17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    *****నాయుడు బావవే కాలేవా...!********
    కొప్పులోన పెట్టిన మల్లెపూల ఊసులు...
    వినకుండా...ఏడకెళతావు బావా...
    ఎదలోన చేరి ...గుస గుసల రొదలను వినలేవా..

    పరువాల పట్టేమో పైటంచును దాటింది..
    పగటిని దాటేసి, సంధ్య చీకట్లను చేరింది..బావా..
    మదిచేసే మారాముకు మాలిమైన కాలేవా...
    ఏటి అలలు ఎక్కసంగ ఏదేదో చెపుతున్నాయి..
    గాలి తెరలు గిలగింతల అల్లరులే చేస్తున్నాయి బావా..
    ఏమరపాటు వీడి నీ వలపుల చెలిమిని చేయలేవా..
    ప్రాణాలన్ని నీపైనే..కలవరింతల క్షణాలైతే..
    నీ సందిట కాపురముంటా యుగాలకైనా బావ..
    ఈ ఎంకి చిక్కని చూపుల్లో చిక్కిన నాయుడు బావవే కాలేవా...
    **‘ని’ (నిర్వచనమెరుగని భవితే..)ర్భయ****
    సమాజంలొ స్త్రీ
    ఎన్నడూ సరితూగలేని ...
    పద్దార్ధమే అయింది...
    బ్రహ్మ దేవుని సృష్టిలొ
    ఆడపిల్లగా రూపుదిద్దుకొని..
    ఆమని అందాలకి ఆవాసమయింది..
    ఇంట గెలిచి..రచ్చ గెలిచి..
    రాజ్యాలేలే రాణి అయినా..
    అమ్మగా అవతరించినపుడు అనురాగ మూర్తే అయింది...
    అమ్మయిగా అభిమానాలను
    జన్మతః అరువు తెచ్చుకొని
    వాటిని కాపాడుకొనలేక అబలే అయింది..
    కట్టుబాట్ల సంఖెలలో ఒరుసుకొని
    కన్నవారి ప్రేమలకు కన్నీటిని నింపుతూ..
    ఊపిరి ఉన్నా కదలలేని శిలే అయింది...
    పురాణాలలో స్త్రీ ఆది శక్తేమోగానీ
    ప్రస్థుత పరిస్థితులలో ఆడది అంటే
    మగవాని మర్మాలకు మసలే మరబొమ్మే అయింది..
    "నడిరేతిరి రహదారిలో...
    ఒంటరిగా నడిచినపుడే స్త్రీకి నిజమయిన స్వాతంత్రం "
    అని మాహాత్ముడన్నాడట...
    కానీ పట్టపగలు మహిళ
    జనసమూహంలో...మానప్రాణాలు కోల్పోయే ఓ
    ‘ని’(నిర్వచనమెరుగని భవితే)ర్బయే అవుతుంది..!!
    రావాలి ..రావాలి ..ఎవరో..ఒకరు..(((
    ప్రాచీన కాలం నాటి వ్యవహారికంలో గల ...
    లోటు పాట్లకనుగుణంగా...
    ఆనాడు పెట్టుకున్న ఆచారాలు..
    రాను రాను అర్ధం చేసుకోను పరిణితి లేక ...
    మూర్ఖంగా పాటించేవే...ముడాచారాలయినవి..

    చాకలి వాని మాట పట్టింపుకు నిండు చూలాలని చూడక..
    అడవుల పంపిన ఆ రాముని సంస్కారాన్ని ...
    అలుసుగా చేకొని అనుమానం రోగంతో భార్యను
    ఆంపశయ్య పరుండజేసే భర్తలు ఎందరో....
    'కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా!' అని...
    మగవాడు ఏమి చేసినా చెల్లునను భావం అహంకారమైయితే..
    ఆ స్వార్ధపు కోరలలో చిక్కి బలి అయేది ఆడదే...
    రాజులు..రాజ్యాలతో పాటు...
    పోషించారు..రాజ నర్తకీమణులను..
    జమిందారులు తమ భేషజం కాపాడుకొందుకు ...
    జోగినులను తాయారు చేసారు..
    అదే రీతిన పసిమొగ్గల వంటి కన్నెలను..
    నోరులేని శునకాలతో పెళ్లి చేసి...
    తమ కామదాహానికి వారి మాన ప్రాణాలను
    మధువు సేవనంతో పాటు సేవిస్తున్నారు ...
    'ఇదేమిటి అంటే..' 'ఆచారం' అంటారు...
    నల్ల గుడ్డను కళ్ళకు గంతలుగా
    కట్టుకున్న న్యాయ దేవతా....!
    ఒక్కసారి నీ మనసును తట్టుకొని...
    కళ్ళగంతలు తీసి చూడమ్మా..
    ప్రతి గల్లిలో..ఓ చెల్లి..ఓ మల్లి...
    కన్నీటికి కూడా భాష్యమెరుగని చిట్టి తల్లి...
    అమాయకపు బెదురు చూపుల పాలవెల్లి..
    అమానుషాలకు..ఆకృత్యాలకు .
    ఆహుతి అవుతూనే ఉన్నారు...
    రావాలి ఎవరో ఒకరు..మరో...
    రాజారామ్ మోహన్ రాయ్...
    ఆడవారి జీవితాల ఆటలాడు.
    తరాల అంతరాలను అంతమొందించ...
    రావాలి ఎవరో ఒకరు...మరో..
    విరేసలింగం పంతులు ...
    అతివల అశువులు తుడిచి..
    భావి జీవితాల వెలుగులు నింప....
    రావాలి..... రావాలి.. ఎవరో..ఒకరు....
    కధన రంగం కాదు ఇది..
    కరుడు గట్టిన పాషాణ హృదయాలను కరిగించ..
    వెన్నెల మనసుల... దీపాలను వెలిగించ..!
    ************కలంతో సేద్యం**************
    అన్నప్రాసన నాడు కలం పట్టుకున్న నన్ను చూసి..
    'నా బిడ్డ కలెక్టరు...అవుతుంది..' అని మురిసారట నాన్న..
    ఆ మురిపం తీర్చ ...కలెక్టరు నయితే అవ్వలేదు కాని.....
    కలం మాత్రం నా జీవనయానపు అడుగులలోని
    ప్రతి కదలికలకు లయగా నిలిచింది..

    'ఓం ' కారంతో మొదలయిన అక్షరాభ్యాసంతో ..
    'అ ఆ'లనుదిద్దిన బాల్యపు...వేళ్ళ చివరల్లో కలం చేరి..
    అక్షర విత్తనాలను పోగేసుకుంటూ..
    ఎదలోని భావాలకు ప్రతిరూపం ఇస్తూ..
    తానో హలం అయి సేద్యమే చేస్తుంది..
    కాగితాలపై...కవితల పంటలను పండిస్తూ...
    స్పందననెరిగిన ప్రతి కవిలోని అనుభవం ఇదేనేమో..
    అందుకే రామాయణ ..మహాభారత గ్రంధాలు..
    వేదాలు ...ఉపనిషత్తులు...అన్నీ...
    కలం చేసిన మహత్యాలే కదా..!
    నారాయణరెడ్డి రసభరిత గీతాలు ...
    శ్రీ శ్రీ గారి ఉత్తేజపూరిత గేయాలు..
    కరుణశ్రీ గారి పుష్పవిలాపం ఏది అయితేనేమి..
    దేవులపల్లి సరళ లలిత స్వరములేమి..
    ఏవైనా...ఎవరినయినా...
    కనుచూపుల కవ్వించాలన్నా....
    పదునైన కత్తిలా ఎదను చీల్చాలన్నా.....
    అది సాధ్యం ఒక్క కలానికే....
    ఇది లోకం ఎరిగిన సత్యం...
    ఆది ..అంతం లేని నిత్య నూతనమైన
    చరిత్రగా నిలిచి చిరస్థాయిని పొందేటంత నిజం..!

    మాలో ఒకడివి..
    మము గాచే వాడివి..
    తల్లి తండ్రుల హృదయము
    కలిగి...ప్రేమించు వాడివి..
    గురువువై..సన్మార్గమున ...
    నడిపించు వాడివి...
    దైవము నీవై...
    కోటి ప్రభలతో...
    జీవితమును వెలిగించు వాడివి..
    అయినా...
    మాలో ఒకడివి..
    మము గాచే వాడివి...
    సాయి నాధా...
    సద్గురు దేవా...
    సమస్యలెన్నయినా.....
    సమాధానము నీవే కాదా....
    సాయి నాధా...
    సద్గురు దేవా....!
    రేపల్లె లోనా
    వెన్న దోచావు...
    మా పల్లె లోనా
    నన్నే దోచావు...
    ఇంకెందుకు రా......
    ఆ కొంటె నవ్వులు...
    మత్తు జల్లే..మరుల
    మరుమల్లె పువ్వులు...
    కృష్ణా...కృష్ణా...కృష్ణా...
    చీరెలెత్తుకెళ్ళి నా
    చిద్విలాసము నీదే..
    వేణువూది సన్మోహితులను చేసే..
    మోహన రూపము నీదే....
    కృష్ణా..కృష్ణా..కృష్ణా....
    శూన్యం
    చేరలేని చూపుల కావలనున్నా..
    మనసుపొరలలో చిక్కుకొని..
    వేదనల భారాన్ని మోస్తూ.....
    క్షణాలని తనలోనికి జార్చేసుకుంటూ..
    సమస్తం తానేఅయి వ్యాపించి....
    స్పర్శనెరుగనీయక కమ్మేస్తుంది 'శూన్యం '

    'ఏమిలేదు' అన్న పదమే 'సున్న' అనుకుంటే..
    'సున్న' శూన్యం అయితే..
    అంతర్లీనమయిన ఆత్మని జతచేసుకుని చూసుకుంటే...
    పదిరకాల సమాదానాల పదవుతుంది..'శూన్యం'
    లోలోన దోబూచులాడుతూ....
    ఒక్కోసారి రెచ్చగొడుతూ..
    మరొక సారి మార్గం చూపిస్తూ...
    ఎల్లవేళలా 'నేనున్నా'నంటూ..
    వెంట వెంట ఉండే స్నేహశీలి 'శూన్యం'
    తపనలలో ఆకాశమై అనంతమవుతుంది
    తడి కన్నుల చెమరింపులలో..
    చల్లని అమ్మతనమై..సేద తీరుస్తుంది..
    సందిగ్ధావస్తలో..లక్ష్మణరేఖ అయి..
    ఆపదల గాచే ఆయువు పట్టవుతుంది..'శూన్యం'