17, జూన్ 2018, ఆదివారం

ఎందుకో..
హృదయం అంత సముద్రమై పొంగుతుంది ఎందుకో
మూన్నాళ్ళ ముచ్చటే జీవితమని తెలుపుతుంది ఎందుకో
పూవు పూవు పై వాలుతూ తుమ్మెద
మధువంత తాగి పూవునూ మరుస్తుంది ఎందుకో ..
మావి చిగురు మేసినా గండు కోయిల
కుహు కుహు రావాల పలకకుంది ఎందుకో ..
పున్నమి చంద్రుని వెన్నెలని దోచుకొన్నా గోదారమ్మ
వేదనల ఉప్పెనలతో ఉరుకుతుంది ఎందుకో ..
ఏ మమత కోసమో మూగదైనా మనసు
ఎదురు చూపుల వర్షాన్ని కురిపిస్తుంది ఎందుకో..
శీర్షిక : "రంగస్థలం "
గ్రీష్మ తాపానికి నెర్రెలిడిచిన నేలమ్మ
ఆవిరవుతూ ఆశగా చూసింది నింగివైపు 
ఏ సంతోషమో గాని గగనతలంలో గాలి
ఈవల ఆవల మబ్బులన్నిటిని ఒకటిచేస్తూ .
హోరు హోరున ఈలలు వేస్తుంది..
నాట్యాలు చేసే మేఘాలకి పోటీలెక్కువైనాయేమో
పోట్లాటలకు దిగి భీబత్సవం సృష్టిస్తున్నాయి ..
ఇదే అదునని మెరుపుకన్నెలు అందాలారబోస్తున్నాయి ..
రంగస్థలమైన ఆకాశం నుంచి చప్పట్ల చినుకులు ..
చిటపటమంటూ చేరి ధరణిని ముద్దాడుతున్నాయి..!!
రారాజులము ..
నేలమ్మని నమ్మినాము ..
నింగికేసి చూసినాము ..
కరి మబ్బులు కమ్ముకు రావా..
కానుకగా వర్షపు చినుకలనీయవా..
కష్టానికి నెరవమని
వీస్తున్న ఈ గాలి దొరకి తెలుసు..
సూరీడి తాపానికి తాను ఆవిరై
మా కన్నుల చేరి ..
కన్నీరై పారుతున్నానని ..
ఆ చెరువు తల్లికి తెలుసు...
పచ్చని పైరుల నిండుగ కంకులతో
వచ్చిపోవు పక్షుల పలకరిస్తూ
నందనవమల్లె ఉన్న ఈ భూమికి ..
ఏ కరువు రక్కసి దిష్టి చూపు చూసిందో..
మూడేళ్ళ నుంచి ముక్కలు ముక్కలుగా ఇరిగి
చెలమ తడి కానరాని భీడైనదీ..
ఎదురు చూపులే వేడుకోలుగా ఎంచి..
ఓ వానదేవా...కనికరము చూపుమయ్యా..
ఆలుబిడ్డల అరచేతిల అన్నం ముద్దనుంచు
అదృష్టమునిచ్చి ఆదుకోవయ్యా...
అన్నపూర్ణమ్మ వారసులము మేము
రైతన్నలము ..పంటచేలలో పరవశించు రారాజులము ..!! .
అదిగదిగో చిలుక
ఎగిరి పోతున్నది ఎచటికో
అది గదిగో చిలక
గుండె గూటిలో 
గుబులుగున్నదని
ఎగిరి పోతున్నది చిలక
శ్వాసల చప్పుళ్లకు
బెదిరిపోతూ ...
ఎగిరి పోతున్నది చిలక
మాట్లాడలేని మౌనాలలో
నలిగి పోతూ ...
ఎగిరిపోతున్నది చిలక ..
నశించిన మనిషితనంలో
మలిగిపోతూ ...
ఎగిరి పోతున్నది చిలక ..
రగిలే ద్వేషపు మంటల్లో
మసి అయిపోతూ ..
ఎగిరి పోతున్నది చిలక ..
ఆత్మ అను పేరుతొ
ఆహరహరము అల్లాడుతూ ...
ఎగిరిపోతున్నది చిలక ...
కాయం విడిచిన చిలక
విశ్వంలో పరమాత్మను వెతుకుతూ ...
ఎగిరి పోతున్నది చిలక...
నిజం...నిజం..
నీ తలపుల
కలవరింతల కవుగిలింతలచెరలో...
నే బందీనయ్యానే...
మూత పడని కనులకు నేనొక
ప్రశ్నగా మిగిలానే....
చెలీ ..
.నీ నీడలో దాగిననను
ఒక్కసారి చూపులు సారించి చూడు....
నీ.. నిలువెల్లా...నేనవుతా... నీతోడు....
ప్రణయ కలహమిది ...
పోనీలెమ్మనుకున్నా....
ఎదను తన్నినా ...
సత్య కొంగు విడువనికృష్ణయ్య...
మా గురువన్నా....
చెలీ ...
ఒక్కసారి నువు నా
చెంతకు చేరితే...చాలు...
మన వలపు ప్రమిదెలొ వెలిగే దీపం..
ఆరనివ్వ నెన్నటికీ ... ఇది ..నిజం..నిజం..!!.
నీ ఊహల్లో బందీనీ చేసి..
మేలి ముసుగు పరదాల చాటున 
అందాలను దాస్తూ...
ఎదలోని సందడుల రంగులతో 
చిత్రించావు నన్ను ..
నీ వేలి కోసలలో నాట్యమాడుతూ
రంగులలో మునకలేసే కుంచె
చివరలతో నాకు మెరుగులు దిద్దుతూ
నీవర్పించిన ఆరాధనాంజలులు ..
నన్ను జీవితురాలిని చేసాయి ..
చిత్రపటంలో నిలువలేని నేను ..
నీకే అర్ధం అయిన ఈ సొగసు
పూ మాలికలతో నిన్ను
అభిషేకించాలనీ...
ఆర్తితో తలపుల తలంబ్రాలు పోస్తూ..
నీకై మిగలాలని....
సంగతులకు తెలియని చీర
కుచ్చిళ్ళ బరువును మోస్తూ..
అడుగు బయటకు వేస్తున్నా...
చెలికానివి నీవేనని నమ్ముతూ...!!

సాయి నాధా
సద్గురుదేవ
నీ చరణ ధూళి
సోకిన చాలు
శ్వాసలు నిలుచును 
చిర కాలాలు ..
నీ నివాసమే
షిరిడి గ్రామము
అయినది అదియే
పండరి పురము //సాయి నాధ //
నీటితో వెలిగిన
దీపాలే సాక్షి
మాయలు కావు
మహాత్ముడవు నీవని //సాయి నాధా //
సాయీ అని పిలిచిన చాలు
సమాధి నుండి పలుకుతావు
మనసున నిలిచి మార్గము చూపుతూ
బ్రతుకు బాటకు గమ్య మవుతావు //సాయి నాధా //