23, ఏప్రిల్ 2016, శనివారం



చెల్లి ..
దూరమయిన అమ్మా నాన్నల
తలపుల్ని మదిలో దాచుకొని...
ఎదలో నిన్ను పొదువు కుంటాను చెల్లి..!
అన్ననై నీ అడుగు తడబడ నీయక
నా అరచేతుల నీ పాదాల ఉంచి
ఎప్పుడూ వాడనిపచ్చికనై అమరుతాను తల్లీ..!
మాటల గాలం వేసే మాయా లోకంలో
మనం ఒకరికొకరం...తోడయినాము
అనాధలం కాము మనం..ఆవేదన వద్దు చెల్లీ..!
ఆకలయినా..ఆరాటమయినా..
కలిసి పంచుకునే...పేగు భందం మనది..
పెద్దలిచ్చిన ఆస్తి ..ప్రేమానురాగాల ఈ పొదరిల్లె తల్లీ..!
చందమామ నడిగితే..ఇవ్వలేను గానీ
అమావాస్య ఎరుగని వెన్నెల నుంచుతా
నిన్నే ఓ జాబిల్లిగా మలచి చల్లగా చూస్తా చెల్లీ..!!

19, ఏప్రిల్ 2016, మంగళవారం



కంటి చెమ్మ ...
ఎప్పుడూ అది కావాలి...ఇది కావాలి.....
అని అడుగుతూ ఉండేదానివే....కదా తల్లీ...
అడిగినదే తడవు గా...సాధ్యమయినంత వరకు...
నీకు అన్నీ ఇచ్చాను రా...బంగారు..
ఇప్పుడు నన్నే అడుగు తుంటే...
నన్ను ...నేనెలా ఇవ్వను రా...పిచ్చి తల్లి...
అప్పగింతల వేళ ...ఆవేదనే అయినా...
ఇది ఆనంద సమయమే ప్రతీ తల్లితండ్రులకు..
దూరమయినా.... దగ్గరితనంలోని మమకారం ..
కూతురి కాపురం కోసమే...కలవరం.రా..అమ్మడు
గుండెల మీద పారాడిన నీ పసితనం ..
గూడుకట్టుకుందమ్మా ఎద లోగిలిలో..
నేను గుఱ్ఱం అయి..నిన్ను స్వారి చేయిస్తాను..
గుజ్జన గుళ్ళు ..అష్టా చెమ్మలు ఆడుకుంటూ..
ఆగూటిలో...నేను నీతోనే ఉంటానురా..నాన్నా..!
యుగ యుగాలకు తండ్రి కూతుళ్ళ అనుభందం
నిత్య నూతనమే...ఆ అనురాగానికి అవధులు లేవు..
అరమరికలు ఎన్నడూ కానరావు..
అదే..నాన్నప్రేమ..కూతురిలో దాగిన కంటి చెమ్మ !!

17, ఏప్రిల్ 2016, ఆదివారం

ముఖారవిందం....
ఎడారిలో చిన్న..
నీటిచెలమకై...
వెతుకులాడే జీవితం..
యాత్రికమైన పనులకు
ఆలవాలమైన శరీరం...
వేదన...రోదనల
మద్య ...నలుగుతూ
ఆశలను ఆవిరి చేసి ....
అక్కరకు రాని
ఆలోచనలచుట్టాలను
అక్కున చేర్చుకుని...
నెలవంకనవ్వులను చెరిపేసి...
స్మైలీ పోష్టర్ ను అతికుంచుకొన్న
అందమైన అబద్దపు
ముఖారవిందం..!!
ఆవాసం..
ఆకాశమే వంగి హాయ్ ...అన్నది...
ప్రతి చినుకు పలకరింపుల
ప్రేమ కురిపిస్తున్నది...
పరువాలు తడిచి పాడమన్నవి..
ప్రణయ రాగాల మరులు
విరబూస్తూ....తేలమన్నవి...
ఏకమైన హృదయాలలో
వీణా... నాధాలేవో..మ్రోగుతున్నవి...
ఫలించిన అనురాగాలలో
విరహాలన్నీ...
విరంచిలయి చెలరేగుతున్నవి..
కావ్యమైన మనకధ
కౌగిలిలొ.... కరిగి..
నిజమైన కలలకు ఆవాసమైనది..!!

13, ఏప్రిల్ 2016, బుధవారం

శ్రీ రామ నవమి ....
పుత్రకామేష్టి యాగ ఫలం వలన..
రఘుకుల తిలకుడు పునర్వసు నక్షత్రాన జన్మించి ..
ముగ్గురు తల్లుల ముద్దుల తనయుడే కాక 
ముగ్గురు తమ్ముల అన్నగా
దశరధుని ప్రియ పుత్రునిగా ..
దినదిన ప్రవర్ధ మానమవుతూ...
సూర్య తేజంతో..ఆజానుబాహుడైనాడు ..
నీల మేఘ శ్యాముడు ...ఆ రఘరాముడు...

సురాసురులు ..యక్షకిన్నెర 
మహోరగులకు కదలని శివ ధనుసును
విశ్వామిత్రుని అజ్ఞానుసారం 
ఆ ధనుస్సును ఒక్కచేతితో పట్టుకొని
ఎక్కుపెట్టినంతనే..పిడుగులాటి శబ్దంతో ...
విరిగిపడిపోయింది....
ప్రమోదమైన మనసుతో...
నునుసిగ్గుల సీత తన 
అనురాగాల మాలనలంకరించింది . .

ఆరిఆరని తాటాకుల పందిళ్ళు ..
చిగురులు తొడిగిన లేతాకుపచ్చని మామిడి తోరణాలతో
వసంతానికి గుర్తుగా విచ్చుకున్న 
మల్లెపూల మకరద్వజాలు ...
సువాసనల విందు చేస్తూ
కస్తూరి తిలకం పెట్టి ..
మణిబాసికం నుదుటను గట్టిన 
రామయ్య పెళ్లి కొడుకైతే...
సౌందర్యాలన్నీపోగై 
పుత్తడి బొమ్మైనట్లున్న జానకి 
పారాణిపాదాల పెళ్లి కూతురైంది..
పుష్పవర్షం కురుస్తుండగా 
దేవదుందుబుల మ్రోతతో 
ప్రాంగణమంతా ప్రతిద్వనించగా ..
మాంగళ్యధారణ ..ముత్యాల తలంబ్రాలతో..
వధూవరులు ..కన్నుల పండుగే నాడు .
.
తండ్రిఆనతికై పదునాలుగు సంవత్సరాలు 
కారడవులకేగి...దుష్ట రాక్షసుల సంహరిస్తూ
సీతాపహరణం చేసిన రావణుని వధించి..
తిరిగి నవమి నాడు పట్టాబిశక్తుడైనాడు రాముడు!!

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఒక్కటిగా....

ఆలోచనల ఆలింగనంలో
ఎప్పుడు అల్లరిపెడుతూనే ఉన్నా...
కనుచూపుల దారిలో కనిపించని నీవు ..
కన్నీటికి కారణమవుతున్నావు...
ఎద సంద్రంలో ఎగసిపడే
అలల ఘోష ఎప్పుడు విన్పించుకోవెం..!!
చల్లని వెన్నెల పంచే జాబిల్లి సైతం
వేదనలు కలిగించే వేడిలో
కరిగి.... తానో కథవుతుందే..!!
భవిష్యత్తుని మింగేసే గతం...
మన జీవిత ప్రాకరాలను తాకనివ్వకుండా..
నువ్వు..నేను ...అనే ఈ నిజాన్ని
వాస్తవం చేసుకుంటూ..
ఒక్కటిగా..ఒకరిలో ఒకరమై
సాకారమైన బ్రతుకును పండించుకుందాం ప్రియా..!!

10, ఏప్రిల్ 2016, ఆదివారం

మద్య తరగతి మహిళ ...

అమ్మ నాన్నల అపరంజి అయినా....
తలవంచి తాళి కట్టించుకుని ..
తనదంటూ లేని జీవితమే కోరుకుంటుంది......
చిటికెడు పసుపుతో పాటు...
పిడికెడు ప్రేమని కోరుకుంటూ..


భాద్యతల బరువు...
ఆలోచనల ముసురు ..
సంసారం జలధిలో..
ఎదురీదే చాపలవలె..
అనుక్షణం ఆందోళనల లోకమే..
మధ్యతరగతి మహిళమనసు..!!
See More