24, ఫిబ్రవరి 2014, సోమవారం

గోదావరి ఒడ్డున అడుక్కుంటున్న పిల్లల చూసి...కంటి చెమ్మతో...

ఎందుకమ్మ గోదారి....!!

ఎందుకమ్మ! గోదారి...!!...
ఈ అవాంతర రాక..
అంతర్వేదిన సముద్రుడు
ఆగమన్నాడా..
నా హృదయసంద్రంలొ చేరినావు
ఉప్పొంగి వెల్లువై...
కనురెప్పల కట్టలే తెంచినావు..
ఎందుకమ్మ గోదారి...!!

ఆడపిల్లనని అలుసుజేసి
అయ్య నన్ను అమ్మజూపెనే...
అది భరించలేక అమ్మ
ఆయువే తీర్చుకొనె...
అనాధనై..
నీవిడిచిన తడి ఇసుకల
ఒడిజేరితిని...
నీ తరగల జోలలలొ..
సాంత్వనే పొందితిని
అడవి కాయలమ్ముకుంటూ
ఆకలే తీర్చుకొంటిని..
ఎందుకమ్మ గోదారీ...!!

నావ నడుపు ఈసుగాడు
ఆబగాజూస్తుంటే..
అది.."ఆరాధనే " అనుకొంటినీ..
ఎఱ్ఱబడ్డ అతని కనులజూసి
" ప్రేమే " నేమో అని బ్రమసితినీ..
నీ నీటిమీద తేలుతూ
నావలో ఊగితిని..
పున్నమి చంద్రుని సాక్షిగా..
వెన్నెల తాళి కట్టి
బాహువుల బందించినాడే..
మాయ పొరల మైకమే కమ్మెనే...
ఎందుకమ్మ గోదారీ....!!

లేత కిరణాలు
వెచ్చగా తగులగా..
తేరుకొని చూసుకుంటే...
ఒంటరినై..పడిఉన్నా..
ఇన్నాళ్ళూ దాచుకున్న

కన్నెతనమంతా దోచుకొని
దొంగలా జారుకున్నడే..
ఈసుగాడు...!!
నావలేని తెడ్డు బ్రతుకైనదని
ఇక తెలుసుకున్నా..
ఎంద్కుకమ్మ గోదారి..!!

పులకరింతలు
వేవిళ్ళుగా మారినాయి..
ఉమ్మనీటిలో
ఊపిరేపోసుకుంది మరోజీవి...
అమ్మనవుతున్నానని ఆనందమా..
వద్దనుకున్నా ఆగనిది
ఈ అనుభందము...
బొసినవ్వుల ఒడిచేరినదీ
ముద్దులు మూటకట్టే అమాయకత్వం..
గోదారమ్మ ఒడిన
పుట్టిన మరో గోదారే కధా!
నా పిల్ల పేరు " గోదావరి " కధా..!
ఎందుకమ్మ గోదారీ...!!

పడవలోన పనికి కుదిరి
పనిపాటలుజేస్తున్నా..
పాపతో ..పాటలే పాడుకుంటూ..
పసితనమే..నాదైనట్టు..

పట్నం సారులు నలుగురు
పడవేక్కి మందు కొట్టినారు
పాలు తాపుతున్న అమ్మతనాన్ని
పాశవికంగా ఛెరిచినారు
రక్తసిక్తమైన దేహంతో..
గుక్క పట్టిన గుండెతో..
గోదారమ్మా...!!
నీ ఒడిలో..
ఒదిగిపొదామనీ...నేనొస్తే...
నీ......
ఈ అవాంతర రాక
ఎందుకమ్మా...!! గోదారమ్మా!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి