17, జూన్ 2019, సోమవారం

పరువాలకు పుప్పొడిని అద్దుకోవాలనే తాపత్రయం
గమ్యం తెలియని గగనంలో పయనం
రంగు రంగు పూవులతో సంపర్కం
గ్రోలిన మకరందపుమత్తులో కోల్పోయిన జీవితం ..!!
మురిసే పూవు *
మెల్లె , మందారం, బంతి , చేమంతి
గులాబీలు, జాజులు పువ్వులలో
ఎన్ని రకాలో ..ఎన్నిన్నెన్ని రంగులో
రాజసమేలుతూ తోటలో విరబూసి
ఊగిసలాడుతున్నాయి వగలు పోతూ
తోటమాలి కష్టం .. యజమాని అభిరుచి
కలగలిపిన డాబు దర్పం దాగివున్నాయి
.ఈ తోటలో ..
ఉన్నత కుటుంబంలో జన్మించి
ఆ స్థాయి జీవనవిధానంలో పెరుగుతూ
కార్పరేట్ బడులలో చదివే చిన్నారుల
రాజరికాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి
ఈ పూవులు ...
తూరుపు రేఖలు చూడని నిశిలో. .
జరిగిన తప్పుకు ఊపిరి పోసుకున్న ప్రాణం
కుప్పతొట్టిలో కేరుమంటూ ఉంటే
.ఓ అమ్మ ఎత్తుకుని పెదాలు తడిపితే ..
మరో అమ్మ ఓ ముద్ద అన్నం పెడితే
గాలికి తిరుగుతూ ..కడుపు మంటతో
రాగాలు తీస్తూ మైమరచి పడుకునే పసివాడు
ఆ గొంతులోని మాధుర్యాన్ని అందరికి పంచేవాడే
వాడే రోడ్డుపక్కన పసివాడు
గాలికి కొట్టుకువచ్చి చెత్తాచెదారంలో చిక్కుకుని
మురికి నీటి సాయంతో ఫలధీకరించి మొలకయిందో విత్తనం
నాలుగాకులకింద మొగ్గతొడిగి ఓ పూవై విరిసింది
అందరినీ అబ్బురంలో ముంచి మత్తెకించే సుగంధాలతో
ఈ పూవే మురికి గుంటలో మురిసే పూవు!!
scontent.fhyd6-1.fna.fbcdn.net
నీకై తపించేనోయి !
భావనల సతతము
సాగే నీ ఆలాపనలు
మనమున నిరతము
నిలిచే నీ రూపములు
ఎద కోవెలలో
కొలువైతివి ప్రభూ
నీకభిషేకము చేయ
ఏటికి పరుగిడి కడవనీరు
తెచ్చినా..గానీ ....
మోహనమగు నీ వేణుగానం
పరిపరి విధముల నా
తలపులజేరి తడబాటుకు గురిచేసే
ఒలికిపోయే. కడవనీరు
ప్రభూ !
ఇక...
భక్తి విశ్వాసముల నిన్నభిషేకించితినోయి .
శ్వాసల అర్చనలు చేసితినోయి
ప్రాణపుష్పముల నివేదించితినోయి
ఆత్మఫలముల సమర్పణలో ఈ మీరా
కన్నుల జారే కన్నీటివరదల నీకై తపించేనోయి !
అచ్చంగా నిజం ..
ఆ శేషతల్పంపై
పాలసంద్రపు నురగల
అలల ఊయల లూగుతూ
చిద్విలాసుడై ....
తామరరేకులవంటి
పాదాలను ..
గులాబీ రేఖల
సుకుమార కరములతో
సుతిమెత్తగా వత్తుతూ
మగని వైపు ..
వలపు చూపుల సారించు
అర్ధాంగి శ్రీ లక్ష్మితో
నా వక్షస్థలం
'నీదే చెలి .. '
అన్న భావనల
అర్ధనిమీలిత నేత్రాల
తెలుపుతున్న
ఆ శ్రీ మహావిష్ణువే
నన్ను
అప్పుడు
ఇప్పుడు
ఎప్పుడూ
కాపాడే దైవం ..
ఓం నమో నారాయణాయ ..
*బంధనం ********
మాటలన్నీ మౌనాలయినాయి
భాషలన్నీ బరువై
కంటి రెప్పలకింద దాగినాయి
ఏ దశకో చేరిన హృదయం
నీ సరసన నిలిచినా చంద్రోదయం
నీ ప్రేమ సుధారసం
ఆస్వావాదించిన మనసుకిదే అమృతోదయం
నీ దూరంలోని చింతలన్నీ
ఆలకించిన రామచిలుకకే తెలుసునులే
కలవరింతలలో కలలు
సిగను చేరిన సిరి మల్లెలకే సొంతములే
కలువల సాక్షిగా మనం
కలుసుకున్న ఈ సమయం
పరుచుకున్న వెన్నెల నీడలో
ఇదే మన ప్రమాణాల పరిణయం
నీ చూపులలో ఒలికే సింధూరం
ఎన్నటికీ చెదరనిదీ ఈ కుంకుమతిలకం
నీ బాహువులలో బిగిసిన ఈ బంధనం
లోలకుల సాటి మురిసే ముక్కెర సంబరం ..!

" నా నేస్తం "
కనుకొలుకుల్లో నిలిచిన
విశ్వాసం నేస్తం
పీల్చిన ఊపిరిలోని
ప్రాణవాయువు నేస్తం
గుండె గదిలో స్థిరమైన
ఆయువు పట్టు నేస్తం
అవసరానికి ఆలంబనైన అన్నీ
తానై తానే నేనైన నా నేస్తం !
మరపు మడి "
ఆయువు తీరి ఆవిరి అవుతున్న
అనురాగాలను మనసుపొరల మధ్య
ఇరికించాలనే తాపత్రయం
ఎందుకో ఈ పిచ్చిమనసుకు ...
చూపులను దాటి పోయిన నీ రూపం
దూరంగా జరిగిపోయిన నీ అడుగులు
అంతరంగ ఆలోచనల చిక్కుముడిని
మాత్రం విప్పలేక వేసారుతున్నాయి ..
నిప్పుల కొలిమి అయినా ఈ నిజం
మనసు హద్దుకొనక తప్పనిదే అయింది
శవం కాలుతున్న వాసన గుండె చుట్టూ ..
అగ్ని జ్వాలలకాహుతైన మదిభస్మం
కనురెప్పల కట్టలను తోసుకుంటూ
ప్రవహించే గంగా యమునల సంగమంలో
కలిసి పునీతమవుతూ మరుపు మడి చేరుతుంది ..!