు ..
    నా ఎద ఊసులు తెలుసుకోలేక
    చక్రమల్లె.. జీవనంలో తిరిగాను ఇన్నేళ్ళు..
    ...
    హృదయకుహరంలో..ఏ మూలో దాగిన నీ తలపు..
    మంచును వీడిన మంచి ముత్యమల్లే నిలిచి..
    శ్వేతవర్ణ కపోతమై.... వలపుల గులాబీనందిస్తూ..
    నా మది గడియ తీయమని .. తలుపు తడుతుంది....
    ఉశ్వాస ..నిశ్వాస కదలికలలో..ఉపిరివై..
    ఆరాధనలలో ఆలింగనమైనావు ..
    అక్షర సాక్షిగా...అమరమైన ప్రేమకు..
    నిదర్శనమై అణువణువూ ..అర్పిస్తున్నా..సంసేవితనై..!!

    * అమ్మని (ఆడపిల్లని) * అనే కవిత రాసి
    " ఉత్తమ ద్వితీయ కవిత" విజేతగా నిలచిన
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన .గారికి
    అభినందనలు...
    _/\_
    కవయిత్రి శ్రీమతి సుజాత తిమ్మన గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
    అమ్మని (ఆడపిల్లని)
    అమ్మ కడుపులో అంకురంగా నిలిచిన క్షణంలోనే..
    "అయ్యో!ఈ సారీ.. అమ్మాయి అయితే..ఎలా..." అనుకునే..
    భీతిల్లె అమ్మ హృదయ స్పందనలను చూసాను..
    పురిటి కందుగా..నాన్న నిరాదరణ చూపులకు గురి అవుతూ..
    నాన్నమ్మ అక్కసుగా మెటికిళ్ళు విరుస్తుంటే...
    బెదిరే అమ్మ కొంగు చాటు చేసుకుంటూ..అడుగులు వేసాను..
    అక్క విసిరి పారేసిన పాతగౌనులు వేసుకుంటూ..
    చిరిగి వేలాడే పుస్తకాలను ముందేసుకుని..
    'అ' అమ్మ ! అంటూ అక్షరాలు నేర్చుకున్నాను..
    పక్కింటి మామయ్య వెకిలి చూపులకు మర్మాలు తెలియక..
    బడికి వెళ్ళే దారిలో ...'జాంపండు రోయ్..' అని వినిపించే జులాయిగాళ్ళు
    బెదిరుతున్న నాకు.... కంటిచెమ్మతో..అమ్మ ఇచ్చిన ఓణి వేసుకున్నాను..
    పట్టు వదలక పదవతరగతి ఫస్టుగా పాసైనా..
    ఆడపిల్లకి ఇక చదువెందుకంటూ...ముప్పై ఏళ్ళ బావకి కట్టబెడితే ..
    కుడి కాలు ముందు పెట్టి ...అత్తగారింటి ఇల్లాలినయ్యాను...
    ఇంటెడు పని ఒంటి కాలిమీద చేసినా...ఆడబిడ్డ ఆరళ్ళను ..
    'ఒసేయ్..ఏమోయ్...' అనే...అవహేళనలను కంటి రెప్పలకిందకినెట్టి....
    నాలుగ్గోడల మద్య నలుగుతూ..పెదవంచున దుఃఖం దాచుకున్నాను..
    అమ్మనవుతున్నానన్న ఆనందం అనుభవించ నివ్వకుండా..
    స్కానింగ్లో ‘ఆడపిల్ల ‘ అని తెలుసుకొని...’అభార్షన్ చేయిస్తా ‘అన్న
    మొగుడి మాటలకి ..అణచుకోలేని ఆగ్రహంతో భద్రకాళినే అయ్యాను...
    నవమాసాలలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ..
    ఒడి చేర్చుకున్న చిట్టి తల్లిలి గుండెలకి హద్దుకుంటూ..
    అవసరాలకి ఆరిపోయే దీపం కాదు ఆడపిల్లంటే..
    ఆశయాల సాధనలో ఊపిరులను లెక్కచేయక ఎదురు నిలిచి..
    అభాగ్యులకు ఆలంబన అయిన ఓ కిరణ్ బేడి లానో..
    మహిళాభ్యుదయానికి శక్తి వంచన లేకుండా పాటుపడిన
    దుర్గాభాయి దేశ్ముఖ్ లానో..నా బిడ్డని పెంచుకుంటూ ..ఆత్మస్థైర్యాన్ని
    శ్వాస లో నింపుతూ... కల్పవృక్షమే ఆడపిల్లంటే అని నిరూపిస్తాను...!
    - సుజాత తిమ్మన .
    ***********************
    విజేతకు అభినందనలు