9, మే 2015, శనివారం


హోళీ..హోళీ..!!


శిశిర ఋతువుకు వీడ్కోలు చెపుతూ...
వసంతానికి స్వాగతం పలుకుతూ....
బేదాలను మరచి..విభేదాలను విడిచి.....
ఎదలోన పూచే ఇంద్రధనుసు రంగులకు
ప్రకృతి అందించు అనేక రకాల హంగులను జతచేసి..
నవ్వుల పువ్వులను ..సరదాల సంబరాలను
ఒకరికొకరు పంచుకుంటూ..పండుగ చేసుకునేరోజే.. హోళీ...

పాల్గుణమాస పున్నమి నాటి రాత్రి..
ప్రతి మనిషిలోని స్వార్ధ పూరిత మలినాలను
ఇంటిలోని పనికిరాని ..చెదలు పట్టిన సామానులను
ఒక్క చోట కుప్ప పోసి...కామునిరూపం ఇచ్చి
వెన్నల సాక్షిగా ... దహనం చేస్తూ..
భానోదయంలో కొత్త చిగురుల కోటి ఆశలరంగులను
మమతల అత్తరులను... ఒకరికొకరు పులుముకుంటూ..
కేరింతల అల్లరుల సంబరాలను పండించే రోజే....హోళీ!
పురాణాల్లో ..రాధాకృష్ణుల ప్రణయరాగాలకావ్యమై
ప్రేమానురక్తుల పలకరింపుల ... వసంతోత్సమే ....
కాటేసే కాలనాగు కోరలలో చిక్కి ....చెదిరి పోతున్న బంధాలను
పటిష్టం చేయ ఏడాదికి ఒకమారైనా..మది తలుపులు తెరిచి
అనురాగ సుధలను రంగుల కలయికలలో రంగరించి
ఒకరికొకరు ఉల్లాసంగా సంబరాలు జరుపుకునే రోజైంది..హోళీ...!
చిట్టి పొట్టి చిన్నారుల చేతుల్లో అమాయకపు తోరణమై..
ఉరకలు వేసే వయసు చేయు సందడుల జోరులో
జారిపోయే క్షణాలరంగవల్లికలై ..
శరీరాలు సహకరించక పోయినా ..
ఉత్సాహం పొంగే మనసుతో.....
నాటి ముచ్చట్లను నెమరువేసుకుంటూ...
ఆ జ్ఞాపకాల అల్లికలో ఒద్దికై.....
తారతమ్యం మరపించి..మురిపించే మనసుల
సంబరాలను జరుపుకునే రోజే...హోళీ..!
ఆనాటినుంచి..ఈనాటివరకు..మరి ఏనాటికీ..
పండుగ ఎప్పుడు సరసమైనదే కావాలి గానీ ..
అపశ్రుతుల తీగెలను కదిలించే పెనుగాలి కాకూడదు..
నేలతల్లి అందించు మొక్కల సహజ రంగుల దీవెనలతో..
రసాయనాల విషాలను తరుముతూ..జరుపుకుందాం సంబరంగా హోళీ.. !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి