14, డిసెంబర్ 2016, బుధవారం

చినుకు..చినుకులలో....
ధాచుకోలేని తమకంతో మేఘుడు
వలపు చినుకులను చిట పట కురిపిస్తూ ఉంటె..
మందస్మిత ..మృదుమనోహరి ....సుందరి ..
అపస్మిత అయి..చినుకుల కడ్డుగా ఛత్రం చేపట్టినా..
కొండల వాలునుండి కొంటె గాలి ..
దూసుకుంటూ వచ్చేసి...ఛత్రాన్ని లాగేసుకుంటూ..
తడిసిన వయ్యారాలను ఆసాంతం చుట్టేసింది.. .
కేరింతలతో కొలనులోని చాపపిల్లలు
ఎగిరి ఎగిరి పడుతున్నాయి....
వాటి అల్లరితో జత కలుపుతూ..
కన్నె మనసు జతగాని తలపుల
మైమరపులలో ..ఓపలేని ఒంటరి అయి...
అతని ఎద చేరి ..సేదతీర ఉవ్విళ్ళు ఊరుచున్నది..
ఆకాశాన్ని సాక్షిగా తెచ్చుకొని మేఘుడు..
చినుకు సూత్రం కట్టి తనదాన్ని చేసుకున్నాడే..
చిన్నదాన్ని వలచిన వాని వలపు...
వాకిట ఇక నిలవని నీటిగీతల రాతలేనా...
వొంపులను వెచ్చగా తాకుతున్న వలువలను
ఈర్ష్య తో...చూపుల శరముల పోరాటాలేనా...!!


(ఓ జ్ఞాపకాల ట్రంకు పెట్టెలో దొరికిన అరుదైన చిత్రం )
కొడుకునై పుట్టలేదు నాన్నా!
నీకు కడసారయినా వీడ్కోలు తెలిపేందుకు
అర్హత లేనిదాననైతినే...
అనురాగం పంచి నన్ను అలరించావే
ఆత్మీయతకూ అర్థమే నీవైతివే
కనురెప్పలు సైతం
నిదురించే సమయంలోఅవి నిదురిస్తాయి
నీ కనుపాపలలోనే నను నిలుపుకొని
అనుక్షణం గుండెల్లో దాచుకొని కాపాడుకుంటివే
తీర్చుకోలేని రుణంతో
శిరసు వంచి నమస్కరిస్తున్నా
నీవేలోకాలనున్నా.....
నీ ఆత్మ శాంతికై నా
హృదయకుసుమాన్ని సమర్పిస్తూ...
చెమరించిన కనులతో
శిరసు వంచి నమస్కరిస్తున్నా నాన్నా...!
మీ పాపగా శ్వాసిస్తూ...
(అప్పుడే దశాబ్దం 10 సంవత్సరాలు గడిచి పోయాయి...అశ్రు నివాళు లతో...)


నన్ను వీడని నా నేస్తం .....ఎంత అపురూపమో .)..
**కన్నీటి చుక్క....****
మేఘమధనం లోనుంచి..
వాన చినుకు పుడుతుంది..
హృదయమధనం లో.....
పురుడు పోసుకుంటుంది కన్నీటి చుక్క..!
ఎదలోపలి స్పందనలని తనలో దాచుకొని..
'నీరు పల్లమెరుగు ' అన్న నానుడికి విరుద్దంగా..
పైకి ఎగబ్రాకుతూ...అడ్డువచ్చే ఆలోచనలకోస్తూ..
కనురెప్పల కట్టలను అధిమి పెడుతూ...
చెంపల పైకి ధుముకుతుంది కన్నీటి చుక్క..!
ధనికులని...పేదవారని తేడాలు లేవు..
ఆడవారు..మగవారు అని గాని..
వయసులో చిన్నవారు అని..పెద్దవారని గాని..
బేదాలు ఎరుగని ...స్వచ్చమయిన ముత్యమే ...కన్నీటి చుక్క !
అమ్మ ప్రేమలోని అమృతానికి...
నాన్న వాత్సల్యపు మమకారాలకి ..
తోడబుట్టినవారి అనుబందపు సుగంధాల ఆస్వాదనలకు
జీవితం పంచుకున్నవారి అనురాగపు అలింగనాలకు
మాటలకందని భాష్యం చెపుతుంది ..కన్నీటి చుక్క..!
ఆనందాల ఆరాటాలకు..అవధులు లేవనిపిస్తుంది..
నైరాశ్యం ఆవరించిన వేళ ..నేనున్నాని తోడునిలుస్తుంది..
శూన్యపు చూపులకడ్డు నిలిచి..గమ్యాన్ని వెతికిస్తుంది..
మనలో మనకే తెలియని మరో మనసు ఉన్న
కనిపించని నేస్తం తానై మనలోనే... ఉండేదే కన్నీటి చుక్క ..!
పుట్టగానే కేరుకేరుమని..తానేడుస్తూ రాలుతుంది....
చితిపై చేరినపుడు ..తనవారిని చేరి ఏడిపిస్తుంది..కన్నీటి చుక్క..!!
*బడా కార్మికులు *******
నెల తప్పిన మరుక్షణంలోనే ...
మంచి స్కూల్ లో సీటుకై రిజర్వేషన్ ..
చేయించాలనే ఆరాటం కాబోయే తల్లితండ్రులది..
ఒకటికి ..రెండుకు ఎలా వెళ్ళాలో కూడా తెలియని పసితనాన్ని ....
డైపర్తో గాలాడనీయక బందించి ..అమ్మా నాన్నకి బదులు..
ఎబిసిడి నేర్చుకో .అంటూ..ప్లే స్చూల్ లో కూర్చో పెట్టే...
బలవంతపు 'అ'రాచరికం తల్లితండ్రులది..
గులాబి చెక్కిళ్ళు ఎర్రబడుతుంటే...
నిద్ర చాలని చిలికి కళ్ళు వాలిపోతుంటే...
పెదవంచున చొల్లు చుక్కలుగా కారుతుంటే..
కుర్చీలో కూర్చొని ఊగుతూ.జోగుతూ...ఊ అంటూ ఉండే..పసివాళ్ళు ..
తాతాబామ్మ చేతుల్లో గారాలు పోవలసిన వాళ్ళు..
అప్యాయతలు కరువై...అనాగరికం పెరిగి..
చదువుల పేరిట జరిగే స్కాముల్లో ఇరుక్కొని..
తమ ఉనికిని కోల్పోయి ..నిస్సహాయులై...
భావి భారతం ఏమో గాని..దిన దిన గండం లా..
బ్రతుకు భారమని తలపిస్తున్నారీ పసివాళ్ళు..
కూలి పనులు చేస్తూ.....డబ్బు సంపాదిస్తారు 'బాల' కార్మికులు.
బండెడు పుస్తకాలని వెన్ను వంగేల మోస్తూ...
చదువు అనుకుంటున్నదాన్ని కొంటున్నా రీ 'బడా' కార్మికులు.!!

వెలుగుతున్న ఆ
దిపమెంత చిన్నబోయిందో...చూడు...!!
నీ ఎదురుచూపులకు
సెలవు చెప్పమన్న...
నన్ను చూసిన ఈ క్షణాన...
నీ పెదవులపై విరిసిన
ఆ నెలవంక
కోటి పున్నముల
చల్లదనాన్నిస్తున్నదే...సఖీ!!
వేల వేల ...
విరహాల అనంతం
నీ బాహువుల
బందీనవ్వాలనే..నా
ఆకాంక్షను...
సఫలీకృతం చేసుకోనీయవే..
.మృదుహాసినీ....!!
*****నేటి బాల్యం ...******
బ్రతుకు అంటే తెలియనిది..
బంధాలను పెనవేసుకున్న ..
చిగురుటాకుల చిరునగవులది బాల్యం..
సత్యా అసత్యాలకు తేడా ఎరుగక
అమ్మా నాన్నల అడుగుజాడలలో
తమ అడుగులు కలుపుతూ నడక నేర్చేదే బాల్యం..
ఆకతాయి తనంలోను అమాయకత్వం
చేయి చేయి కలుపుకునే సహవాసం ..
అరమరికలు లేక కలిసిపోయే తనమే బాల్యం ...
ఆటల్లో ..పాటల్లో ..ఆహ్లాదమయ జీవితం
గిడిచిన కాలంతో పాటు కరిగిపోతూ..
స్మృతిలో మధురంగా నిలిచి ఉండేదే బాల్యం..
తరాలు మారుతున్న వైనంలో
తల్లితండ్రుల స్థితి గతుల మార్పులలో
నాలుగు గోడలకు బందీ అయి ...
చదువుల పేరిట బరువులు తలలో మోస్తూ..
వాలుతున్న రెప్పలను నిద్రమ్మ ఒడిని చేర్చి..
కాగితాలలో కలలకు లేఖలు వ్రాస్తుంది ..
ఈ నాటి తరం పిల్లలకు లభించిన బాల్యం..!!

17, నవంబర్ 2016, గురువారం



*****పావురమా **************
చిన్నారుల కేరింతలలోని స్వచ్చతని..
అరువు తీసుకున్నవా..పావురమా...
చా చా నెహ్రు గారి వెన్నెలకురిపించే చూపుల
కొలనులో మునకలేసావా పావురమా..
అందుకే నీ ఆగమనం ప్రతి మనసుకు
శాంతిని ప్రసాదిస్తుంది కదూ పావురమా..!.
కల్మషం ఎరుగక నీవు గగనంలో విహరిస్తూ ఉంటే..
వెన్న ముద్దలు కృష్ణునికై.. వెతుకుతున్నాయా..?
ఆ దరి..ఈ దరి...రెక్కలల్లారుస్తూ...
కువకువల చప్పుళ్ళతో నల్లనయ్యను పిలుస్తున్నాయా.?.
ఎన్ని ప్రశ్నలు మా మదిని తొలుస్తున్నాయో,, పావురమా..!
స్వార్ధ రాక్షసుని విషపు కోరలు మనిషిని చంపి..
మానవత్వపు పేగులను మెడను వేసుకు తిరుగుతుంటే..
రెక్కలు విప్పని పసిగాయలు 'ఆడపిల్ల ' అని..
కన్ను తెరవకనే..కడుపులోనే.. కడతేరి పోతుంటే..
ఆవేదనల అగ్నిగుండం గుండెలో నింపుకొని ..
కొడుకు పుట్టాలనే అహంకారంతో..కాపురం చేస్తూ..
అమ్మగా చచ్చి..ఆలిగా నిలిచే ఆడదాని ఆత్మ ఘోషను
విశ్వం అంతా తిరుగుతూ చాటి చెపుతావా పావురమా..
ఆది ..అంతం .. 'ఆమె 'లోనే ఉందని తెలుపుతావా పావురమా..!