17, జూన్ 2019, సోమవారం

అధ్యాయం *********
నిరాకార తత్వానికి సాకారాన్ని
నింపుకున్న సత్యమే జీవితం
తల్లిగర్భంలో పిండాకృతిని దాల్చిన
జీవానికి రక్షణ కవచంగా నిలిచిన గర్భాశయం
కాళీ అధ్యాయాల బ్రతుకు పుస్తకాన్ని
ముందు ఉంచుతుంది ఊపిరి తీసుకున్న క్షణంలోనే ..
జనన కాల పరిమితులకు
నక్షత్ర స్థితిగతులననుసరిస్తూ
అధ్యాయం మొదలవుతుంది
తల్లిపొత్తిళ్లలో వెతుక్కునే చనుబాల పోరాటంతో ..
మనిషి కనిపెట్టిన విజ్ఞానం
మృత్యువుని శాసించలేని బేలయింది
పుట్టుకతోనే లిఖించుకొచ్చుకున్న ఆయువుతో
మరణాన్ని కౌగలించుకొని పరిసమాప్తమవుతుంది అధ్యాయం ..!!
మధుర భావాలు
మనోహరమైన వేళ
నాట్యమాడుతుంది మనసు
పురివిప్పిన నెమిలై
జ్ఞాపకాల చిట్టా విప్పి
అరచేత చేర్చుకుంటుంది
ఆ స్పర్శల ఆలింగనాల
వొదిగుటుంది మైమరపై !!
 "పసిడాభిషేకాలే "
వయసుతో వచ్చిన మార్పుల్లో
దాగివుంటుంది పెద్దరికం శరీరపు ముడుతల్లో
ఎన్నెన్ని ఆలోచనల అనుభవాలో
శూన్యపు చూపుల సారాలో గాజుకన్నుల్లో
మారిన విలువలను మారని కాలాలలో
వెతుక్కుంటున్నవి శుష్కిస్తున్న బ్రతుకుల్లో
ఏమార్చి చూసుకోండి పసినవ్వులలో
పెద్దరికానికి పసిడాభిషేకాలే ఆ లేతపలుకుల్లో ! !
 "నరకకూపమైంది నగరం ."
నాగరికతని పరదాగా వేసుకుని
వివస్త్రగా మారి విచిత్ర నాట్యం
చేస్తోంది వింతపోకడల నగరం ...
పగలు రాత్రి తేడాలను మరచి
స్త్రీ పురుష భేదాలను విడిచే
వికృత ప్రకృతికి ఆవాసమైంది నగరం
శిక్షలకు నెరవని నేరాల వికటాట్టహాసాలు
ఆడపడచుల ఆర్తనాధాలతో నరకకూపమైంది నగరం ..!
లేత మనసు
మూడేళ్లు నిండని పసివాడు ..
ఆకలి తెలియదు కానీ అల్లరివాడు
నేల తల్లి ఒడిలో జోగాడుతూ ..
మట్టి పులుముకున్నా
యవ్వారం తెలియని వాడు
ఆటల్లో ఆకతాయి తనం అయినా
ఇదంతా తనదే రాజ్యం అన్న ధీమా
తరగని పౌరుషం తో కూడిన రాజసం
.'సింహాసనం ఇటుకలదయితే ఏంటి ..
నేనే బాహుబలిని ..
ఈ రాజ్యం అంతా నాదే '
అనుకునే లేత మనసుగల పసివాడు ..
మనిషి ఎదగ కుండా అలా
పసివాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు
నీది నాది అన్న తేడాలు .
పేద గొప్ప అన్న బేధాలు ..
ఇవేమి లేని కల్మష రహిత జీవితం
అందరి సొత్తు అయేది కదూ ..!
నా అన్నదానికి
నిర్వచనమైన నాన్న
నలుగురిలో అత్మ బలాన్ని
అందించు నాన్న
ఆకలి కడుపుకు
గింజలేరుకోవడం నేర్పు నాన్న
పసితనాన్ని భుజాలపై మోసినా
వయసుడిగిన రోజు భుజంకోరు నాన్న! !

అమృతకలశం "
పూవులలోని మధువునంతా
ఎంతగా తాగినాయో ఈ పెదవుల తుమ్మెదలు
తేనె బరువుకు వాలిపోతున్న రెక్కలవోలె
ఒంపులు తిరుగుతూ మైమరస్తున్నవి చెలి
చిలిపి చేష్టల తుళ్ళింతలతో
కొలనులో పరిగెట్టే చేపలను పోలిన కనులు
ఎదలోని అనురాగాల ఆలాపనలను
మౌనంగా వినిపిస్తూ అరమోడ్పులవుతున్నవి చెలి
గులాబీల సోయగాలను చేమంతుల చెమరింపులతో
రంగరించి పోతపోసినారేమో ఈ చెక్కిళ్ళను
నన్ను నీలో చూపిస్తూ ఉంటే
నేనే నీవన్న ..నీలో నేనున్న నిజం
యమునలో విరిసిన ఈ పద్మం
నీటికై నీతో వచ్చిన ఈ కడవ సాక్ష్యం కదూ చెలి
ఈ రాధాకృష్ణుల ప్రేమ తత్వం
అజరామరమైన సుందర సుధా మధుర కావ్యం
అనురాగాల ఆరాధనల అద్వైత్యమైన భక్తి విశ్వాసాలకు
ఆదర్శమై నిలచిన అపురూపమైన అమృత కలశం
అచంచలమైన నిత్యయవ్వన చరితం రాధామాధవీయం !