10, మార్చి 2015, మంగళవారం

ఏదీ, మన ఉగాది?

సోయగాల బొండుమల్లి సుగంధాలు విరజిమ్ముతూ
ఆసాంతం విచ్చుకున్న వేళ...
అలుకలతో అసుర సంధ్య...పడమటింటి గడప దాటిన
సూరీడుకి వీడ్కోలు పలికిన వేళ...
గగన సీమ తన జేగురు వర్ణపు మోమున
నల్లని మేలిముసుగు కప్పుకునే వేళ...

చైత్రమాసపు ఆరంభానికి సూచనగా...
అలవోకగా నెలవంకయై దొర నవ్వులు కురిపిస్తూ...
పాడ్యమి నాటి చంద్రుడు...
చెంతనున్న తారకతో చిక్కని సరసాల తేలుతూ...
మింటి రథంలో...ఊరేగుతున్నాడు...

మాఘంలో మావి చిగురులు మేసి మేసి,
మంద్రమైన మధురమైన స్వరాన్ని సంతరించుకున్న
మత్తకోకిల...తన గొంతును సవరిస్తూ....
కుహు కుహూ రావాలతో...స్వాగత గీతికతో...
ఆహ్వానిస్తోంది మన వసంత రాజును...

కొమ్మల నిండుగా గుత్తుల గుత్తుల వేప పూవులు...
ముత్యపు సరముల వోలె అగుపిస్తూ, మురిపిస్తూ...
పిందెల స్థాయిని దాటేసిన మామిళ్ళు...
తల్లుల ఒడిలోంచి తొంగి చూస్తూ, అలరిస్తూ...
మరీ మరీ పిలుస్తున్నాయి ఆమని రాణిని...

బొబ్బట్లూ, పులిహోరా, పాయసం, గారెలే కాక...
ఆరు రుచులూ మేళవించిన ఉగాది పచ్చడిని...
ఉదయానే ఆరగించిన తెలుగు ప్రజలు...
తీపిలోని మమతను, చేదులోని అసహనతను...
సమంగా ఆస్వాదిస్తూ...పంచాంగ శ్రవణం వింటున్నారు...

అయ్యయ్యో, అప్పుడే అయిపోయిందా ఈ ఉగాది?
లేదు లేదు... కాదు కాదు...
సమస్యలను సైతం నిర్భీతి గా ఎదుర్కొంటూ...
ఎదుటి మనిషిని మనవాడి గా ప్రేమిస్తూ...
దీన జనావళికి నీ చేయిని ఆసరాగా ఇస్తూ...
ఆత్మ విశ్వాసం అనే ఆభరణాన్ని అందంగా అందరం ధరిస్తే...
కాల కన్య కరుణిస్తుంది, కటాక్షిస్తుంది...

అప్పుడు...ప్రతి రోజూ నవ్వుల పంటలే...
ఆనంద నందనాలే... కురిసే విరిజల్లులే...
ఇంటింటా...ఊరూరా నిత్య ఉగాదులే!!!


****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి